శంఖాన్ని స్త్రీలు ఊదకూడదా.. ఇది పుక్కిటి పురాణమా లేక నిజమా!

 

శంఖాన్ని స్త్రీలు ఊదకూడదా.. ఇది పుక్కిటి పురాణమా లేక నిజమా!


 హిందూ సంప్రదాయాలలో శంఖాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దాదాపు ప్రతి శుభ కార్యం శంఖం ఊదడంతో ప్రారంభమవుతుంది. శంఖం ఊదడం వల్ల వాతావరణంలోని ప్రతికూలత తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తుంది అని నమ్ముతారు. ఈ కారణంగానే దేవుడి పూజలు,  ఉత్సవాల  సమయంలో శంఖం ఊదడం అనే సంప్రదాయం శతాబ్దాలుగా పాటించబడుతోంది. శంఖం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాకుండా శక్తికి, ధైర్యానికి చిహ్నంగా కూడా భావిస్తారు. శంఖా నాదం  విజయానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. కానీ చాలా చోట్ల శంఖాన్ని పురుషులు ఊదడమే కనిపిస్తుంది. మహిళలు శంఖం ఊదకూడదని  చెబుతుంటారు. నిజంగానే మహిళలు శంఖం ఊదకూడదా? దీని వెనుక ఏదైనా కారణం ఉందా లేక ఇది పుక్కిటి పురాణమా? తెలుసుకుంటే..

మహిళలు శంఖం ఊదకూడదా?

హిందూ  గ్రంథాలను పరిశీలిస్తే, ఏ వేదం, శాస్త్రం లేదా పురాణాలలో స్త్రీలు శంఖాన్ని ఊదకూడదని ప్రస్తావించబడలేదు. శంఖం విష్ణువుకు ఇష్టమైనది.   వైష్ణవ పూజలలో శంఖానికి చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే అభిషేకాల కోసం కూడా శంఖాన్ని ఉపయోగిస్తుంటారు.  మహిళలు శంఖం ఊదకూడదు అని ఎక్కడా పేర్కొనలేదు, ఏ గ్రంథాలలోనూ లిఖించలేదు.

శంఖం ఊదడం గురించి అపోహలు..

పురాతన కాలంలో ఏర్పడిన నమ్మకాల ప్రకారం.. స్త్రీల ఊపిరితిత్తులు పురుషుల కంటే బలహీనంగా ఉంటాయని, దీనివల్ల వారు శంఖాన్ని ఊదడం కష్టమవుతుందని నమ్మేవారు. ఇంటి బాధ్యతలు,  శారీరక అలసట కారణంగా మహిళల సామర్థ్యం తక్కువగా పరిగణించబడేది. ఈ కారణంగాస్త్రీలు శంఖాన్ని ఊదకూడదనేది ఒక సంప్రదాయంగా మారింది. కానీ ఈ వాదన వాస్తవానికి శాస్త్రీయంగా తప్పుని చెబుతున్నారు.  నేటికీ చాలా  రాష్ట్రాల్లో, దేవాలయాలు,  పండుగల సమయంలో మహిళలు ఎంతో గర్వంగానూ, భక్తితోనూ  శంఖానాదం చేస్తారు. కోల్‌కతాలో జరిగే దుర్గా పూజ దీనికి ఒక ప్రధాన ఉదాహరణ. ఇక్కడ మహిళలు ఎంతో ఉత్సాహంతో శంఖాన్ని ఊదుతారు.


శంఖాన్ని ఊదకూడదని ఎందుకు అంటారు..

నిజానికి శంఖాన్ని ఊదేటప్పుడు, శక్తి అంతా నాభి ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటుంది. ఈ ఒత్తిడి మహిళల గర్భాశయాలపై  ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు.  అందుకే మహిళలు రోజూ శంఖాన్ని ఊదకుండా ఉండటం మంచిది. ఈ జాగ్రత్త ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు లేదా శారీరక వైకల్యం ఉన్నవారికి చాలా ముఖ్యమైనది.  శంఖాన్ని స్త్రీలు ఊదకూడదు అనేది నిషేధం కాదు.. ఇది మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్టిన ఒక ఆరోగ్య జాగ్ర్తత మాత్రమే.

మహిళలు శంఖం ఊదడం వారి శారీరక సామర్థ్యం పై ఆధారపడి ఉంటుంది. కొందరు మహిళలు బలంగా ఉంటారు, మరికొందరు చాలా బలహీనంగా ఉంటారు.   అందుకే శంఖం ఊదడం అనేది మహిళల ఎంపిక. మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకపోతే వారు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పురుషుల మాదిరిగానే శంఖాన్ని ఊదవచ్చు.

                               *రూపశ్రీ.