Read more!

ద్వంద్వాల నుండి బయటపడటం ఎలా??

 

ద్వంద్వాల నుండి బయటపడటం ఎలా??


యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ || 

తే ద్వన్ద్వ మోహనిర్ముక్తా భజన్తో మాం ధృఢవ్రతాః॥


ఈ జన్మలో గానీ, ఇంతకు ముందు జన్మలలో గానీ చేసిన పాపములు అన్నీ నాశనం అయిన పుణ్యాత్ములు, సుఖదు:ఖములు మొదలగు ద్వంద్వముల నుండి విముక్తి పొందెదరు. తుదకు నిశ్చలము, ధృఢమైన సంకల్పంతో నన్నేసేవిస్తారు.

ఈ ఇచ్ఛాద్వేషాలు, సుఖదు:ఖాలు, అనే ద్వంద్వాలు పుట్టుకతోనే వస్తాయి. వాటిని మనం పోగొట్టుకుంటే వాటి వ్యామోహం నుండి బయట పడటానికి ప్రయత్నం చేస్తే మనకు పరమాత్మమీద ధృఢమైన భక్తి కలుగుతుంది. అంటే చాలా మంది ఈ ద్వంద్వాల మోహంలో పడి కొట్టుకుంటున్నా మరి కొంతమంది ఈ ద్వంద్వాల మోహంలో నుండి బయట పడి పరమాత్మను గురించి తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే, వారు పుణ్య కర్మలు అంటే నిష్కామ కర్మలు చేయడం వలన వారిలో ఉన్న పాపాలు తొలగి పోతాయి. అప్పుడు వారిలో విచక్షణా జ్ఞానం పెరుగుతుంది. ఏది సత్యము, ఏది అసత్యము తెలుసుకోగలుగుతాడు. ఆత్మానందం కోసం ప్రయత్నిస్తాడు కానీ, అశాశ్వతములైన ప్రాపంచిక సుఖములు కోసం పాకులాడడు.


ఒకడు తన కారు అమ్ముతున్నాడు. మరొకడు కొంటున్నాడు. కారు కారుగానే ఉంది. కానీ అమ్మడం వల్ల ఒకరికి సుఖం, కొనడం వల్ల మరొకరికి సుఖం. సుఖం ఎక్కడ ఉంది? కారులో లేదు. అమ్మేవాడు ఇది నాది కాదు అనుకోడం వల్ల సుఖపడుతున్నాడు. కొనేవాడు ఇది నాది అని అనుకోడంవల్ల సుఖపడుతున్నాడు. కొన్న మర్నాడు ఆ కారుకు ఆక్సిడెంట్ అయితే కొన్న వాడు దుఃఖిస్తాడు. అమ్మినవాడు దాని గురించి ఆలోచించడు. కాబట్టి సుఖం, దుఃఖం మన ఆలోచనలో మన భావనలో ఉంది కానీ కారులో లేదు. ఇలా ఆలోచించడమే విచక్షణా జ్ఞానం కలిగి ఉండటం. దాని ఫలితంగా అతడు ద్వంద్వముల వలన కలిగిన మోహము నుండి విముక్తి పొందుతాడు. అప్పుడు అతని మనసు తనలో ఉన్న ఆత్మవైపు మళ్లుతుంది. ఆత్మదర్శనం కోసం ప్రయత్నిస్తాడు.


ఏ పని చేయాలన్నా భక్తి శ్రద్ధ ముఖ్యము. అవి లేనిదే ఏ కార్యము చేయలేరు. వ్రతములు, పూజలు, నియమాలు, మౌనవ్రతాలు, ఉపవాస దీక్షలు, బ్రహ్మచర్యం పాటించడం, వేదాలు, శాస్త్రములు చదవడం, ఇవి ఏవి చేసినా శ్రద్ధాభక్తులతో చేయకపోతే వాటిమీద ధృఢత్వము వాటి మీద మనస్సు నిలువదు. దానికి కారణం మనకు పుట్టుకతోనే వచ్చిన రాగద్వేషములు (ఒక దాని మీద కోరిక, మరొక దాని మీద ద్వేషము, సుఖము దు:ఖము, లాభము నష్టము) మొదలగు ద్వంద్వములు. అటువంటి వారు ఏ పుణ్యకార్యాలు చేసినా, వారి దుష్టసంస్కారాలు వారిని అటు వైపు లాగుతుంటాయి. పరమాత్మయందు మనసు నిలువదు.


దీనికి మార్గం కూడా పరమాత్మ చెప్పాడు. ద్వంద్వమోహనిర్ముక్తా అంటే ఇచ్ఛాద్వేషములు అనే ద్వంద్వంముల నుండి విముక్తుడు కావాలి. అంటే ముందు మనసుకు పట్టిన మురికిని తుడిచివేయాలి. ఇది ఎలా సాధ్యము అంటే పుణ్యకర్మణామ్ అంటే పుణ్యకార్యములు చేయడం. మొదటిది నిష్కామ కర్మ, దీనితో కోరికలు పోతాయి. అందరినీ సమానం చూడటం. దీనితో ద్వేషభావం నశించి పోతుంది. కరృత్వ భావన వదలడం. దీనితో అహంకారం పోతుంది. ఇప్పుడు ఏ పూజలు వ్రతాలు చేసినా మనసు నిలకడగా ధృఢంగా ఉంటుంది. అతనికి ఏ బంధనములు అంటవు. మనసు నిర్మలంగా ఉంటుంది. దుర్గతి కలుగదు. ధృఢమైన చిత్తము కలిగి ఉంటాడు. అప్పుడు వారిని ఆవహించిన మోహం తొలగిపోతుంది. ఆత్మసాక్షాత్కారం అవుతుంది.

 ◆వెంకటేష్ పువ్వాడ.