కార్తీక మాసంలో దామోదర పూజ ఎందుకు ప్రత్యేకం..
కార్తీక మాసంలో దామోదర పూజ ఎందుకు ప్రత్యేకం..
మాసాలలోకి కార్తీక మాసం చాలా విశిష్టమైనది. కార్తీకమాసంలో అందరికీ శివాలయాల సందర్శన, కార్తీక దీపాలు వెలిగించడం మొదలైనవి తెలుసు. కానీ కార్తీక మాసం విష్ణువు ఆరాధనకు చాలా శ్రేష్టమైనది. శ్రీకృష్ణుడు తన బాల్య చేష్టలు, చిలిపి పనుల ద్వారా తన భక్తులను అలరించాడట. ఈ కారణంగా ఈ మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు. దామోదర అంటే పొట్టకు తాడును కట్టిన శ్రీకృష్ణుడు అని అర్థమట. ఈ కారణంగా కార్తీకమాసంలో దామోదర పూజకు చాలా ప్రాముఖ్యం ఉంది. భాగవత పురాణంలో దామోదర లీల కూడా ఉంది. దీని గురించి తెలుసుకుంటే..
దామోదర అనే పేరు వెనుక కథ..
భాగవత పురాణంలో దామోదర లీల ఉంది. ఇది శ్రీకృష్ణుడి బాల్యానికి సంబంధించినది. చిన్న తనంలో శ్రీకృష్ణుడు చాలా అల్లరివాడు. వెన్న దొంగిలించడం, గోపికలను ఆట పట్టించడం, లేగ దూడలను వదిలేయడం.. ఇలాంటి పనులు ఎన్నో చేసేవాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు తెగ అల్లరి చేస్తూంటే యశోద శ్రీకృష్ణుడి ఆట కట్టించడానికి ఒక తాడు తీసుకుని చిన్ని కృష్ణుడి నడుముకు కట్టి ఆ తాడును ఒక రాతి రోలుకు కట్టిందట.
మొదట యశోదమ్మ కృష్ణుడి పొట్టకు తాడు కట్టాలని ప్రయత్నిస్తే అస్సలు కుదర్లేదట. ప్రతిసారి తాడు తక్కువ అవుతూ వచ్చిందట. ఆ నారాయణుడి లీల అలా ఉంది. చివరికి తన తల్లి పడుతున్న శ్రమను చూసి కన్నయ్య తన లీలను పక్కన ఉంచాడు. అప్పుడు యశోదమ్మ తాడును కన్నయ్య పొట్టకు కట్టగలిగింది. దీన్నే దామోదర లీల అని అంటారు. ఈ సంఘటన వల్లే శ్రీకృష్ణుడికి దామోదర అనే పేరు కూడా వచ్చినట్టు చెబుతారు.
దామోదర లీల చాలా చోట్ల ఆధ్యాత్మిక నాటకంగా ప్రదర్శించబడుతుంది. ఇది చిన్నపిల్లల ఆటలా అనిపిస్తుంది. కానీ ఇందులో చాలా లోతైన ఆధ్యాత్మికత కూడా దాగుంటుంది. స్వచ్చమైన, నిస్వార్థమైన భక్తి ఉంటే.. దేవుడు తనను తాను అర్పించుకుంటాడట. యశోద ప్రేమలో ఎలాంటి స్వార్థం, భయం, దురాశ ఉండకపోవడం వల్ల కన్నయ్య ఆ ప్రేమకు లొంగియాడని చెబుతారు.
కార్తీక మాసంలో దామోదర పూజ..
కార్తీక మాసంలో దామోదరుడికి ప్రత్యేక పూజలు చేసే సంప్రదాయం. దీపాలు వెలిగించడం, తులసిని పూజించడం, శ్రీ దామోదరష్టక పఠనం అత్యంత ఫలవంతమైనవిగా భావిస్తారు. ఈ నెలలో దామోదర రూపంలో శ్రీకృష్ణుడిని పూజించే వారు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారని, మోక్షాన్ని పొందుతారని చెబుతారు. ఈ కారణంగా కార్తీక మాసం భక్తి, నిగ్రహం, కాంతికి చిహ్నంగా మారింది. కార్తీక మాసం కేవలం పుణ్యమాసం మాత్రమే కాదు, భగవంతుడు కూడా నిజమైన ప్రేమ, భక్తి కి బంధీ అయిపోతాడని చెప్పే గొప్ప ఉదాహరణ.
*రూపశ్రీ.