భగవద్గీత చెప్పిన మాట.. మనిషిని నరకానికి తీసుకెళ్లేది ఈ మూడు విషయాలేనట..!

 

భగవద్గీత చెప్పిన మాట.. మనిషిని నరకానికి తీసుకెళ్లేది ఈ మూడు విషయాలేనట..!


భగవద్గీత భారతీయుల పవిత్ర గ్రంథం.  భగవద్గీతను ఎవరైతే పారాయణ చేసి అందులో సారాంశాన్ని అర్థం చేసుకుని జీవితంలో పాటిస్తూ ఉంటారో.. అలాంటి వ్యక్తులు జీవితంలో చాలా గొప్ప మార్పులు చూస్తారు. జీవిత పరమార్థం ఏమిటో కూడా వారికి అర్థం అవుతుంది. మనిషి ఏ పనులు చేస్తే వారికి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయో,  ఏ పనులు చేస్తే నరకం ప్రాప్తిస్తుందో కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. గీతలో శ్రీకృష్ణుడు నరకానికి ద్వారం వంటివి అని మూడు విషయాలను వర్ణించాడు. ప్రతి వ్యక్తి జీవితంలో వాటిని నివారించాలట. ఈ మూడు సూత్రాలను పాటించే ఎవరైనా ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధించగలరని నమ్ముతారు. వాటి గురించి తెలుసుకుంటే..

శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం.. కామం, కోపం,  దురాశ అనేవి నరకానికి  దగ్గర చేసే  మూడు ద్వారాలట. కాబట్టి ఈ మూడింటినీ వదిలివేయాలి. కామం మనస్సును బంధిస్తుంది, కోపం దానిని కాల్చివేస్తుంది,  దురాశ మనసును గుడ్డిదానిలా చేస్తుంది. ఈ మూడు విషయాలు కలిసి వ్యక్తిని నాశనం చేస్తాయి. అవి  వ్యక్తిని జ్ఞానం, శాంతి, ధర్మానికి దూరంగా తీసుకెళ్తాయి.  

కామం..

కామాన్నే కోరిక అని కూడా అంటారు.  ఇది  అన్ని జీవులలోనూ ఉండే సహజమైన  స్వభావం. మానవ కోరికలు అదుపు తప్పినప్పుడు అవి వాటి పరిమితులను అధిగమించడం మొదలుపెడతాయి.  శ్రీకృష్ణుడు ప్రకారం కామం ఒక వ్యక్తి ఆలోచనను కప్పివేస్తుంది, తద్వారా మానవుడు ధర్మం నుండి,  తను చేయాల్సిన సరైన విధి నుండి.. ఇలా  రెండింటి నుండి తప్పుకుంటాడు. అదుపులేని కామం మనశ్శాంతిని,  జ్ఞానాన్ని నాశనం చేస్తుంది.

దురాశ..

దురాశ అనేది మానసిక అశాంతి,  బాధలకు కారణమయ్యే తీవ్రమైన   తీరని కోరిక. సంపద, పదవి లేదా భౌతిక ఆస్తుల కోరిక పరిమితులు దాటినప్పుడు   వ్యక్తి ఆలోచన పరిధులు మించి చలిస్తుంది.  ఇది ఇతరుల హక్కులను ఆక్రమించుకోవడానికి,  అన్యాయం చేయడానికి వారిని దారితీస్తుంది. శ్రీకృష్ణుడి ప్రకారం దురాశ మనిషి ఆత్మను బంధించి పట్టి ఉంచుతుంది. భౌతిక,  ప్రాపంచిక సుఖాల కోసం పాకులాడేలా దారుణంగా మనిషిని మార్చేస్తుంది.

కోపం..

కోరికలు నెరవేరనప్పుడు లేదా  కోరికలకు ఏదైనా అడ్డు వచ్చినప్పుడు  కోపం పుడుతుంది. కోపంలో తప్పు ఒప్పు మధ్య   వ్యత్యాసాన్ని మరచిపోతారు. కోపం జ్ఞానానికి గొప్ప శత్రువు. అది మనిషి జ్ఞానాన్ని ఉపయోగించనీయదు,  ఆలోచించే సమయం ఇవ్వదు,  పూర్తీగా మూర్ఖుడిలా మార్చేస్తుంది. శ్రీకృష్ణుడు ప్రకారం ఒక క్షణం కోపం వల్ల  జీవితాంతం నష్టాన్ని భరించాల్సి రావచ్చు.

కాబట్టి మనిషి జీవితాన్ని నరకప్రాయంగా మార్చే పై మూడు విషయాలకు మనిషి ఎప్పుడైతే దూరంగా ఉంటాడో.. అప్పుడు మనిషి తన జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతాడు.

                           *రూపశ్రీ.