భగవద్గీతను ఇలా పారాయణ చేస్తే అద్బుతమైన ఫలితాలు ఉంటాయి..!
భగవద్గీతను ఇలా పారాయణ చేస్తే అద్బుతమైన ఫలితాలు ఉంటాయి..!
హిందూ మతంలో చాలా ముఖ్యమైన గ్రంథాలలో భగవద్గీత ప్రథమ స్థానంలో ఉంటుంది. భగవద్గీత పారాయణం చాలా గొప్పదని, ఈ పారాయణ వల్ల వ్యక్తి జీవితం చాలా మార్పులకు లోనవుతుందని చెబుతారు. ప్రతిరోజూ భగవద్గీతను పఠించి, అందులో ఉన్న విషయాలను తమ నిజ జీవితంలో అమలు చేసేవారు ఎంత కష్టమైన సమస్యలను అయినా సులువుగా అధిగమిస్తారని, ఎలాంటి పరిస్థితులలో అయినా నిబ్బరంగా ఉండగలుగుతారని చెబుతారు. భగవద్గీతలోని 18 అధ్యాయాలలో 700 శ్లోకాలు ఉన్నాయి. యుద్ధభూమిలో తన ముందు నిలబడి ఉన్న తన బంధువులను చూసిన అర్జునుడు కలత చెంది యుద్దం చేయడానికి వెనుకడుగు వేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశమే భగవద్గీత.
భగవద్గీతను ఎప్పుడైనా పఠించవచ్చు. కానీ దాని వల్ల పూర్తి ప్రయోజనాలు లభించాలన్నా, జీవితంలో గొప్ప మార్పులు రావాలన్నా సరైన సమయంలో చదవడం చాలా అవసరం. పూజకు, జపానికి ఉదయం ఉత్తమ సమయం అయినట్లే భగవద్గీతను కూడా ఉదయం పఠించడం మంచిదని పండితులు చెబుతున్నారు.
భగవద్గీత చాలా పవిత్రమైన గ్రంథం. మురికి చేతులతో ఎప్పుడూ ముట్టుకోకూడదు. ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే గీతను పఠించాలి. పారాయణం చేసే ముందు టీ, కాఫీ, నీరు లేదా ఇతర పానీయాలను తీసుకోకపోవడం మంచిది. అలాగే, పారాయణం ప్రారంభించే ముందు గణేశుడు, కృష్ణుడిని ధ్యానించడం తప్పనిసరి.
గీతా పఠనం చేసేటప్పుడు పూర్తిగా దృష్టి మొత్తం భగవద్గీత మీదే ఉండాలి. పారాయణం చేస్తున్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. గీతా పఠనం కోసం ఒక ఉన్ని బట్ట లేదా దర్భ చాపను వేసుకుని దాని మీద కూర్చుని ప్రతిరోజూ పఠించండి. గీతా పఠనం చేసే వారు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే గ్రంథాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయంలో, నిర్థిష్ట ప్రదేశంలో గీతా పఠనం చేయడం మంచిది. ప్రతి రోజూ కనీసం ఒక అధ్యాయం అయినా పూర్తీ చేయడం మంచిది.
గీతలోని ప్రతి శ్లోకాన్ని చదివిన తర్వాత దాని సారాంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. గీతలో పొందు పరిచిన విషయాలను పుస్తకానికే పరిమితం చేయకూడదు. వాటిని జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నించాలి. గీతను చదివే ముందు, చదివిన తర్వాత తప్పనిసరిగా భగవద్గీతను నమస్కరించాలి. ప్రతి రోజూ విధిగా భగవద్గీత గ్రంథానికి పూజ, హారతి ఇవ్వాలి. ఇవన్నీ చేసినప్పుడు భగవద్గీత గ్రంథాన్ని పఠించడం పూర్తీ చేసిన తర్వాత వ్యక్తి జీవితంలో ఎంతో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి.
*రూపశ్రీ.