Read more!

అందరికీ ఆదర్శం కాగల అర్జునుడి ఆలోచన!!

 

అందరికీ ఆదర్శం కాగల అర్జునుడి ఆలోచన!!

కురుక్షత్రయుద్దం తప్పనిసరైనప్పుడు అర్జునుడు  యుద్ధరంగానికి వెళ్ళాడు. అక్కడ అర్జునుడు తన ఎదురుగా ఉన్న రెండు వైపుల సైన్యములను చూశాడు. తమ సైన్యములోనూ, కౌరవ సైన్యంలోనూ ఉన్న, తన తండ్రుల వంటివాళ్ళను, తాతలను, తండ్రులను, చదువు చెప్పిన గురువులను, అన్నదమ్ములను, మేనమామలను, కొడుకులు, చిన్ననాటి స్నేహితులను, మామగార్లను, ఆత్మీయులను చూశాడు. అంటే అర్జునుడి ఎదురుగా అతని సమీప బంధువర్గం అంతా నిలబడి ఉంది.  వాళ్లలో అర్జునుడికి ఎంతో అనుబంధం కలిగిన వాళ్ళు ఎవరు వలలు అర్జునుడికి ఏమవుతారు అని గమనిస్తే…..

తాతగారు: భీష్ముడు, ఆయన వయసు వాళ్లు. బాహ్లికుడు అందరి కంటే పెద్దవాడు. 

గురువు: ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు.

అన్నదమ్ములు: సుయోధనుడు అతని నూరు మంది తమ్ముళ్లు. తన పక్షాన ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు.

కొడుకులు: సుయోధనుడు అతని నూరుమంది తమ్ముళ్ళ కుమారులు. భీముడికి, అర్జునుడికి పుట్టిన కొడుకులు.


 స్నేహితులు: అశ్వత్థామ మొదలైనవారు

మామలు: ద్రుపదుడు, మొదలైనవారు

తమ మంచి కోరేవారు కృతవర్మ మొదలగు వారు.

మేనమామలు శల్యుడు మొదలైన వారు.. 

ఇట్లా అందరినీ చూసిన తరువాత అర్జునుడికి ఎందుకో అంగతం అంతా గుర్తొచ్చింది.  అర్జునుడు తన చిన్నప్పుడు తాత భీష్ముని ఒడిలో కూర్చుని చిట్టిపొట్టి కబుర్లు చెప్పాడు. విల్లుపట్టుకోవడం నేర్పింది కృపాచార్యుడు. అస్త్రశస్త్రప్రయోగం నేర్పింది ద్రోణుడు. కూతురుని ఇచ్చింది ద్రుపదుడు. సాత్యకి తన శిష్యుడు. అశ్వత్థామ చిన్ననాటి స్నేహితుడు. ఎంత వెతికినా అక్కడున్న వాళ్లలో తనకు శత్రువు అనే వాడు కనిపించలేదు. తనకు వారితో శత్రుత్వము ఉంటేగదా వారిని చంపడానికి, శత్రుత్వము లేకుండా వారిని ఎలా చంపగలడు. ఎక్కడ చూచినా, ఎటు చూచినా తనకు ఏదో ఒక విధంగా బంధుత్వము ఉన్నవాళ్లే కనపడుతున్నారు కానీ కనీసం ఒక్కడు కూడా పరాయి వాడు అన్న వాడు కనిపించడం లేదు. యుద్ధం అంటూ జరిగితే వీళ్లంతా తన చేతిలో చస్తారు. ఒక్కరూ మిగలరు. ఇప్పుడు ఎలాగ?

ఆ ఆలోచన రాగానే అర్జునుడిలో భయం కలిగింది. వణుకుపుట్టింది. శరీరం గగుర్పొడిచింది. కరుణ, జాలి, దుఃఖము అన్నీ ఒకేసారి కలిగాయి. అప్పుడే మొదలయ్యింది అర్జునుడిలో భయం. యుద్ధం చేయకూడదు అనే ఆలోచన ఆ వెంటనే మెదడులో మొలిచింది. అదే కృష్ణుడు భగవద్గీత బోధ చేసేవరకు దారితీసింది. 

ఇక్కడ ఒక విషయం గమనించవచ్చు. తనవైపు ఉన్న వాళ్ళు, ఎదుటి పక్షంలో ఉన్నవాళ్లు అందరూ నా వాళ్లే అనే భావన, వాళ్ళు తనతో మెలిగిన విధానం, వాళ్లకు తనకు మధ్య గల అనుబంధంను ఇట్లా అన్నీ మంచి విషయాలను మాత్రమే అర్జునుడు గుర్తుచేసుకున్నాడు. కాబట్టే అతనికి అందరూ నావాళ్లే, వాళ్లలో శత్రువే నాకు కనబడటం లేదు అనిపించింది.  ఇదే సగటు మనిషికి కూడా వర్తిస్తుంది. ప్రతి మనిషి ఎదుటి వ్యక్తిలో మంచిని చూస్తూ తనకు, ఆ ఎదుటి వ్యక్తికి మధ్య జరిగిన మంచి అనుభవాలు గుర్తుచేసుకుంటూ ఉంటే శత్రుత్వం అనేది పుట్టదు. కౌరవులు చేసిన మోసం, శకుని మాయతో జూదంలో ఓడించడం, ద్రౌపదిని అవమానించడం ఇట్లా అన్నీ ఉన్నాయి అర్జునుడు గుర్తుచేసుకోవడానికి. కానీ అర్జునుడు మాత్రం మంచిని గుర్తుచేసుకున్నాడు. అది మనిషిలో పాజిటివ్ ఆలోచనలకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇదే అందరిలో ఉండాల్సింది. 

◆ వెంకటేష్ పువ్వాడ