Read more!

అంత్యకాలంలో ఎలా ఉండాలో చెప్పిన కృష్ణుడు!!

 

అంత్యకాలంలో ఎలా ఉండాలో చెప్పిన కృష్ణుడు!!

 


అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్యా కలేబరమ్ | 

యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః||


ఎవరైతే తన అంత్యకాలములో కూడా అంటే మరణించే సమయంలో కూడా నన్నే స్మరిస్తూ దేహాన్ని విడిచిపెడతారో, అతడు నా భావాన్నే పొందుతున్నాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు.

గీతాబోధన సమయంలో అర్జునుడు కృష్ణుడిని అడిగిన ఆఖరు ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ కింది పదం వాడాడు కృష్ణుడు. 

అస్తకాలే చ = అంటే అంత్యకాలములో కూడా అని అర్థం. కేవలం అంత్యకాలములోనే అని అర్థం చేసుకోకూడదు. మరణ సమయంలో కూడా ఎవరైతే పరమాత్మను స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెడతారో, వాడు ఆ పరమాత్మ స్వరూపాన్నే పొందే అవకాశం ఉంది. "ఎవరైతే" అంటే ఎవరైతే జీవితం అంతా నిష్కామ కర్మలుచేస్తారో అని అర్థం. ఎప్పుడూ ఏవేవో కోరికలు కోరుతూ వివిధ దేవతలను ఉపాసించే వారు కాదు. వారందరూ ఆయాదేవతలతో బేరం ఆడుతుంటారు. నాకు ఇది చేస్తే నీకు ఇది చేస్తా అని కోరికలు కోరుతూ ఉంటారు. ఇక్కడ వాడిన 'చ' అంటే 'కూడా' అని అర్థం. జీవిత కాలం అంతా భగవంతుని స్మరిస్తూ అంత్యకాలంలో కూడా స్మరించిన వాడు పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు. ఇలా ఎందుకు చెప్పారంటే జీవిత కాలం అంతా పరమాత్మను స్మరిస్తూ ఉంటే అదే అలవాటు ప్రకారము అంత్యకాలంలో కూడా పరమాత్మను స్మరిస్తాడు అని కృష్ణుని భావన. 

ఒక పని చేయాలన్నా ఒక పరీక్ష పాసు కావాలన్నా, కొంత కాలం పాటు అభ్యాసము, సాధన అవసరము సంవత్సరం అంతా కష్టపడి చదివితే పరీక్షల సమయంలో అన్నీ చక్కగా గుర్తుకు వస్తాయి. తేలికగా ఉత్తీర్ణుడు కాగలడు. అంతే కానీ అప్పటికప్పుడు చదివితే ఏ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేడు. కొంత అభ్యాసం లేకుండా ఏపనీ చేయలేడు కదా, అంత్యకాలంలో భగవంతుడు గుర్తుకు రావాలంటే జీవిత కాలం అంతా కూడా భగవంతుని స్మరించడం ముఖ్యం. జీవితం అంతా దుష్ట ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, కామ సంబంధమైన ఆలోచనలు వీటితో గడిపితే అంత్య కాలంలో కూడా అవే గుర్తుకు వస్తాయి కానీ పరమాత్మ గుర్తుకు రాడు. కాబట్టి అంత్యకాలంలో కూడా పరమాత్మ స్మరణకు రావాలంటే, నిరంతరము భగవంతుని ఆలోచన, చింతన, స్మరణ, ధ్యానము, ముఖ్యము.

ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. జీవితం అంతా ధ్యానం చేస్తూ, కాస్త రిలాక్స్ అయి, ఇంతకాలం చేసాము కాసేపు కులాసాగా గడుపుదాము బాగానే ఉన్నాము కదా అప్పుడే చస్తామా ఏమన్నానా అని కాస్త కులాసా జీవితం గడిపితే, అప్పుడే మృత్యువు రావచ్చు. ఇంతకాలం చేసిన శ్రమ వృధా కావచ్చు. అన్నిమెట్లు జాగ్రత్తగా ఎక్కి ఇంక ఒక మెట్టే అని అజాగ్రత్తగా ఉంటే, ఆ మెట్టు మీది నుండి జారి, కిందికి వచ్చి పడతాడు. నడుము విరుగుతుంది. మన మేడ ఎక్కే విషయంలోనే ఇంత జాగ్రత్త అవసరం అయితే, జీవితం అనే మేడ మెట్టు ఎక్కాలంటే ఎంత జాగ్రత్త అవసరమో ఆలోచించుకోవాలి. కాబట్టి అంత్య కాలం దాకా వదలకుండా భగవంతుని స్మరించాలి ఏమరుపాటు పనికిరాదు. ఒకసారి మోహంలో పడితే, ఆ మోహం మనలను అధః పాతాళానికి తొక్కేస్తుంది. మరలా పరమాత్మ వైపుకు వెళ్లనీయదు అనే సత్యాన్ని గుర్తుకోవాలి.

అవసాన కాలంలో మనకు జరిగేవి ఏమిటో పరమాత్మ ఆనాడే ఊహించి ఉంటాడు. బంధువులు మిత్రులు చుట్టు ఉంటారు. అవి ఇవి అడుగుతుంటారు. ప్రాపంచిక విషయాల గురించి గుర్తు చేస్తుంటారు. అస్తులు, ధనము, బంగారము, వీటి గురించే ఎక్కువ అడుగుతుంటారు. ఈ సమయంలో పరమాత్మ గురించి ధ్యానం చేసే అవకాశం ఉండదు. మనసు వీటి మీదనే లగ్నం అయి ఉంటుంది. కాబట్టి జీవితం అంతా మనసు పరమాత్మయందు లగ్నం అయి ఉంటే అవసాన కాలంలో కూడా మనను అటు ఇటు చెదరకుండా ఎవరెన్ని విధాలుగా ప్రయత్నించినా చలించకుండా పరమాత్మయందు లగ్నం అయి ఉంటుంది.

ఇంత చేస్తే మనకేం ఫలితం కలుగుతుంది అని మనకు సందేహం కలుగుతుంది. దానికి పరమాత్మ స్పష్టమైన సమాధానం ఇస్తున్నాడు. ఎవరైతే నన్నే స్మరిస్తూ ఈ దేహం విడిచిపెడతాడో వాడు నన్నే పొందుతాడు అని చెప్పాడు. నన్నేపొందడం అంటే ఈ జననమరణచక్రం నుండి విడివడి, శాశ్వతమైన సుఖాన్ని, శాంతిని పొందుతాడు. 

 ◆ వెంకటేష్ పువ్వాడ.