Read more!

కార్తీక సోమవార వ్రతం!!

 

కార్తీక సోమవార వ్రతం!!

 

కార్తీక మాసం ఎంత గొప్పదో, కార్తీకమాసంలోని సోమవారం అంతే విశిష్టత కలిగినది. మాసమ్మెలో ప్రతి వారంలో భక్తిపూర్వకంగా పూజలు చేసినా, అలా కుదరనివారు సోమవారం రోజును ఎంతో భక్తిగా గడుపుతారు. చాలామంది కార్తీక సోమవార వ్రతంను పాటిస్తారు. అయితే కార్తీక సోమవార వ్రత ప్రాముఖ్యత, ఈ వ్రతాన్ని ఎలా పాటించాలి, వ్రత నియమాలు ఏమిటి వంటి విషయాలు తెలుసుకుంటే మాసం మొత్తం చక్కగా అన్ని ప్రణాళిక లాగా గడిపేయచ్చు. 

సోమవార వ్రతప్రాముఖ్యత

ఈ వ్రతాన్ని ఎవరెవరి శారీరక ఆరోగ్యమును బట్టి వారు ఆరు విధాలుగా చేయవచ్చు.

1.  సూర్యోదయమునకు ముందే స్నానాంతరము ఉండటము. పూజాది కార్యక్రమములను నిర్వర్తించుటం మరియు పూర్తి ఉపవాసం ఉండటం. అంటే ఉదయాన్నే స్నానం చేయగానే దేవుడి పూజ చేసుకుని ఆ రోజు మొత్తం ఏమి తినకుండా ఉపవాసం ఉండటం. 

2. ఒంటిపూట భోజనం చేయుట.  రోజులోని మూడు పూటలలో ఏదో ఒక పూట భోజనం చేయడం. 

3. ఉదయం నుండి ఉపవాసము ఉండి సాయంత్రం అయ్యాక ఆకాశంలో నక్షత్రాలు చూసిన తరువాత భోజనం చేయడం. 

4.రోజూ ఇతరులకు పెట్టి తరువాత తినడం. 

5. వారంలో ఒక్కరోజు అదీ సోమవారం ఉపవాసము ఉండుట. ఇది కేవలం సోమవారం మాత్రమే చేస్తారు. 

6. నువ్వులు దానం చేయుట. అంటే ఉపవాసం లేకపోయినా పూజలు చేయకపోయినా నువ్వులు దానం చేయడం వల్ల ఈ వ్రతాన్ని పాటించినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. 

అసలు ఈ వ్రతం ప్రత్యేకత ఏమిటి??ఉపవాసం ఎందుకు??

కార్తీకమాస వ్రతవిధానములలో సోమవారం ఉపవాసం ఉండటం ఎంతో ప్రత్యేకమైనది. సోమవారము శివునికి ఎంతో ఇష్టమైన రోజు. అందులోనూ కార్తీకమాసములోని సోమవారాలు పరమశివునికి మరింత ఇష్టమైన రోజులు. కాబట్టి లాంటి రోజులలో స్త్రీలు కాని, పురుషులు కాని వేకువజాముననే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదీస్నానము(ఎవరి వీలును బట్టి వారు దగ్గరలో కనీసం పుష్కరిణి, లేదా కాలువ, లేదా చెరువు, అవేమి లేకపోతే ఇంట్లోనే స్నానం చేస్తూ స్నానం చేసేటప్పుడు చెప్పుకునే మంత్రాన్ని చెప్పుకుంటూ స్నానం చేయడం) చేసి పూజ పనులు అన్ని ఏర్పాటు చేసుకోవాలి. నిష్ఠతో పరమశివునికి బిల్వపత్రాలతో పూజ చేస్తే అత్యంత పుణ్యప్రదాయకము.

 ఆ తరువాత పగలంతా ఉపవాసము ఉండి సాయంకాలము నక్షత్రాలు చూసిన తయువత శివాలయముకు కాని, విష్ణువాలయము( విష్ణు స్వరూపం అయిన దశావతారాలలో ఏ దేవుడి ఆలయంకు అయినా) గాని వెళ్ళి శివుని పూజించి ఆవునెయ్యితో దీపమును వెలిగించి తిరిగి ఇంటికి వచ్చి, ఇంట్లో తులసి చెట్టు దగ్గర దీపమును వెలిగించి పరిశుభ్రంగా వండిన భోజనము తిని, నేలపై నిద్రపోవాలి. ఈ విధముగా సోమవారము మాత్రమే చేసినా  కూడా కార్తీకమాస వ్రతఫలము దక్కుతుంది. 

ఇది కాకుండా ప్రతిరోజు ఉపవాసము అన్నివిధాల మంచిది. అయితే ఆరోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఉండగలిగిన వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉండాలి.  అలా కాని పక్షంలో ఉదయము స్నానం, జపం, దేవుడిపూజ అయినా చేయాలి. శక్తి ఉన్నవారు రోజూ పూజలు చేస్తూ మధ్యాహ్నం మాత్రమే  భోజనము చేసి దేవుడి ధ్యానంలో నిమగ్నమవవచ్చును. దీనినే ఏకభుక్తం అంటారు. 

ఇంకొక విధంగా పగలంతా ఉపవాసము ఉంటే నక్షత్రాలు చూసిన తరువాత భోజనం చేయవచ్చును. ఈ విధానమును నక్తం అని అంటారు. ఏవీ చేయలేని వారు సోమవారం రోజున నువ్వులు దానం చేసినా వ్రతఫలము దక్కుతుంది. 

స్త్రీలు గాని, పురుషులు గాని వారి శారీరక స్థితిని బట్టి ఏదో ఒక విధంలో ఆచరిస్తే సంపూర్ణ కార్తీకమాస వ్రతఫలము పొందగలుగుతారు. మనస్ఫూర్తిగా చేసే శివనామస్మరణకు, స్వీకరించే కొద్దిపాటి ప్రసాదముకు కూడా ఎంతో గొప్ప పలితం ఉంటుంది. అయితే తప్పు పనులు చేస్తూ దేవుడిని స్మరిస్తే ఆ దేవుడు కూడా పైకెత్తి ఒక్కసారిగా పాతాళంలోకి నెత్తివేస్తాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

◆ వెంకటేష్ పువ్వాడ