సిల్లీ ఫెలో - 106

 

 

సిల్లీఫెలో - 106

- మల్లిక్

ఆ రాత్రి బుచ్చిబాబుకి సరిగా నిద్రపట్టలేదు. అతని బుర్రనిండా ఆలోచనలే!

అతని తల్లిదండ్రులు ఎన్ని రోజులు ఉంటారో తెలీదు. సీత మోహన్ వాళ్ళింటిలో ఏం అవస్థలుపడాలో ఏమో! మీరెప్పుడు వెళ్తారు? అని తల్లిదండ్రుల్ని అడగడం బాగోదు. ఒకవేళ సీతకి చికాకుపుట్టి సూట్ కేసు తీసుకుని ఇంటికొచ్చేస్తే అప్పుడెలా? వీళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి?

ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పుడో అర్థరాత్రి అతని నిద్రలోకి రోగాడు.

తెల్లారి నిద్రలేచేసరికి ఏడు దాటింది. కంగారుగా సోఫాలోంచి క్రిందికి దూకి వంటగదిలోకి పరుగుతీశాడు. అక్కడ పార్వతమ్మ అప్పుడే వంట మొదలు పెట్టేసింది. బుచ్చిబాబు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. నిద్రమత్తులో వచ్చిన సంగతే అతనికి తట్టలేదు.

హమ్మయ్య... ఈవేళ మనకేం హడావిడి లేదన్నమాట... అనుకున్నాడు.

బుచ్చిబాబు వచ్చిన అలికిడికి పార్వతమ్మ వెనక్కి తిరిగి చూసింది.

"నిద్రలేచావా బుచ్చీ పాపం! మొహం కడుక్కునిరా కాఫీ ఇచ్చేస్తా" అంది.

బుచ్చిబాబు అయిదు నిమిషాల్లో మొహం కడుక్కుని వంట గదిలోకి వెళ్ళాడు.

"అమ్మా కాఫీ" అన్నాడు.

"ఉండు... వేడి చేస్తున్నా" అని చెప్పి "ఒరేయ్ నిన్నో విషయం అడగనా?" అంది మెల్లగా.

"మళ్ళీ ఏ కొంపలు ముంచే విషయం అడుగుతుందోనని గుండెలు గుబగుబలాడ్తుండగా "ఏంటి?" అన్నాడు బుచ్చిబాబు.

"నిన్న సాయంత్రం ఇల్లు సర్దుతుంటే నాకు లోపలి లంగాలూ, గాజులూ, కాటుక కూడా కనిపించాయ్... అవన్నీ ఇక్కడెందుకున్నాయిరా? నాకేంటో భయంగా ఉందిరా పాపం! మీ నాన్నకీ విషయం చెప్పలేదు. చెప్తే గుండెలు బద్దలయ్యేలా అరుస్తారు పాపం"

"బుచ్చిబాబు ఒక్క క్షణం గతుక్కుమని అంతలోనే గలగలా నవ్వేస్తూ "ఓ హదా? హహహ... మరేమో నేను రాత్రి పూట ఒట్టిగా చీర కట్టుకుంటే అసయ్యంగా ఉంది నన్ను నేను అద్దములో చూసుకుంటే... అటు ఆడా ఇటు మగా కాకుండా ఏవిటీ రూపం అనిపించి అవన్నీ కూడా వేసుకుని చక్కగా కాటుక పెట్టుకుని, బొట్టు పెట్టుకుని పడుకుంటా ...హి!"

"మరి జడ ఉండదు కదా?" అమాయకంగా అడిగింది పార్వతమ్మ