Read more!

మువ్వ గోపాలుడి మొవ్వ

 

 

మువ్వ గోపాలుడి మొవ్వ

 

మొవ్వ అనగానే మువ్వ గోపాలుడు గుర్తుకొస్తున్నాడు కదూ. నిజమేనండీ. ఆ వేణు గోపాలుడు మౌద్గల్య మహర్షికి ప్రత్యక్షమైన ప్రదేశం ఇది. సామాన్య గోవుల కాపరి వరదయ్యను ఆ వేణుగానలోలుడు క్షేత్రయ్యగా మార్చి క్షేత్రయ్య పదాలకు నాందీ పలికిన ప్రదేశమిది. కృష్ణా జిల్లాలో కూచిపూడి నాట్యానికి ప్రసిధ్ధి చెందిన కూచిపూడికి 3 కి.మీ. ల దూరంలో వున్నది. వసతి, ఆహార సౌకర్యాలు కూచిపూడిలోనే. మీరు వెళ్ళేది మరీ అపరాహ్ణ సమయంలో కాకపోతే గుడి మూసి వున్నా తెరుస్తారు. పూజారిగారిల్లు ప్రక్కనే. ఆయనే అక్కడి చరిత్ర చాలా విపులంగా చెప్పారు.

పూర్వం ఈ ప్రాంతము కృష్ణా నదీ పరీవాహక క్షేత్రం. ఇక్కడ మౌద్గల్య మహర్షి తపస్సు చేస్తూ వుండేవారుట. ఆయనకి కృష్ణా నది ఒడ్డున ఇసుక దిబ్బల్లో ఈ వేణు గోపాల స్వామి విగ్రహం దొరికింది. ఆ విగ్రహ విశేషాలేమిటంటే శిలాకృతిలోనే, స్వామి వెనుక వున్న మకరతోరణం పై దశావతారాలు వున్నాయి.స్వామి ప్రక్కన రుక్మిణీ సత్యభామలు. చేతిలో వేణువుకు గాలి వూదే రంధ్రాలు కూడా స్పష్టంగా కనబడతాయి. ఈ విగ్రహం ఇసుక విగ్రహం కావటంతో అభిషేకాలు చేసేటప్పుడు కాళ్ళ దగ్గర కొచెం తరుగు ఏర్పడింది. అలాంటి విగ్రహాలు పూజనీయాలు కావని, 2000 సంవత్సరంలో అదే ఆకారంలో వున్న పెద్ద విగ్రహాన్ని చేయించి ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని వెనుక ఒక హాల్లో వుంచారు. ప్రస్తుతం పూజాదికాలులేవు గనుక ఈ విగ్రహాన్ని మనం ముట్టుకుని కూడా చూడవచ్చు. ఈ విగ్రహాన్ని చిన్నగా తడితే డొల్లు శబ్దం వస్తుంది. ఇసుకలోంచి ఉద్భవించిన విగ్రహం, ఇసుక తయారీ కనుక అలా వస్తుంది.

ఇంక వరదయ్య కధ: చాలా కాలం క్రితం వరదయ్య అనే గోవుల కాపరి గోవులను కాచుకుంటూ వచ్చి రోజూ ఈ విగ్రహం దగ్గర కూర్చుంటూ వుండేవాడుట. అతనికి చదువు సంధ్యలు ఏమీలేవు. ఒక రోజు అతనికి ఆ విగ్రహానికి పూజలు చేయాలనిపించి. అప్పటినుంచీ తనకు తోచిన విధంగా రోజూ పూజ చేసేవాడుట. ఒకసారి వేణు గోపాల స్వామి వరదయ్యకు కనిపించి నువ్వు కారణ జన్ముడవు. ఇక్కడ గోవులు కాయటం కాదు నువ్వు చెయ్యాల్సిన పని, నా గురించి ప్రచారం చెయ్యమన్నాడుట. దానికి వరదయ్య నాకు చదువూ సంధ్యా ఏమీ రాదు. నేను నీ గురించి ఏమి ప్రచారం చెయ్యగలను అని అడిగాడుట. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు, ఆ దేవ దేవుడే తలచుకుంటే చదువులకు కొదవా. వెంటనే స్వామి వరదయ్యని నాలుక చాపమని, అతని నాలుకమీద బీజాక్షరాలు వ్రాశాడు. దానితో వరదయ్య దశ తిరిగింది. ఆయన గొప్ప పండితుడై వేణుగోపాల స్వామి మీద అనేక పాటలు వ్రాశాడు. అవ్వే క్షేత్రయ్య పదాలుగా ప్రసిధ్ధికెక్కాయి.

వరదయ్య ఈ పదాలు పాడుకుంటూ ఎక్కువగా తిరిగేవాడు. ఆయన వ్రాసిన పదాలు కూడా ఎక్కువగా ఆయననొక గోపికగా వూహించుకుని వ్రాయటంతో భక్తికన్నా రక్తి ఎక్కువగా వుండేదని ఆంధ్రులు ఆదరించలేదు. వరదయ్య తిరుగుతూ తమిళనాడుకెళ్ళి అక్కడ వరదరాజ స్వామిని సేవిస్తూ అక్కడే వుండిపోయాడు. వరదరాజ క్షేత్రంలో వుండటంతో ఆయనకి క్షేత్రయ్య అనే పేరు వచ్చింది.

ఈ ప్రాంగణంలోనే ఆంజనేయ స్వామి ఉపాలయం వుంది. ఈయన కుడి చేతిలో ఖడ్గం, ఎడమ చేతిలో సంజీవని పట్టుకుని వుంటాడు. ఇలాంటి విగ్రహం ఇక్కడ ఒక్క చోటే వున్నదట. ఆరోగ్యానికి, దుష్ట గ్రహ పీడా నివారణకు, సకల ఐశ్వర్యాలకూ, ఈ స్వామిని పూజిస్తే మంచిదట. ఈయన్ని పూజిస్తే పంచముఖ ఆంజనేయ స్వామిలో వున్న అన్ని దేవుళ్ళనీ పూజించినట్లేట. 2000 సంవత్సరంలో ఈయన విగ్రహం స్ధానంలో కూడా అదే రూపు రేఖలతో ఇంకా పెద్ద విగ్రహం తయారు చేయించి పునః ప్రతిష్టించారు. పాత విగ్రహం, వరదయ్య విగ్రహం వెనుక హాల్ లో వేణుగోపాల స్వామి విగ్రహంతోబాటు భద్రపరచబడ్డాయి. మీరు చూసేది వాటి ఫోటోలే.

మాఘ పూర్ణిమకు వేణు గోపాల స్వామికి విశేష వుత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో యాత్రికుల బసకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తారుట. మిగతా సమయాల్లో మన సంగతి మనం చూసుకోవాల్సిందే.

నాట్యానికి పుట్టినిల్లు కూచిపూడి:

అక్కడనుండి బయల్దేరి 3 కి.మీ. ల దూరంలో వున్న కూచిపూడికి వచ్చాం. వీలయితే రాత్రి అక్కడ బస చేద్దామనుకున్నాం. కూచివూడి కళాక్షేత్రంలో కళాభిమానులకు ఏ.సి. నాన్ ఏ.సి. బస ఏర్పాట్లు వున్నా సాయంకాలం 5 గం. ల తర్వాత సిబ్బంది వుండని కారణంగా బస దొరకటం కష్టం. మేము వెళ్ళేసరికి రాత్రి 7-30 దాటింది. కళాక్షేత్రం మూసి వుంది. అప్పుడే బయటకి వస్తున్న లెక్చరరు ఒకాయన కొంత సమాచారం చెప్పారు. విశేష కార్యక్రమాలున్నప్పుడు తప్ప ఆ సమయంలో ఎవరూ వుండరు. ప్రక్కనే హాస్టల్ వున్నదిట. క్రింద ఒక హాలు తెరిచి వుంటుంది, దానిలో నాట్య కళలో ప్రముఖుల ఫోటోలుంటాయి. ఇంతదూరం వచ్చారుగా అవి చూసి వెళ్ళండంటే లోపలకి వెళ్ళాం. విశాలమైన ప్రాంగణం శుభ్రంగా ముంగిట ముగ్గులతో ఆహ్వానించింది. వాచ్ మేన్ ని అడిగితే ఆ హాలు తాళం తీసి చూపించాడు. నాట్య కళలో ప్రసిధ్ధి పొందిన ఎందరో మహానుభావుల ఫోటోలు, కొన్ని మనకు తెలిసినవి, కొన్ని అసలు పేర్లు కూడా విననివి, విశాలమైన హాలు గోడలన్నింటికీ అమర్చి వున్నాయి. అలాంటి ప్రదేశాల్లో విద్య నేర్చుకునే విద్యార్ధులు ఎంత అదృష్టవంతులో కదా అనుకుంటూ అక్కడనుండి బయల్దేరి విజయవాడ వచ్చాము.

విజయవాడనుంచి కారులో అర్ధ గంట ప్రయాణమే. క్షేత్రంమీత, క్షేత్రయ్య పదాలమీద ఆసక్తి వున్నవారు ఈమారు అటు వెళ్ళినప్పుడు ఈ రెండు ప్రదేశాలూ తప్పక చూడండి.

 

 

 

 

 

 

 

- పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)