Read more!

మనిషిని తప్పు మార్గంలో తోసే తామసిగుణం!!

 

మనిషిని తప్పు మార్గంలో తోసే తామసిగుణం!!


భగవద్గీతలో కృష్ణుడు ఎన్నో విషయాలు చెబుతాడు. వాటన్నిటినీ వివరంగా అర్థం చేసుకుంటే ఎంతో  ప్రపంచం అర్థమవుతుంది. తామసి గుణం కలిగిన వారి గురించి, నియత కర్మల గురించి కృష్ణుడు ఇట్లా చెబుతాడు.

నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపపద్యతే! మోహాత్తస్య పరిత్యాగ స్తామసః పరికీర్తితః ॥

వేదములలో, శాస్త్రములలో చెప్పబడిన విహిత కర్మలు, నిత్య, నైమిత్తిక కర్మలను ఎట్టి పరిస్థితులతోనూ వదలడం ఉచితం కాదు. తమలో ఉన్న అజ్ఞానం చేత గానీ, ఎవరో చెప్పారని కానీ, వేద, శాస్త్రములలో చెప్పబడిన కర్మలను వదిలిపెట్టడం తామసగుణము తో కూడిన త్యాగము అని చెప్పబడుతుంది. కాబట్టి కర్మలు చేయాలి. అవి వేద శాస్త్ర విహితము అయి ఉండాలి. సంగము ఫలాపేక్ష లేకుండా ఉండాలి. అలా చెయ్యాలి కానీ, అసలే కర్మలు చేయకూడదు అని చెప్పడం సరి కాదు.

కర్మసన్యాసము మంచిది కాదు. కర్మలు చేయకుండా సోమరిగా ఉండటం తామస లక్షణము. కాబట్టి పరమాత్మ ఉద్దేశ్యం ఏమంటే వేదములలో శాస్త్రములలో చెప్పబడిన కర్మలను మానవులు తప్పకుండా ఆచరించాలి. కర్మలు చేయడం ఎవరూ మానకూడదు. కర్మసన్యాసము మంచిది కాదు. కర్మలను వదిలి పారిపోకూడదు. అలా కర్మలు చేయకుండా ఉండటం, పారి పోవడం, వారిలో ఉన్న మోహం వలన, అజ్ఞానము వలన అవివేకము వలన జరుగుతుంది.

కాబట్టి మనుషులు, భక్తులు, వేదశాస్త్ర పరిజ్ఞానము కలిగి ఉండాలి. గురువుల వద్ద, పెద్దల వద్ద అడిగి తెలుసుకోవాలి. కర్తవ్య కర్మలను సక్రమంగా నిర్వర్తించాలి. సోమరిగా ఉండకూడదు. ఏపనీ చేయకుండా ఉండటం, అన్ని కర్మలను వదిలిపెట్టడం తామస త్యాగము, తామస సన్యాసము. తామసము అంటే ఏమిటి అని కొందరికి అయోమయం కలగవచ్చు. మనిషి శరీరంలో ఉన్న త్రిగుణాలు అయిన సత్వ, రజో, తమో గుణాల ఆధారంగా మనిషిలో మార్పులు జరుగుతూ ఉంటాయి. సత్వ గుణం కలిగినవాడు ప్రశాంతంగా, చిత్తంగా, ఆలోచనా పరుడిగా ఉంటాడు. అదే రజో గుణం కలిగినవాడు కోపం, అసహనం, చిరాకు, ఇతరులను తొందరగా అనేయడం, దురుసుదనం వంటి లక్షణాలు కలిగి ఉంటాడు. ఇక తమో గుణం ఉన్నవాడు ఆ రజో గుణాన్ని కూడా దాటి మరింత క్రూరంగానూ, అసంబద్ధమైన మార్గపు ఆలోచనల్లోనూ ఉంటాడు. కర్మలు తప్పించుకునేవాడు ఇట్లా తమో గుణం ఇదే తామసి గుణంతో నిండిపోయి ఉంటాడు అని అర్థం.

కాబట్టి మనం కూడా మోహంలో, అజ్ఞానంలో పడకుండా మనం చేయాల్సిన పనులను సక్రమంగా నిర్వర్తించాలి. కాకపోతే ఆ కర్మలను నిష్కామంగా, కర్తృత్వభావన లేకుండా చేయాలి. 

ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ….. ప్రతివాడూ చేయవలసిన నియత కర్మలలో తల్లితండ్రుల సేవ, భార్యబిడ్డలను పోషించడం. ముఖ్యమైనవి. తల్లితండ్రులను పంచుకునే కొడుకులు, వారు తమకు భారము అయ్యారని వృద్ధాశ్రమాలలో వదిలేవాళ్లు, పెద్ద చదువులు చదవగానే, తల్లితండ్రులను వారి మానానికి వారిని వదిలి, విదేశాలకు ఎగిరిపోయేవాళ్లు, ఎక్కువ కట్నం కోసం ఉన్న భార్యను, బిడ్డలను వదిలే వాళ్లు ఈ సమాజంలో ఉన్నారు. కొంతమంది, తమకు ఉన్న అపరిమితమైన ధనంతో, తాము చేసిన పాపాలు పోవడానికి, పూజలు, వ్రతాలు, దానధర్మాలు ఘనంగా చేస్తుంటారు, చేయిస్తుంటారు.. చేయవలసిన నియత కర్మలను వదిలిపెట్టి, ఎన్ని పూజలు, వ్రతాలు, దానాలు చేసినా, అవి అన్నీ వృధా! 

◆ వెంకటేష్ పువ్వాడ