Read more!

కృష్ణానది తీరిది

 


 

కృష్ణానది తీరిది

 

 

దక్షిణ భారతదేశంలో ప్రవహించే రెండో అతి పెద్ద నది కృష్ణ! ఈ కృష్ణానది ఆవిర్భావం గురించి చిత్రమైన గాథ ఒకటి ప్రచారంలో ఉంది. కృష్ణకు పుష్కరాలు జరుగుతున్న ఈ పుణ్యకాలంలో ఆ నది కథ ఏమిటో, కదలికలు ఏమిటో తెలుసుకోవడం సముచితంగా ఉంటుంది.

 

ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతాల మీద యజ్ఞాన్ని తలపెట్టాడట. ఆ యజ్ఞం సవ్యంగా సాగేందుకు శివకేశవులు మొదలుకొని సమస్త దేవతలూ, మునులూ యజ్ఞవాటిక దగ్గర సిద్ధంగా ఉన్నారు. కానీ కాలం ఎంత దాటుతున్నా బ్రహ్మదేవుని ధర్మపత్ని అయిన సరస్వతి జాడ మాత్రం కానరాలేదు. దాంతో గాయత్రి అనే కన్యను ధర్మపత్ని స్థానంలో కూర్చుండబెట్టి క్రతువుని పూర్తిచేశారు.

 

యజ్ఞం ముగిసిన తరువాత తీరికగా అక్కడికి చేరుకున్న సరస్వతీ దేవి కోపానికి అంతులేకుండా పోయింది. ఆ కోపవశాన ఆమె యజ్ఞవాటికలో ఉన్నవారంతా నదులుగా మారిపోదురుగాక అంటూ శపించింది. అలా విష్ణుమూర్తి కృష్ణానదిగా, పరమేశ్వరుడు వేణిగా, బ్రహ్మ కుముద్వతిగా... ఇతర దేవతలంతా తుంగ, భద్ర, భీమ వంటి నదులుగా మారిపోయారుట. అప్పటి నుంచి వారంతా సహ్యాద్రి పర్వతాల మీద ఉద్భవించిన కృష్ణతో కలుస్తూ, చివరికి ఆంధ్ర తీరంలోని సముద్రంలో సంగమిస్తున్నారు.

 

కథకు అనుగుణంగానే కృష్ణానది మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాలలో, మహాబలేశ్వర్‌ అనే చోట... ఒక చిన్న ధారగా మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి కర్ణాటకకు వస్తూ కోయినా, వర్ణ, పంచగంగ, దూద్‌గంగ వంటి అనేక ఉపనదులను తనలో చేర్చుకుంటుంది. కర్ణాటకలో ఘటప్రభ, మలప్రభ అనే ఉపనదులు కృష్ణలో కలుస్తాయి. అక్కడి నుంచి తెలంగాణలోని అలంపురానికి చేరుకున్న కృష్ణమ్మ, తుంగభద్రతో చేరి మహా నదిగా మారిపోతుంది. తుంగభద్రతో కలిసి పరవళ్లు తొక్కతూ నల్లమల పర్వతలోయల గుండా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చేరుకుంటుంది.

 

ఇక్కడే కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తూ హంసలదీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. అందుకనే ఈ ప్రాంతానికి కృష్ణా జిల్లా అన్న పేరు వచ్చింది. ఈ నదికి ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టే కృష్ణా తీరం వెంబడి ఎందరో రాజులు రాజ్యాలను నిర్మించుకున్నారు. శ్రీశైలం, అలంపురం, అమరావతి, విజయవాడ వంటి ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు కృష్ణానది ఒడ్డునే వెలిశాయి.

 

కృష్ణానది కేవలం ఒక నీటి ప్రవాహం మాత్రమే కాదు! తెలుగువారి జీవితాలలో ఒక ముఖ్యభాగం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పంటలు పండించేందుకు, ప్రజల దాహాన్ని తీర్చేందుకు కృష్ణానది ఎంతగానో ఉపయోగపడుతోంది. నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల వంటి ప్రాజెక్టులన్నీ కూడా కృష్ణానది మీద నిర్మించినవే. ఇక కృష్ణమ్మ నీటితో వేల మెగావాట్ల విద్యత్తు కూడా ఉత్పత్తి చేస్తున్నారు. అలా అటు ఆధ్మాత్మికంగానూ, ఇటు లౌకిక జీవనంలో ఇన్ని విధాలా మనకి తోడ్పడుతున్న కృష్ణమ్మను పుష్కర సందర్భంగా కొలుచుకోవడం ఔచిత్యమే కదా!

 

 

...Nirjara