Read more!

కృష్ణా పుష్కరాల సందర్భంగా... కృష్ణా తీరాన వెలసిన ఆలయాలు.......

 

 

 

కృష్ణా పుష్కరాల సందర్భంగా... కృష్ణా తీరాన వెలసిన ఆలయాలు.......

 

12-8-2016 నుంచి కృష్ణానది పుష్కరాలు ప్రారంభం.  వీటినో పండుగలా నిర్వహించటానికి ప్రభుత్వమూ, ప్రజలూ ఆయత్తమవుతున్నారు.  మీడియా వారైతే సరే సరి.  వీటిని దిగ్విజయం చెయ్యటానికి వారి శాయశక్తులా కృషి చేస్తున్నారు.  మరి మనంకూడా కాస్త పుణ్యం సంపాదించుకోవద్దూ.   పుష్కరాల గురించి అందరూ చెప్పేస్తున్నారు గనుక మళ్ళీ మిమ్మల్ని పాడిందే పాడి విసిగించకుండా, ఉపోద్ఘాతంగా కొద్దిగా పుష్కరాల గురించి చెప్తాను.  తర్వాత కృష్ణవేణమ్మ పుట్టిన ప్రదేశాన్నీ (మహారాష్ట్ర),  కూడలిని (కర్ణాటకా) తలుచుకుంటూ, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లలో కృష్ణా తీరాన వున్న కొన్ని ఆలయాల గురించి వివరంగా తెలుసుకుందాము.

 

12 ఏళ్ళకొకసారి వచ్చే పుష్కరాల గురించి మీరు చాలా విషయాలు తెలుసుకునే వున్నారు.  అయితే మన పూర్వీకులు ఏ విషయాలు చెప్పినా అందులో ఆరోగ్య సూత్రాలు, ప్రకృతి పరిరక్షణ వగైరాలు ఇమిడి వుంటాయి.  మనలాంటి బడుధ్ధాయిల సంగతి ముందే తెలుసుకుని మనం మామూలుగా మాట వినమని, దేవుళ్ళూ, పుణ్యాలు వగైరాలని చెప్పారు.  ఇప్పటివాళ్ళు అవ్వయితే అసలే వినరనుకోండి.  అవ్వన్నీ పక్కనబెట్టి మనం విషయానికొద్దాం.

 

కృష్ణానది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ లో పుట్టి ఆంధ్ర ప్రదేశ్ లోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.  మహారాష్ట్రనుంచి ఆంధ్రప్రదేశ్ దాకా మొత్తం 1300 కి.మీ. ప్రవహించి మహారాష్ట్ర, కర్ణాటకా, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ ప్రజల దాహార్తి తీర్చటమేగాక, అనేక లక్షల ఎకరాల పంట భూములను సస్య శ్యామలం చేస్తూ తన బిడ్డలని ఆశీర్వదిస్తూ సాగుతుంది.   తెలంగాణాలో నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలలోను, ఆంధ్ర ప్రదేశ్ లో గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాలలోను, రాయలసీమలో కర్నూలు జిల్లాలలోను ప్రవహిస్తున్నది ఈ నదీమతల్లి. కృష్ణానదికి దాదాపు 30 ఉప నదులు వున్నాయి.  వీటన్నింటిలోనూ పెద్దది తుంగ భద్ర.  ఇది మళ్ళీ తుంగ, భద్ర అనే రెండు నదుల కలయిక.  తుంగభద్ర తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్ వద్ద కృష్ణానదిలో కలుస్తంది.

 

జీవ చైతన్యానికి, నీటికీ అవినాభావ సంబంధం వున్నది.  జీవకోటి మనుగడ పంచభూతాల మీద ఆధార పడి వుంది.  అందుకే వీటికి కూడా దేవతా రూపాలిచ్చి ఆరాధించటం మన సంస్కృతి మనకి నేర్పింది.  అంతేకాదు, మన తీర్ధ యాత్రలన్నీకూడా నీటితోనే ముడిపడి వున్నాయి.  దైవ సందర్శనానికిచ్చే ప్రాధాన్యతను అక్కడ వున్న తీర్ధాలలో స్నానానికీ ఇస్తారు.    రోజులు మారాయి.  తీర్ధ స్నానాలు పుణ్యప్రదమయినా, ప్రస్తుతం అవి వున్న పరిస్ధితుల దృష్ట్యా పుణ్యానికి పోతే పాపమెదురయిందనే సామెతను గుర్తు తెచ్చుకుంటూ, తీర్ధ స్నానం మాటెలా వున్నా, లేని పోని రోగాలొస్తాయేమోనని భయపడుతున్నారు.  అయితే విడి రోజుల్లో పుణ్యార్జనాసక్తిపరులు తీర్ధ స్నానాలకి దూరంగా వున్నా, పుష్కరాలనే సరికి ఉరకలేసే ఉత్సాహానికి పగ్గాలు వెయ్యలేక పరుగులెత్తుతున్నారు.  మరి అలాంటి వారంతా నదీ జలాలను కాపాడటంలో తమ వంతు పాత్ర తామూ పోషిస్తారని భావిస్తున్నాను.

 

ఇంతకీ కొందరి పెద్దల విశ్లేషణ ప్రకారం నదీమతల్లులనుంచి ఎంతసేపు మనం తీసుకోవటమేకాదు, వాటి సంరక్షణ భారం మనదే.  వాటి గురించి పట్టించుకోవటానికి ఈ పుష్కరాలు ఉపయోగపడతాయని వారి అభిప్రాయం.  నదీ తీరాలు ఎక్కడ కోతకి గురవుతున్నాయి, ఎక్కడ చెట్లు తిరిగి పెంచవలసిన అవసరం వున్నది,  మెరక, పల్లాలు సరి చేయవలసిన ప్రాంతాలు, నీళ్ళని శుభ్రం చెయ్యటం, వగైరా నదీ ప్రవాహాన్ని సుగమం చేసే అవసరాలు గమనించి, తగు చర్యలు తీసుకోవటానికి ఈ పుష్కరాలు ఉపయోగ పడతాయి.  అయితే ఈ చిత్త శుధ్ధి పాలకులలోనూ, ప్రజలలోనూ కూడా కనిపించాలి.  అందరూ ఈ పుష్కరాలలో తమ వంతు కర్తవ్యం నిర్వర్తించి ప్రయోజనం పొందుతారని ఆశిద్దాము.

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)