కచ-దేవయాని వృత్తాంతం

 

కచ-దేవయాని వృత్తాంతం

నైమిశారణ్యం-12

 



అసురగురువు శుక్రాచార్యుడు కఠోరతపస్సులో నిమగ్నుడై ఉన్నాడు. ఆయన తపస్సు భగ్నం చేసిరమ్మని ఇంద్రుడు తన కుమార్తె అయిన ‘జయంతి’ని శుక్రాచార్యుని దగ్గరకు పంపాడు. జయంతి తన వయో,రూప,లావణ్యాలతో...,నృత్య,గాన విశేషాలతో శుక్రుని మనస్సును చిందర వందర చేసి విజయం సాధించింది. శుక్రుడు.., జయంతితో కలసి సాగించిన శృంగార తపస్సులో  ఓ అందమైన అమ్మాయి పుట్టింది. తను వచ్చిన పని పూర్తికావడంతో.., జయంతి స్వర్గానికి వెళ్ళిపోయింది. శుక్రాచార్యుడు తన కుమార్తెకు ‘దేవయాని’ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. పదునారు సంవత్సరాలు గడిచేసరికి, నవయవ్వన శోభతో మెరుపుతీగలా తయారయింది దేవయాని. ఆ రోజులలో దేవ, దానవులమధ్య దారుణమైన యుధ్దాలు జరుగుతూండేవి. ఆ యుద్ధాలలో మరణించిన రాక్షసులను అసురగురువు శుక్రాచార్యుడు తన దగ్గరున్న మృతసంజీవిని విద్యతో బ్రతికించేవాడు. దేవగురువు బృహస్పతికి ఆ విద్య తెలియదు. అందుచేత దేవతలు అధిక సంఖ్యలో మరణించేవారు. విజయం ఎప్పుడూ రాక్షసుల పక్షాన ఉండేది. అది బృహస్పతికి అవమానకరంగా తోచి, తన కుమమారుడైన కచుని, మృతసంజీవిని విద్య నేర్చుకుని రమ్మని శుక్రాచార్యుని దగ్గరకు పంపాడు. కచుడు, శుక్రాచార్యుని ఆశ్రమానికి వచ్చి విద్యాదానం చేయమని శుక్రుని అర్ధించాడు. కచుడు ఎందుకు వచ్చాడో గ్రహించిన శుక్రాచార్యుడు, ఆచార్యధర్మానికి కట్టుబడి.., కచుని శిష్యునిగా స్వీకరించాడు.  శతకోటి మన్మధావతారంగా ఆశ్రమంలోకి అడుగు పెట్టిన కచుని చూడగానే, దేవయానికి మూర్ఛ వచ్చినంత పనైంది. ఇంత అందగాడికి సొంతం కాని ఎంత అందమైనా వ్యర్ధమే అనుకుంది. తొలిచూపులోనే తన మనస్సు కచునికి అర్పించుకుంది. ఇక మిగిలింది.., కచుని మనస్సు తను సొంతం  చేసుకోవడమే. అందుకోసం ప్రయత్నాలు చేయమని వయసు పోరు పెడుతున్నా.., ఆశ్రమ ధర్మాలకు, కట్టుబాట్లకు  మధ్య పెరిగిన ఆమె మనస్సు.., తొందరపడనీయకుండా ఆమెను నియంత్రించి ఆపేది. కచుడు శిష్యుడుగా చేరడం రాక్షసశిష్యులకు నచ్చలేదు. అలాని, గురువుగారిని ధిక్కరించి కచుని అశ్రమం విడిచిపొమ్మని చెప్పే ధైర్యము వారికి లేదు. శుక్రాచార్యునికి కూడా మృతసంజీవినీవిద్యను కచునికి చెప్పడం ఇష్టంలేదు.

ఆ విద్య తప్ప తక్కిన విద్యలన్నీ కచునకు నేర్పుతున్నాడు. కచుడు కూడా విసుగు చెందకుండా, గురు శుష్రూష చేస్తూ, తగిన సమయంకోసం ఎదురుచూస్తూ విద్యలు నేర్చుకుంటున్నాడు. దేవయాని మౌనంగా కచుని ప్రేమిస్తూనేవుంది. దేవయాని మూగప్రేమను కచుడు గ్రహించాడు. తను వచ్చింది ప్రేమకోసం కాదు, విద్య కోసం. అందుకే తన దృష్టిని, మనస్సును ఏనాడూ దేవయాని వైపు తిప్పలేదు. ఒకరోజు సమిథల కోసం అడవికి వెళ్ళిన కచుని.., రాక్షసశిష్యులు చంపేసారు. చీకటి పడినా కచుడు ఆశ్రమానికి రాకపోవడంతో కలత చెందిన దేవయాని కన్నీళ్ళతో ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. కూతురుమీద ప్రేమతో శుక్రాచార్యుడు తన దివ్యదృష్టితో మరణించిన కచుని విషయం తెలుసుకుని, మృతసంజీవిని విద్యతో కచుని బ్రతికించాడు. తన ప్రేమమూర్తి పునర్జీవితుడైనందుకు దేవయాని సంతోషించింది. కానీ, రాక్షసశిష్యులకు కచుడు బ్రతికిరావడం నచ్చలేదు. తిరిగి తగిన సమయం చూసి కచుని చంపేసారు. దేవయాని దుఃఖం చూడలేక శుక్రాచార్యుడు తిరిగి కచుని బ్రతికించాడు. ఇలా చాలాసార్లు జరిగింది. ఈసారి రాక్షసశిష్యులు బాగా ఆలోచించి, మరోసారి కచుని సంహరించి, అతని చితాభస్మాన్ని సురలో కలిపి శుక్రాచార్యుని చేత తాగించారు.  కచుడు ఆశ్రమంలో కనిపించకపోవడంతో దేవయాని కన్నీళ్ళతో శుక్రుని దగ్గర నిలబడింది. దేవయాని కళ్ళలో నీరు చూడలేక శుక్రుడు దివ్యదృష్టితో చూసి కచుడు తన ఉదరంలో ఉన్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. కచుడు బతకాలంటే తను మరణించాలి. తను బతకాలంటే కచునకు మృతసంజీవినీ విద్య నేర్పాలి. బాగా ఆలోచించి, తన శరీరంలోనున్న కచునకు మృతసంజీవినీ విద్య నేర్పాడు. కచుడు శుక్రాచార్యుని శరీరం చీల్చుకుని బయటకు వచ్చాడు. శుక్రుడు మరణించాడు. శుక్రుని బ్రతికించవద్దని దేవతలంతా కచునకు నచ్చచెప్పారు. గురుద్రోహం చేయలేనని కచుడు మృతసంజీవినీ విద్యతో, శుక్రాచార్యుని బ్రతికించాడు. దేవయాని సంతోషించింది. తను వచ్చిన కార్యం నెరవేరడంతో కచుడు గురువుగారిదగ్గర సెలవు తీసుకుని స్వర్గం వెళ్ళడానికి సిద్దమవుతున్న సమయంలో దేవయాని కన్నీళ్లతో వచ్చి తన ప్రేమను తొలిసారి తెలియజెప్పి, తనను విడిచి వెళ్ళవద్దని అర్థించింది. కచుడు వినలేదు. తన వయసును,సొగసును విరహాగ్ని జ్వాలలకు ఆహుతి చేయవద్దని ప్రార్థించింది. కచుడు వినలేదు. తను గురుద్రోహం చేయలేనని, గురుపుత్రిక సోదరితో సమానమని ధర్మాలు చెప్పి ముందుకు కదిలాడు. దేవయాని ఇక ఆగలేక పోయింది. కోపంగా... ‘ఆగు.., మనసిచ్చిన ప్రేయసి ప్రేమను అర్థం చేసుకోలేని నీకు నా తండ్రి అనుగ్రహించిన మృతసంజీవిని విద్య ఫలించకుండు గాక’ అని శపించింది. కచుడు బాధపడలేదు. చిరునవ్వుతో..,‘దేవయానీ.. మృతసంజీవిని విద్య నాకు ఫలించకపోవుగాక. కానీ, నానుంచి నేర్చుకున్న వారికి అది ఫలించుగాక. కానీ, ధర్మబద్ధుడనైన నన్ను శపించిన నేరానికి నిన్ను బ్రాహ్మణుడు వివాహమాడకుండు గాక’ అని ప్రతిశాపమిచ్చి స్వర్గం వెళ్ళిపోయాడు కచుడు. ఏ బంధాలు లేని కాలం ముందుకు సాగుతూనేవుంది.

శుక్రాచార్యుడు అసురేశ్వరుడైన వృషపర్వుని కులగురువు. వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ అహంభావి. ధేవయాని ఆమె స్నేహితురాలు. ఒకరోజు శర్మిష్ఠ..దేవయానితోను, చెలికత్తెలతోను కలిసి వనవిహారానికి వెళ్ళి అక్కడున్న కొలను దగ్గర తమ దుస్తులు ఉంచి  జలక్రీడలు సలుపుతున్నారు. ఇంతలో ఈదురుగాలి వీచడంతో వారి దుస్తులన్నీ కలిసిపోయాయి. ఆ కంగారులో దేవయాని శర్మిష్ఠ దుస్తులు ధరించింది. అది చూసి శర్మిష్ఠ కోపంగా...‘దేవయానీ...నీవెంత స్నేహితురాలివైనా, నా చెలికత్తెవు. నీ తండ్రి నా తండ్రి దగ్గర సేవకుడు. నీవు ఆ అంతరాలు మర్చిపోయి నా దుస్తులు ధరించావు..’ అని పలుకుతూ దేవయాని ఎంత  బ్రతిమాలుతున్నా వినకుండా ఆమె దుస్తులు ఊడదీసి, దేవయానిని నగ్నంగా అక్కడున్న పాడుపడిన బావిలోకి తోసివేసి తన చెలికత్తెలతో వెళ్ళిపోయింది. ఈ సంగతి తెలుసుకున్న శుక్రుడు, దేవయాని దగ్గరకు వచ్చి ఆశ్రమానికి రమ్మని  పిలిచాడు. ఆ అహంకారి రాజ్యానికి రానని దేవయాని మొండికేసింది. శుక్రుడు రాక్షస రాజైన వృషపర్వుని దగ్గరకు వెళ్ళి, జరిగినది చెప్పి తను రాజ్యం విడిచి వెళ్ళిపోతున్నట్టు చెప్పాడు. శుక్రుడు తన రాజ్యం విడిచి వెళ్ళడం వృషపర్వునకు ఇష్టంలేదు. శర్మిష్ఠను తన కుమార్తె దేవయానికి దాసిని చేసే పక్షంలో తను రాజ్యంలో వుంటానని అన్నాడు శుక్రుడు. వృషపర్వుడు అంగీకరించాడు. ఇంతలో బావిలోనున్న దేవయాని రక్షించమని కేకలు వేయడంతో వేటకు వచ్చిన యయాతి మహారాజు తన ఉత్తరీయాన్ని అమెకిచ్చి, తన చేతిని ఆమెకు అందించి బయటకులాగి కాపాడాడు. ‘నా మాన, ప్రాణాలు కాపాడిన మీరే భర్త, నన్ను వివాహం చేసుకోండి’ అని దేవయాని యయాతిని అర్థించింది.

‘నేను క్షత్రియుడను, బ్రాహ్మణ కన్యను వివాహమాడడం ఎంతవరకు ధర్మం’ అన్నాడు యయాతి. దేవయాని, కచుడు తనకిచ్చిన శాపం గురించి యయాతికి చెప్పింది. యయాతి ఆమెను వివాహమాడడానికి ఒప్పుకున్నాడు. శుక్రాచార్యుడు కూడా వారి వివాహానికి అంగీకరించాడు. దేవయాని, యయాతుల వివాహం ఘనంగా జరిగింది. దేవయాని వెంట ఆమె దాసిగా శర్మిష్ఠ నడచింది. దేవయాని, యయాతుల సంసారయాత్రలో వారికి యదువు, తర్వసువు అను ఇద్దరు పుత్రులు కలిగారు. ఒకరోజు శర్మిష్ఠ, యయాతిని సమీపించి ‘స్వామీ, నేనూ మీ దాసినే. నా అందం, వయసు, సొగసు అడవిగాచిన వెన్నెల చెయ్యద్దు. నన్ను కూడా సంతానవతిని చెయ్యండి’ అని అర్థించింది. యయాతి అంగీకరించి, ఆమెకు సహకరించాడు. శర్మిష్ఠ సంతానవతి అయింది. ఈ సంగతి తెలిసి దేవయాని, శుక్రులు కోపోద్రిక్తులయ్యారు. యయాతిని వృద్ధుడవు కమ్మని శుక్రాచార్యుడు శపించాడు. యయాతి క్షమించమని శుక్రుని వేడుకున్నాడు. ‘నీ పుత్రులలో ఎవరైనా తమ యవ్వనాన్ని ధారపోస్తే నీకు యవ్వనం వస్తుంది’ అని  శుక్రుడు అన్నాడు. దేవయాని పుత్రులు కాని, శర్మష్ఠ ప్రధమ సంతానం కానీ తమ యవ్వనం తండ్రికి ఇవ్వడానికి ముందుకురాలేదు. శర్మష్ఠ కడగొట్టు పుత్రుడు ‘పూరువు’ తన యవ్వనాన్ని తండ్రికి ధారబోసాడు. యయాతి విషయ వాంఛల వలయంలో విసుగు చెందే వరకు తిరిగి, విరక్తి చెంది ఆ యవ్వనాన్ని తిరిగి పూరువుకు అప్పగించి, హస్తినాపురానికి అతన్ని పట్టాభిషిక్తుని చేసి,భార్యలతో కలసి వానప్రస్థ ఆశ్రమం స్వీకరించాడు. ఆ పూరువే ‘పురువంశానికి మూలపురుషుడు. 

- యం.వి.యస్.సుమ్రహ్మణ్యం