Read more!

నిశ్చలత్వమే రహస్యం!

 

భగవద్గీతతో విజయవంతమైన కెరీర్‌ – 4

నిశ్చలత్వమే రహస్యం!

 

కెరీర్‌ లో గెలవాలనే లక్ష్యం ఉంది. దాన్ని దక్కించుకోగలననే నమ్మకమూ ఉంది. ఎలా ముందుకు వెళ్లాలి, ఎటు అడుగులు వేయాలనే స్పష్టత ఉంది. వీటన్నింటితో పాటుగా ఉండాల్సినది స్థిరత్వం. మనం ఇప్పుడు రకరకాల మోహాలు పలకరించే కాలంలో ఉన్నాం. సెల్‌ ఫోన్‌ పట్టుకుంటే చాలు… రోజులు సెకన్లుగా గడిచిపోగలవు. ఒటిటిలో తలపెడితే, పండిపోయేదాకా తెలియదు. సోషల్‌ మీడియాలో లాగిన్‌ అయితే మనసు పరుగులు తీయాల్సిందే. వీటితో సమయమే కాదు, వ్యక్తిత్వమూ చేజారిపోగలదు. ఇంతేనా! మద్యం, పోర్న్‌, వీడియో గేమ్స్‌ అంటూ సవాలక్ష వ్యసనాలు అందుబాటులో ఊరిస్తున్నాయి.

అందుకే… ఇంద్రియాలు ఎటు లాగితే అటు వెళ్లిపోకుండా ఉండమంటూ గీత పదేపదే హెచ్చరిస్తుంది. ఆ మాటకు వస్తే… అసలు అర్జునుడి రథానికి పూని కనిపించే గుర్రాలు ఇంద్రియాలకీ, అర్జునుడు మనసుకీ ప్రతీక అని చెబుతారు. 

యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ।

ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా 

తాబేలు తన శరీరభాగాలను లోపలకి చాచుకున్నట్టు, మనిషి తన ఇంద్రియాలను విషయ వస్తువుల నుంచి ఉపసంహరించుకున్నప్పుడే అతని ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. అదేమంత తేలిక కాదు కదా! అందుకే ఇంద్రియాలు, మనసును కూడా బలవంతంగా లాక్కుపోతాయి అని హెచ్చరిస్తాడు. అంతేకాదు… 

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః

స్మృతిభ్రంశాద్బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి 

‘విషయవాసనల్లో చిక్కుకున్న మనసుకు వాటితో అనుబంధం ఏర్పడుతుంది. దాని నుంచి క్రోధం, క్రోధం నుంచి అయోమయం, అయోమయంతో మతిమరపు, ఆ మతిమరపుతో చివరికి విచక్షణ కోల్పోతాడు… అంటూ పరిణామాలను వివరిస్తాడు. మరి ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవడం ఎలా? 

ఇంద్రియ విషయాలు అనే కారడవిలో తిరిగే పెద్దపులే మనస్సు అంటుంది వివేకచూడామణి. దాని వైపు పోకుండా ఉండటమే మేలని చెబుతుంది. దాని కోసం మన ఏకాగ్రతను లక్ష్యం మీద కేంద్రీకరించడం ఒక్కటే దారి. కెరీర్‌, పరీక్షలు, ఉద్యోగం, ప్రమోషన్‌… ఇలా ఏదో ఒక లక్ష్యం మీద దృష్టి పెడితే మరే ఆకర్షణా మన దృష్టి మరల్చలేదు.

- నిర్జర.