సిల్లీ ఫెలో - 108

 

 

సిల్లీఫెలో - 108

- మల్లిక్


డోర్ బెల్ మోగితే లేచెళ్ళి తలుపు తీసాడు మోహన్.

ఎదురుగా మేనేజర్ ఏకాంబరం!

ఈ కిల్లారి కిత్తిగాడు ఇప్పుడెందుకొచ్చాడబ్బా అనుకుంటూ మోహన్ కంగారుపడిపోయాడు.

"వాటే ప్లజేంట్ సర్ ప్రయిజ్ సార్! రండి సార్ రండి!" అంటూ లోపలికి ఇన్ వైట్ చేశాడు మోహన్. ఇప్పుడెందుకు వచ్చా అని తిట్టుకుంటూ.

ఈ ప్రక్క సందులోనే మా బంధువులయన ఉన్నాడు. అతనికి ఒంట్లో బాగోలేదంటే చూద్దామని వచ్చాను.నువ్విక్కడే ఉంటావని తెలిసింది.... అందుకే వచ్చా. ఇక్కడిదాకా వచ్చి మీ యింటికి రాకుండా పోయాననుకో... మా బాస్ గాడు చాలా లెవల్ చూపిస్తాడులే తనే పెద్ద మేనేజర్ ననీ... అంటూ తింగరి మింగిరిగాడిలా ప్రచారం చేస్తావ్... అవునా?"

"అబ్బే... నేను అలాంటి వాడిని కాద్సార్!" అన్నాడు మోహన్.

ఇద్దరూ హాల్లోకి వచ్చారు. అక్కడ సీత కూర్చుని వుంది. ఆమెని చూస్తూ "నమస్కారమమ్మా" అంటూ సీతకి నమస్కారం పెట్టి "మీ శ్రీమతేగా?" అని అడిగాడు ఏకాంబరం మోహన్ ని.

సీత ఇబ్బందిగా మొహం పెట్టింది.

"అబ్బెబ్బె... కాదండీ..." కంగారుగా అన్నాడు మోహన్.

"ఓహో.. మరదలా?"

"కాదండీ..." మన బుచ్చిబాబు లేడూ?"

"ఓహో... అతని భార్యా?"

"కాదండీ..." బుర్రగోక్కున్నాడు మోహన్.

సీత అప్పటికే లేచి లోపలికి వెళ్ళిపోయింది.

"అయితే అతని మరదలా అడిగాడు ఏకాంబరం.

"అబ్బే కాదండీ.. ఆమె బుచ్చిబాబు తాలుకు! పేరు సీత!!" చెప్పాడు మోహన్.

"బుచ్చిబాబు తాలూకానా? అంటే అతనికేమవుతుంది? అయినా బుచ్చిబాబు తాలుకా అయితే మీ యింటిలో ఎందుకుంది?" అయోమయంగా అడిగాడు ఏకాంబరం.

"ఆ విషయాలన్నీ మీకు ఆఫీసులో చెప్తాను సార్!" అన్నాడు మోహన్. తర్వాత మోహన్ రామలక్ష్మిని పిలిచి ఏకాంబరానికి పరిచయం చేశాడు.

కాఫీ తీసుకుంటారా అని అడిగితే వద్దు.. వద్దు... ఇంకా యింటికెళ్ళాలి! ఆఫీసుకు తయారయి వెళ్ళాలి అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు ఏకాంబరం.