అవక్రీతుడు

 

           అవక్రీతుడు

 

 

నైమిశారణ్యం - 14


రైభ్యుడు మహా తపశ్శక్తి సంపన్నుడైన గొప్ప ఋషి. ఇతడు ఎంతో భక్తి, శ్రద్ధలతో గురువులను సేవించి సకల విద్యలు నేర్చుకున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు అర్వావసుడు, చిన్న కుమారుడు పరావసుడు. వీరిద్దరూ తండ్రిలాగే
సర్వవిద్యలు నేర్చుకున్నారు. బృహద్యుమ్నుడను మహారాజుకు ఋత్విక్కులుగా ఉన్నారు. రైభ్యుని, అతని కుమారుల కీర్తి దశదిశలు వ్యాపించడంతో.., భరద్వాజుని కుమారుడైన ‘అవక్రీతునికి’ అసూయ పుట్టింది. ఎందుకంటే, అవక్రీతుడు పెద్దగా చదువుకున్నవాడు కాదు. ఎలాగైనా రైభ్యుని కన్నా, అతని పుత్రుల కన్నా గొప్ప విద్యావంతుడు కావాలనుకుని, తన తండ్రి దగ్గరకు వెళ్ళి, ‘తపస్సుచేసి సకల విద్యలు సంపాదించాలని అనుకుంటున్నాను, అనుఙ్ఞ ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు భరద్వాజుడు ‘కుమారా...మనకన్నా గొప్పవారిని చూసి ఆనందించాలే కానీ, అసూయ పడకూడదు. విద్యలు గురువుల దగ్గర అభ్యసించి నేర్చుకోవాలిగానీ.., తపస్సు చేసికాదు. ఈ ప్రయత్నం మానుకో’ అని హితవు చెప్పాడు. అవక్రీతుడు వినలేదు. తండ్రి మాటను కాదని సకల విద్యాప్రాప్తికై తపస్సు ప్రారంభించాడు.

అవక్రీతుని తీవ్ర తపస్సుకు సంతసించిన ఇంద్రుడు ప్రత్యక్షమై ‘ఏం వరం కావాలో కోరుకో’ అన్నాడు. ‘నాకు సమస్త విద్యలు రావాలి. అనుగ్రహించు’ అని కోరాడు అవక్రీతుడు.
‘విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవాలి గానీ, తపస్సు చేసి సంపాదించరాదు’ అని హితవు చెప్పి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అవక్రీతుడు ఇంకా మొండిగా తపస్సు చేస్తున్నాడు. అవక్రీతుని చేత తపస్సు మన్పించాలని ఇంద్రునికి అనిపించి ఒక వృద్ధ బ్రాహ్మణవేషం ధరించి, అవక్రీతుని సమీపాన నిలచి గుప్పెళ్ళతో గంగానదిలోకి యిసుకను జల్లుతున్నాడు. అది చూసిన అవక్రీతుడు ‘మీరేం చేస్తున్నారు’ అని అడిగాడు. ‘గంగానది పైన సేతువు కట్టడానికి యిసుకను జల్లుతున్నాను’ అన్నాడు ఆ మాయా ఇంద్రుడు. అవక్రీతుడు నవ్వి ‘ఈ యిసుకతో గంగానది పైన సేతువు కట్టుట సాధ్యమయ్యే పనేనా’ అని హేళనగా అడిగాడు. ‘తపస్సుతో సకల విద్యలు నేర్వాలను కోవడం మాత్రం సాధ్యమయ్యే పనేనా’ అని మయా ఇంద్రుడు అడిగాడు. ‘సకల విద్యలు నేర్వనిదే తపస్సు మానేది లేదు’ అని బదులిచ్చాడు అవక్రీతుడు. అతని దీక్షకు సంతసించిన ఇంద్రుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి అవక్రీతునకు సకల విద్యలు అనుగ్రహించాడు.

 



ఆ విద్యాగర్వంతో అవక్రీతుడు, రైభ్యుని, అతని పుత్రులను జయించాలనే సంకల్పంతో రైభ్యుని ఆశ్రమానికి వచ్చి, అక్కడ రైభ్యుని కోడలిని చూసి కామవశుడై, తన కోరిక తీర్చమని ఆమెను అడిగాడు. అతడు గొప్ప తపశ్శక్తి సంపన్నుడని గ్రహించి, అతను ఎక్కడ శపిస్తాడోనని భయపడి, అతనికి అనుకూలంగా సమాధానమిచ్చి, ఇప్పుడే వస్తానని చెప్పి, తన మామగారైన రైభ్యుని దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది. రైభ్యుడు కోపగించి.., ఒక సుందరాంగిని, ఒక రాక్షసుని సృష్టించాడు. ఆ సుందరాంగి అవక్రీతుని సమీపించి అతని కమండలాన్ని అడిగింది. ఆ సుందరాంగిని చూడగానే కామించిన అవక్రీతుడు తన కమండలాన్ని ఆమెకు ఇచ్చాడు. అతని శక్తి అంతా ఆ కమండలంలోనే ఉంది. వెంటనే ఆ రాక్షసుడు అవక్రీతుని మీదకు ఉరికాడు. అవక్రీతుడు ప్రాణభయంతో పరుగెత్తుకుని వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు. కానీ ఆ సముద్రం ఎండి పోయింది. వెంటనే అవక్రీతుడు తన తండ్రి ఆశ్రమానికి వచ్చి అగ్నిహోత్రంలో దాక్కున్నాడు. అగ్నిహోత్రుడు చల్లారిపోయాడు. అప్పుడు ఆ రాక్షసుడు అవక్రీతుని, అతని తండ్రియైన భరద్వాజుని కూడా చంపి వెళ్ళిపోయాడు.  

ఆ రోజులలో ఒకానొక ఛీకటి రాత్రినాడు పరావసుడు పొరపాటున తన తండ్రి అయిన రైభ్యుని చంపడం జరిగింది. తండ్రిని చంపిన పాపానికి పరావసుడు మిక్కిలి బాధపడి, ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. అప్పుడు అతని అన్న అర్వావసువు, తమ్ముని ఊరడించి
తండ్రిని చంపిన పాపం, బ్రహ్మహత్యాదోషం పోవడానికి, ఉగ్రకర్మలతో కూడిన ఎన్నో హోమాలు, యాగాలు చేసాడు. ఆ తర్వాత అతను బృహద్యుమ్నుడు చేస్తున్న యాగానికి వెళ్ళాడు. అక్కడ ఋత్విక్కుగానున్న పరావసువు..,యాగదీక్షితుడైన రాజుతో తన అన్న బ్రహ్మహత్య దోష పరిహారార్థం ఉగ్రక్రతువులు చేసినవాడు.., అట్టివానికి యాగశాలలో ప్రవేశించే అర్హత లేదు.. రానీయద్దు.. అని చేప్పాడు. అప్పుడు కోపగించిన అర్వావసువు ‘బ్రహ్మహత్య చేసినవాడు నా తమ్ముడైన ఈ పరావసువు. నేను కేవలం వాని బ్రహ్మహత్య దోష పరిహారార్థం ఉగ్రకర్మలు చేసాను.. అంతే’ అని బదులిచ్చాడు.
దేవతలు అతని సత్యనిష్ఠకు సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నారు. అప్పుడు అర్వావసువు.., మరణించిన తన తండ్రిని, రైభ్యుని, కుమారుడైన అవక్రీతుని బ్రతికించమని కోరాడు. అతని కోరిక ప్రకారం దేవతలు వారందరినీ బ్రతికించారు. బ్రతికిన అవక్రీతుడు ‘నేనుకూడా సకల విద్యలు నేర్చానుకదా...నన్ను చంపగలిగిన శక్తి రైభ్యునకు ెలా వచ్చింది’ అని దేవతలను ప్రశ్నించాడు. ‘రైభ్యుడు గురువులకు సేవలు చేసి, వారి అనుగ్రహంతో సకల విద్యలు నేర్చుకున్నాడు. నీలా తపస్సు చేసి విద్యలు సంపాదించలేదు. అందుకే అతనికా శక్తి’ అని దేవతలు బదులిచ్చారు. అవక్రీతుడు తన తప్పు తెలుసుకుని, గురువులను ఆశ్రయించి సకలవిద్యలు నేర్చుకుని ఎంతో కీర్తిప్రతిష్ఠలు సంపాదించాడు.
                                                   

  - యం.వి.యస్.సుబ్రహ్మణ్యం