Read more!

సంపూర్ణ వ్యక్తిత్వ సాధనా మార్గం ఎలా సాధ్యం?

 

సంపూర్ణ వ్యక్తిత్వ సాధనా మార్గం ఎలా సాధ్యం?

ఏ వ్యక్తీ ఎవరికీ తక్కువ కాదు. భగవంతుడి సృష్టిలో హెచ్చుతగ్గులు లేవు.. హెచ్చుతగ్గులు మనలోని భగవదంశను గుర్తించి దాన్ని భద్రపరచుకునేందుకు వ్యక్తి ప్రయత్నించడంలోనే ఉంది అంటుంది భారతీయ ఆధ్యాత్మికత. ఒకసారి భారతీయ పురాణాలు, ఇతిహాసాలు పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతుంది కూడా. 

మహాభారతంలో అర్జునుడు, కర్ణుడు సమానమైన శక్తి కలవారు. బాగా గమనిస్తే అర్జునుడి కన్నా కర్ణుడు శక్తిమంతుడు. అర్జునుడు రాజపుత్రుడు. అతడి జీవితం వడ్డించిన విస్తరి. అదే కర్ణుడు సూతపుత్రుడు. జీవితంలో ప్రతి విషయానికీ అతడు పోరాడాల్సి వచ్చింది. చివరికి తన విలువిద్యను ప్రదర్శించేందుకు కూడా కర్ణుడు అవమానాలు సహించాల్సి వచ్చింది. కానీ ఎక్కడా కర్ణుడు భయపడలేదు. తన నైపుణ్యాన్ని మాత్రమే అతను నమ్ముకున్నాడు. అస్త్రశస్త్రాలలో అసమాన ప్రావీణ్యం సాధించాడు. అయినా సరే కర్ణుడు యుద్ధంలో ఓడిపోవాల్సి వచ్చింది. కర్ణుడి చావుకు పదివేల కారణాలు చెప్తారు.

 కానీ అసలు కారణం రథసారథుల్లో ఉంది, అర్జునుడి రథసారథి శ్రీకృష్ణుడు. భగవంతుడు 'క్లైబ్యం'తో యుద్ధం చేయనన్నవాడిని యుద్ధోన్ముఖుడిని చేశాడు, జ్ఞానబోధ చేశాడు, భయాల్ని నశింపచేశాడు, అర్జునుడిని విజయుడిని చేశాడు. అర్జునుడికి దీటైన ప్రతిభాపాటవాలున్న కర్ణుడి రథసారథి శల్యుడు. అడుగడుగునా కర్ణుడిని నీరసపరిచాడు. "నీ వల్ల ఏమౌతుంది?" అంటూ నిరుత్సాహపరిచాడు. అడుగు కదపకముందే 'ఓటమి తథ్యం' పొమ్మన్నాడు. అడుగడుగునా కర్ణుడిలోని భయాలను పెంచి, జడత్వానికి నీరు పోశాడు. ఫలితంగా కర్ణుడు పరాజయం పాలయ్యాడు.

భారతీయతత్వంలో మనిషి జీవితం రథప్రయాణం వంటిది. మనస్సు రథసారథి వంటిది. జీవితం మంచిచెడుల నడుమ పోరాటం. అదే మహాభారతం. ఈ పోరాటంలో మనిషి ప్రయాణించే ఇంద్రియాలు పూన్చిన గుర్రానికి సారథి భగవంతుడైతే వ్యక్తిలో భయాలు తొలగుతాయి. భగవంతుడి మార్గదర్శనంలో భయాలను జయించి వ్యక్తి విజయుడవుతాడు. అలా కాక మనిషి భగవంతుడిని వదలి, తన భయాలకు లొంగి కళ్లెం వాటి చేతికిస్తే పరాజయం తప్ప గత్యంతరం లేదు. ఈ నిజాన్ని తిక్కన తన పద్యంలో అద్భుతంగా వర్ణించాడు.

పాపంబులు కర్ణములై

యేపుం గనెనేని యనియు నింపగు ధర్మ

వ్యాపారమ్ము లపేతము 

లై పరిణతి పొందెనేని యట్టులె చెల్లున్,

పాపములు పరిణతి పొందుతాయి. పాపాలు చేస్తున్నంత కాలం ఇంపుగానే ఉంటాయి. ధర్మాలు పరిహరించినా పూర్వజన్మ సుకృతం ఉన్నంత కాలం చెల్లిపోతుంది. సుకృతం అయిపోయిన తరువాత దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి పాపం చేయవద్దు, ధర్మం చేయాలి. ధర్మమార్గంలో భయాలుండవు. ఎందుకంటే ధర్మం ప్రకారం ప్రవర్తించే వాడి వెంట భగవంతుడుంటాడు. అతడి మనస్సులోని భయాలను తొలగిస్తాడు. కాబట్టి ధర్మమార్గంలో భగవంతుడు మనస్సుకు మార్గదర్శనం చేస్తుండగా ప్రయాణించే వ్యక్తి నిత్యజీవితంలో జరిగే మంచిచెడుల నిత్యఘర్షణలో విజయం సాధించి సంపూర్ణవ్యక్తిగా ఎదుగుతాడన్నమాట. అలా కాక వ్యక్తి ఎంత శక్తిమంతుడైనా, ఎంత మంచివాడైనా, ధర్మం వదలితే పరాజయం తప్పదు.

మంచి చెడుల మధ్య తేడాను గ్రహించే విచక్షణను ప్రదర్శించి, సంపూర్ణ వ్యక్తిత్వ సాధన మార్గంలో ప్రయాణించటంలో తోడ్పడే ఆలోచనలపై నియంత్రణ సాధించటం మనిషికి ఎంతో ముఖ్యం.

                                     ◆నిశ్శబ్ద.