Read more!

లోకానికి మూలపురుషులు సూచించిన మార్గం!!

 

లోకానికి మూలపురుషులు సూచించిన మార్గం!!


"ఈ లోకంలో ఉండే మనుషులకు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఆ మహా ఋషులు ఏడుగురు, వారే కాకుండా సనకుడు మొదలగు నలుగురు దేవ ఋషులు, మనువులు, వీరందరూ కూడా నా మానస పుత్రులు." అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. 

ఒక మనిషి, అతనికి తల్లిదండ్రి, తాత, అవ్వా, ఇంకా కొందరికి అయితే ముత్తాతలు, జేజవ్వల గురించి తెలిసి ఉంటుంది. నేరుగా చూడకపోయినా తల్లిదండ్రుల మాటల్లోనో, అవ్వా, తాతల మాటల్లోనో విని వుంటారు. 

అయితే అసలు ఈ మనుషులకు మూలం ఎక్కడ??  

ఈ మానవ లోకంలో ఉన్న వాళ్ళకు గోత్రాలు ఉన్నాయి. వాటికి మూల పురుషులు ఉన్నారు. వాళ్లనేసప్తఋషులు. ఉదాహరణకు కశ్యపుడి నుండి పుట్టిన వారు కాశ్యప గోత్రము వారు. వారి మూల పురుషులు, కశ్యపుడు, వత్సారుడు, నైద్రువుడు. ఇలాగా అన్ని గోత్రములకు మూల పురుషులు ఉన్నారు. అందుకే సగోత్రీకుల మధ్య వివాహములు చేయరు. ఎందుకంటే వీరి మూల పురుషులు (డి.యస్.ఏ లు) ఒకరే కాబట్టి, అన్నచెల్లి సంబంధం అవుతుంది. సంతానము బలహీనంగా ఉంటుంది అని భావన.

సప్త ఋషులు 7 మంది. వీరి పేర్లు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, గౌతముడు, భరద్వాజుడు, అగస్త్యుడు, కశ్యపుడు. (వీకి పేర్లు వివిధ పురాణాలలో వేరు వేరుగా ఉన్నాయి. కొన్నిటిలో భృగువు, పులహుడు, క్రతువు, మొదలగు వారి పేర్లు కూడా ఉన్నాయి. గమనించండి) 

దేవ ఋషులు నలుగురు(4).  వీరు సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులు. 

ఇంక మనువులు బ్రహ్మకు ఒక రోజులో 1000 మహా యుగములు గడుస్తాయి. అంటే 4000 యుగాలు. ఈ నాలుగు వేల యుగాలు 14 మన్వంతరాలుగా విభజింప బడ్డాయి. 14 మన్వంతరాలకు 14 మంది మనువులు పరిపాలకులుగా ఉన్నారు. వారి పేర్లు 1. స్వాయంభువ మన్వంతరము, 2. స్వారోచిష మన్వంతరము, 3. ఉత్తమ మన్వంతరము 4. తామసమన్వంతరము. 5. రైవత మన్వంతరము. 6. చాక్షుష మన్వంతరము, 7. వైవస్వత మన్వంతరము. 8. సావర్ణి మన్వంతరము. 9. దక్షసావర్ణి మన్వంతరము. 10. బ్రహ్మ సావర్ణి మన్వంతరము. 11. ధర్మసావర్ణిమన్వంతరము. 12. రుద్రసావర్ణి మన్వంతరము. 13. దేవసావర్ణి మన్వంతరము. 14. ఇంద్రసావర్ణి మన్వంతరము. మనం ప్రస్తుతం వైవస్వత మన్వంతరం అంటే ఏడవ మన్వంతరంలో ఉన్నాము. ఈ మనువుల సంతతిని మానవులు అని అంటారు. మన అనే పదమే ఇంగ్లీషులో మాన్ అయింది. మనసుతో ఆలోచించే వారు మానవులు ఎందుకంటే జంతువులు, పక్షులకు ఆలోచించే శక్తి లేదు.

నలుగురు మహాఋషులు,

7 సప్తఋషులు, 

14 మంది మనువులు..... వీరంతా కూడా ఆ పరమాత్మ యొక్క సంకల్పము నుండి ఉద్భవించిన వారు. ఈ సృష్టికి వీరే మూలపురుషులు, వీరందరికీ భగవంతుని మీద అనన్య భక్తి, ఆత్మజ్ఞానము పుష్కలంగా ఉంది. 

మరి ఈ సృష్టి ఇలా ఎందుకు జరిగింది అని ప్రశ్నించుకుంటే, ఒకటే సమాధానం. మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రవృత్తి మార్గము. అంటే ప్రాపంచిక విషయములలో లీనం అయ్యే మార్గము. రెండవది నివృత్తి మార్గము అంటే ప్రాపంచిక విషయములను వదిలి పరమాత్మ వైపు ప్రయాణించే మార్గము, నివృత్తిమార్గం సనకాదులు అనుసరిస్తే, సప్తఋషులు, మనువులు మనకు ప్రవృత్తి మార్గాన్ని అంటే గృహస్థాశ్రమాన్ని సూచించారు. ముందు ప్రవృత్తి మార్గాన్ని అనుసరించి తరువాత నివృత్తి మార్గాన్ని అనుసరించారు. మనకు కూడా ఇదే మార్గాన్ని సూచించారు.


                                ◆వెంకటేష్ పువ్వాడ.