Read more!

దేవుడికి నైవేద్యం ఎందుకు సపర్పించాలి? (Purpose of Naivedyam)

 

దేవుడికి నైవేద్యం ఎందుకు సపర్పించాలి?

(Purpose of Naivedyam)

నిత్యం దేవుడికి పూజ చేయాలని, నైవేద్యం సమర్పించాలని, అసలు దేవుడికి నివేదించని పదార్థాలు మనం తినకూడదని ధర్మగ్రంధాలు చెప్తున్నాయి. అందుకే దైవారాధనలో ప్రత్యేకంగా ప్రసాదం పెట్టడమే కాకుండా, వండిన పాత్రలను ముందుగా దేవునికి నివేదించిన తర్వాత తాము తినడం చాలామందికి అలవాటు. ఇంకొందరు తినే ప్రతి పదార్దాన్నీ, ఆఖరికి మంచినీటిని కూడా "కృష్ణార్పణం" అంటూ భక్తిగా దేవునికి అర్పించి, ఆపైన తాము తినడం లేదా తాగడం చేస్తారు. అది భక్తికి నిదర్శనం.

''దేవుడు కేవలం ప్రతిమ రూపంలో ఉంటాడు... ఏమీ సేవించడు. మరి నైవేద్యం ఎందుకు సమర్పించాలి'' - అని చాలామందికి సందేహం వస్తుంటుంది.

మనం తినే ప్రతి పదార్ధాన్నీ దేవుడికి అర్పించడం వెనుక ఓ కారణం ఉంది. అదేమిటంటే... దేవుడికి నైవేద్యం పెట్టాలి అనే యావ ఉన్నప్పుడు శుచిగా, శుభ్రంగా, నిర్మలమైన మనసుతో ఆహారాన్ని తయారుచేస్తాం. అంతే ఎక్కడా సమయాభావం లేకుండా జాగ్రత్త పడతాం. ముందుగా స్నానం చేసి పదార్ధాల దగ్గరికి వెళ్తాం. పండ్లు మొదలైనవి కూడా మంచి పక్వమైనవి, పుచ్చులు, డాగులు లేనివి, మిగలపండి కుళ్ళిపోనివి పూజకు ఉపయోగిస్తాం. నైవేద్యం సమర్పించిన తర్వాత వాటిని తింటాం.

పరిశుభ్రత లేనివి, పాడైపోయిన పదార్ధాలు, పక్వంకానివి, సరిగా ఉడకనివి, మిగల పండినవి, నిలవ ఉన్నవి, ఎంగిలి చేసినవి, రుచి లేనివి, పవిత్రంగా లేనివి - మొదలైన పదార్థాలు నివేదనకు పనికిరావు.

''ఆహార శుద్ధిః సత్వ శుద్ధిః '' - అంటూ వర్ణించింది ఉపనిషత్తు. అంటే పరిశుభ్రమైన సాత్విక ఆహారం మాత్రమే నివేదించాలి. అలాంటి పదార్దాలు మనసును ప్రశాంతంగా ఉంచి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

అలాగే, దేవుడికి నివేదించడానికి ఎప్ప్పుడూ సాత్విక పదార్ధాలను మాత్రమే వినియోగిస్తాం. దేవునిముందు నైవేద్యంగా సాత్విక పదార్ధాలను ఉంచినట్లయితే, మన ఆహారం కూడా అదే అవుతుంది కదా! అలా మనం తామస, రజో గుణాలు ఉన్న పదార్ధాలను కాకుండా సాత్విక గుణాలను పెంపొందించే సాత్విక ఆహారానికి కట్టుబడి ఉండగలుగుతాం.

అదీ సంగతి. దేవునికి నైవేద్యం సపర్పించడంతో మన మనసులో భక్తిప్రపత్తులు నెలకొనడమే కాకుండా, ఆ పదార్ధాన్ని మనం తింటాం కనుక సుఖంగా, శాంతంగా ఉంటాం.