Read more!

గంగా దసరా ఉత్సవాలు (Ganga Dussehra Celebrations)

 

గంగా దసరా ఉత్సవాలు

(Ganga Dussehra Celebrations)

 

గంగానది... దేశంలో అతి పెద్ద నది. అంతకుమించి మహా పవిత్రమైన నది. ఈ పుణ్యతీర్ధంలో మునిగితే చాలు సర్వ పాపాలూ హరించుకుపోతాయని చెప్తున్నాయి పురాణాలు. సూర్యచంద్రుల్లా గంగానదిని కనిపించే దైవంగా భావిస్తారు. గంగానది అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకుని వేడుక చేసుకునే పండుగ గంగా దసరా. గంగానదిని పూజించడానికి ఉద్దేశించిన గంగా దసరా పది రోజులపాటు ఘనంగా ఉత్సవాలు జరిగి శుక్ల దశమితో ముగుస్తుంది. రిషీకేష్, హరిద్వార్, ప్రయాగ్, ఘర్ ముక్తేశ్వర్, వారణాసి ప్రాంతాల్లో గంగా దసరాను వైభవంగా జరుపుతారు.

భగీరథుడు తపస్సు చేసి దివిలో ఉన్న గంగను భువికి రప్పించాడు. ఆకాశం నుండి వచ్చే గంగ ఉధృతిని భూమి తట్టుకోలేదని మహాశివుడు తన జటాజూటాన్ని ఆసరాగా ఇవ్వగా, అక్కడినుండి నేలకు వచ్చింది. అలా ఉద్భవించిన పవిత్ర గంగను ఆరాధించేందుకు గంగా దసరాను ఉత్తరాదిన సంబరాలు నిర్వహిస్తారు.

గంగను హిందువులు తల్లిలా, దేవతలా కొలుస్తారు. గంగా దసరా సందర్భంగా భక్తులు ఎక్కడెక్కడి నుండో వచ్చి గంగానది తీరంలో పుణ్య స్నానాలు చేస్తుంటారు. తెలిసీతెలీక చేసే తప్పులను గంగమ్మ తల్లి ప్రక్షాళన చేస్తుందని, గంగా జలాన్ని తలపై జల్లుకున్నా పుణ్యం వస్తుందని నమ్ముతారు. గంగానది తీరప్రాంతపు మట్టిని కూడా అపురూపమైందిగా భావిస్తారు. గంగా దసరా పర్వదినం సందర్భంగా గంగకు వెళ్ళిన భక్తులు కొన్ని నీళ్ళను, కొద్దిగా మట్టిని ప్రసాదంలా ఇళ్ళకు తెచ్చుకుంటారు.

గంగాజలాన్ని చిన్న చిన్న పాత్రల్లో ఉంచి, గాలి చొరబడకుండా మూతి బిగించేస్తారు. ఆ నీళ్ళు ఎన్నాళ్ళున్నా, ఎన్నేళ్ళున్నా పాడవవు. చాలామంది ఇలా గంగాజలాన్ని తెచ్చి పూజామందిరంలో ఉంచుకుంటారు. దీనివల్ల శాంతి చేకూరుతుందని, ఎలాంటి కలతలూ, కల్లోలాలూ చెలరేగవని పెద్దలు చెప్తారు.

హరిద్వార్ లో గంగానదికి హారతులు సమర్పిస్తారు. నదీప్రాంతంలో వేలాదిమంది కూర్చుని ధ్యానం చేస్తారు. నదిలో పుణ్యస్నానాలు చేసే భక్త జనసందోహంతో తీరప్రాంతాలు కిక్కిరిసి ఉంటాయి. హిమాలయ మంచు పర్వతాల్లో పుట్టిన గంగోత్రిని జీవితంలో ఒక్కసారి అయినా దర్శించుకోవాలి అంటారు. ఒక తరం వెనక్కు వెళ్ళి చూస్తే ఎందరికో కాశీ వెళ్ళి గంగానదిని చూసిరావడం అనేది ఒక పెద్ద కోరిక. ఆ ఆశ తీరినవాళ్ళు తమ అనుభూతులను ఆత్మీయులతో పంచుకుంటారు.

మామూలు దినాల్లోనే పూజ్యమైన గంగానది, ఈ ఉత్సవదినాల్లో మరింత ఆరాధ్యమైంది. పన్నెండేళ్ళకు ఒకసారి వచ్చే గంగానది పుష్కరాలు ఈ ఏడాది జరుగుతున్న సందర్భంగా ఈసారి గంగా దసరాకు మరింత ప్రాముఖ్యం వుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ల మీదుగా పయనించి బంగాళాఖాతంలో కలిసే గంగమ్మ నదికి ''గంగా దసరా'' పర్వదినం సందర్భంగా మనసారా నమస్కరించుకుందాం.