Read more!

అక్షింతల విశిష్టత (Importance of Akshintalu)

 

అక్షింతల విశిష్టత

(Importance of Akshintalu)

 

మన పూజలు, శుభ సందర్భాల్లో అక్షింతలకు ఏంతో ప్రాధాన్యత ఉంది. అక్షింతల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు. ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్యమధ్యలో ''అక్షతాన్ సమర్పయామి'' అంటూ భక్తిగా అక్షతలు జల్లడం హిందూ సంప్రదాయం. పెళ్ళిళ్ళు, పేరంటాలలో వధూవరులపై అక్షతలు జల్లి ఆశీర్వదిస్తారు. ఉయ్యాల, పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై జల్లి ఆశీర్వచనాలు పలుకుతారు.

మంత్రించిన అక్షతలు తలపై జల్లి ఆశీర్వదించినట్లయితే, శుభం చేకూరుతుందని, చెడు ఫలితాలు, దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు.

కేవలం పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లోనే కాదు, అశుభ కార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది.

బియ్యంలో తగినంత పసుపు, చిటికెడు కుంకుమ, తడిచీ తడవనట్లు కొన్ని నీళ్ళు, నాలుగు చుక్కలు నూనె వేసి అక్షతలను తయారుచేస్తారు. ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమలను వేసి తయారుచేసినట్లయితే ఆ అక్షతలు మరీ పవిత్రమైనవి.

నవగ్రహాలలో ఒక్కో గ్రహానికీ ఒక్కో ధాన్యాన్ని సెలవిచ్చారు. అలా చూసినప్పుడు సూర్యునికి గోధుమలు, కుజునికి కందులు, బుధునికి పెసలు, గురు గ్రహానికి శనగలు, శుక్రునికి అనుములు, శని గ్రహానికి నువ్వులు, రాహువుకు మినుములు, కేతువుకు ఉలవలు - సూచించారు. కానీ అక్షతలకు ఆ ధాన్యాలేవీ ఉపయోగించడంలేదు. కేవలం చంద్ర గ్రహానికి సూచించిన బియ్యాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నారు.

చంద్రుడు భూమికి ఉపగ్రహం. చంద్రుడు, మనఃకారకుడు. ''మనోబుద్ధి ప్రసాదంతు మాత్రు చింతా చ చంద్రమాః'' అంటూ ధర్మగ్రంధాల్లో ఉంది.

అంటే మనసు, బుద్ధి, గుణగణాలు, ఆలోచనలు మొదలైనవాటికి చంద్రుడు కారకుడు. అందుకే ప్రశాంతచిత్తత, సద్భావాలు కలిగేందుకు బియ్యంతో అక్షతలు తయారుచేస్తారు.

ఆశీర్వదించేందుకు మంత్రాక్షతలను చేతిలోకి తీసుకోగానే, వారి శరీరంలోని విద్యుత్తు (electro magnetic power) కొంత అక్షతలకు వస్తుంది. ఈ కారణంచేత పెద్దలు, పండితులు, సహృదయులు అక్షతలు జల్లడంవల్ల వారి మనోవాంచితం నెరవేరుతుంది. అంటే ఆశించిన ఫలితం నెరవేరుతుంది అన్నమాట.