Read more!

కృష్ణా తీరాన వెలసిన ఆలయాలు-14

 

 

 

కృష్ణా పుష్కరాల సందర్భంగా...కృష్ణా తీరాన వెలసిన ఆలయాలు-14.. ముగింపు పుష్కర స్నానం

 


                                                                                                

 

తెలుగునాట ఏ గాలి వీచినా ఇప్పుడు పుష్కరాల సువాసనలే మోసుకొస్తోంది.  ఏ నీటి అల కదలినా కృష్ణవేణమ్మ కబుర్లే చెబుతున్నాయి.  ఈ పుష్కరాల పుణ్యమా అని చాలా మందికి కృష్ణానది పుట్టు పూర్వోత్తరాలు, ఆ నదీమతల్లి పరుగిడిన రాష్ట్రాలు, , ఉప నదులు, సంగమ ప్రదేశాలు, అక్కడ వున్న ప్రముఖ ఆలయాలు, ప్రస్తుత పరిస్ధితుల్లో నదుల గురించి, నీటి గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..... ఇలా ఎన్నో విశేషాలు మీడియానే కాదు, మనుషులు కూడా వల్లించి, వల్లించీ అందరి మనసుల్లో నాటేశారు.  

 

వీటన్నింటివల్లా ప్రజలలో ఒక ఉత్సాహం వచ్చింది.  ఒక కొత్త చైతన్యం వచ్చింది.  యువత ఉరకలెత్తింది.  పుణ్యం మాట ఎలా వున్నా ఈ మధ్య కాలంలో గగన కుసుమమైన నదీ స్నానానందాన్ని అనుభవించింది.  కష్ణమ్మలో ఆటలాడింది, పాటలు పాడింది.  మన ధర్మాన్ని తెలుసుకుంది, కొంత పాటించింది.  పెద్దలు, ఇల్లు దాటటానికి భయపడేవారు కూడా, కృష్ణమ్మ తల్లి దీవెనలందుకోవటానికి లేని శక్తి తెచ్చుకుని, ఉత్సాహం ఉరకలు వెయ్యగా పడుతూ లేస్తూ వచ్చి ఆ తల్లిని ఆప్యాయంగా పలకరించారు.  సంతోషంతో తరలి వెళ్ళారు. పెద్దలకి నదీ స్నానాల అనుభవం కొంత వున్నా పిల్లలకి మాత్రం ఇది సువర్ణావకాశం.  

 

మేము 20-8-16న తెలంగాణాలోని రంగాపూర్ ఘాట్ లో పుష్కర స్నానం చేశాము.  నాకు పరవడి రోజుల్లో నదీ స్నానాలంటే కొంచెం భయం.  అందరూ స్నానాలు చేస్తారు, నీళ్ళెలా వుంటాయో, లేనిపోని రోగాలు తెచ్చుకుంటామేమో, అని ఆరోగ్య దృష్ట్యా, బట్టలు మార్చుకోవటం ఇబ్బందులు.  పైగా నీళ్ళతో పని కనుక ఆ ప్రాంతమంతా రొచ్చు రొచ్చుగా వుంటుంది..ఇలా ఒకటేమిటి లెండి.  ఎక్కడలేని అనుమానాలూ నాకే వస్తాయి.  ఇంతలో స్నేహితురాలు మల్లీశ్వరి మేము వెళ్తున్నాము వస్తావా అన్నది.  అనుమానాలనన్నింటినీ పక్కకి తోసేసి, మళ్ళీ పుష్కర సమయానికి ఎలా వుంటామో ఏమోనని సరేననేశాను. తెల్లవారుఝామున 4-15 కి  హైదరాబాద్, శ్రీకృష్ణా నగర్ లో ఇంట్లో బయల్దేరి ఉదయం 7 గం. ల కల్లా రంగాపూర్ ఘాట్ దగ్గరకి చేరుకున్నాము.  ఇక్కడ ప్రశస్తంగా ప్రశంసించాల్సింది సర్కారువారి సపర్యలు.

 

టోల్ గేట్ దగ్గర కారుకి స్టికర్ అంటించారు ఏ ఘాట్ కి వెళ్ళాలో తెలియజేస్తూ.  మనం అడగక్కరలేదు.  పోలీసులు వారంతట వారే చేస్తున్నారు.  రద్దీని నియంత్రించటానికి ఇలా చేస్తున్నారనుకున్నాము.  ఘాట్లకి కొంత దూరం నుంచే పోలీసులు, వాలంటీర్లు, ఎటు వెళ్ళాలో సూచిస్తూ, పార్కింగ్ ప్రదేశం చెబుతూ, కారు దిగాక స్నానానికి ఎటు వెళ్ళాలో సూచిస్తూ, అయ్య బాబోయ్ ఏమి ఏర్పాట్లు చేశారండీ.  చాలా బాగా చేశారు.

 

 

మేము పొద్దున్నే వెళ్ళాముగనుక మరీ రష్ గా లేదు.  కానీ అప్పటికే చాలా జనం వున్నారు.  ఘాట్ లోకి దిగే మెట్లన్నీ శుభ్రంగా వున్నాయి.  యాత్రీకులు కూడా చాలామంది చెత్త ఎక్కడబడితే అక్కడ పడేయకుండా చెత్త బుట్టలు వినియోగించటం చూశాను.  ఎంతకీ మారని వాళ్ళెవరన్నా పడేసినా, పారిశుధ్ధ కార్మికులు వెంటనే దానిని తీసేస్తున్నారు.  గట్టుమీద  గొట్టాలనుంచీ నీళ్ళు వస్తుంటే అక్కడ స్నానం చేసేవారు చేస్తున్నారు. నదీమ తల్లి రెండు చేతులా ఆహ్వానిస్తున్నట్లు ఎదురుగా పరిశుభ్రమైన నీరు కనిపిస్తే మనసు వూరుకుంటుందా.   సంతోషం ఉరకలు వెయ్యగా రెండు చేతులా ఆ ఆహ్వానాన్ని అందుకుని తల్లిని కౌగలించుకుంది.  ఘాట్ అంతా సిమెంట్ చేశారు.  చుట్టూ ఇనుప వల కట్టారు.  ఆ వల అవతల ఒక పుట్టీ వున్నది.  అందులో వారు అటు వైపు వచ్చిన పువ్వులు వగైరా నీళ్ళల్లో కనిపిస్తే తీసేస్తున్నారు.  స్నానాలు చేసే చోట కూడా నీటిలో పసుపు కుంకుమల పేకెట్లు వగైరాలొస్తే వెంట వెంటనే తీసేస్తున్నారు.

 

బాత్ రూమ్ లు శుభ్రమైనవి  ఏర్పాటు చేశారు.  అక్కడకూడా శుభ్రతా కార్యక్రమానికి ఏర్పరిచిన మనుష్యులు.  ఆడవారు బట్టలు మార్చుకోవటానికి చక్కని ఏర్పాట్లు.  నాకు బాగా నచ్చింది, తడి బట్టలతో ఆ గదుల్లోకి వెళ్తే కింద నీళ్ళోడి చిత్తడి చిత్తడి అవుతుంది.  కానీ ఇక్కడ కింద సిమెంటు గరుకుగా చేశారు.  దానితో నీళ్ళు ఇంకి పోతున్నాయి.  ఇక్కడ కూడా పారిశుధ్ధ ఏర్పాట్లు బాగా చేశారు.  

 

రైల్వే స్టేషన్లల్లో, బస్ స్టాండ్ లలో వున్న ఏర్పాట్లకి అధిక మూల్యం చెల్లించినా ముక్కు మూసుకోవాల్సిన పరిస్ధితి.  ఇక్కడ ఇన్ని వేల మందికి (నిన్న మేము చూసిన జనమైతే లక్షల్లో వున్నారు) ఇంత శుభ్రమైన ఏర్పాట్లు చెయ్యటమేకాక అక్కడి వారంతా కూడా చాలా బాగా మాట్లాడుతూ ఖాళీలున్నవైపు చూపిస్తూ సహకరిస్తున్నారు.  వచ్చినవారినుంచి ఏమీ ఆశించటంలేదు.  మైకుల్లో కూడా చెబుతున్నారు.  అక్కడ వున్న ఏర్పాట్ల గురించి.  మన దేశం మారి పోతోందోచ్.  

 

ఉదయం 8-30కల్లా స్నానం పూర్తిచేసుకుని ఆలంపూర్  లోని జోగులాంబని, బాల బ్రహ్మేశ్వరుని దర్శించుకున్నాము.  అక్కడ మాత్రం కొంచెం చికాకు అనిపించింది.  వి.ఐ.పి. లు వస్తుంటే మామూలు వారిని ఆపటం, మేము గుడి దగ్గర కొంతసేపు, ట్రాఫిక్ లో ఎండలో అరగంట గవర్నరుగారి కోసం ఆగాల్సి వచ్చింది.  ఇలాంటి సమయాల్లో అరగంట అంటే ఎన్ని వాహనాలో, ఎంత పెట్రోలు దండగో, ఎంత పొల్యూషనో ..  ఇవ్వన్నీ ఎందుకు ఆలోచించరు?

 

సామాన్యులకి ఇబ్బందులు లేకుండా చెయ్యటానికి వి.వి.ఐ.పి. లకి ప్రత్యేక ఘాట్ లు, జనం ఎక్కువగా లేని సమయాలు చూసి, వారికోసం ప్రత్యేక దర్శన సమయాలు పెడితే బాగుంటుంది.తిరిగి వచ్చేటప్పుడు మధ్యాహ్నం  3 గం. ల ప్రాంతంలో బీచ్ పల్లిలో రద్దీ చూస్తే కళ్ళు తిరిగాయి.  పార్కింగునుంచీ, ఘాట్ దాకా (మైన్ రోడ్ మీదకి కనబడుతుంది) ఇసక వేస్తే రాలదనిపించేంత.  లక్షల్లో వుంటారు.  ఇంత మందికి సౌకర్యాలు ఏర్పాటు చెయ్యటం ఎవరికైనా కష్టమైన పనే.  ఇలాంటి సమయాల్లో ప్రజలు కూడా నిర్వాహకుల పాట్లు అర్ధం చేసుకుని సహకరించాలి.

 

ఏది ఏమైనా ఈమారు పుష్కరాలు పండగ వాతావరణంతో, ఎక్కువ మందిని ప్రభావితం చేశాయి.  దానికి అందరికన్నా ఎక్కువ మెచ్చుకోవాల్సింది సర్కారువారినన్నమాట.  ప్రజలకోసం ఇన్ని ఏర్పాట్లు చేసి, మన సనాతన ధర్మాన్ని, ఆచారాలగురించి చైతన్యవంతులను చెయ్యటమేకాదు యువతలో కూడా మన ధర్మాన్ని గురించి తెలియజేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు.  ఈ నదీ గమనాలను సదా కాపాడుకుంటే భారతావని చైతన్యావని కాదా.

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)