Read more!

త్రివేణి సంగమం (Triveni Sangamam)

 

త్రివేణి సంగమం

(Triveni Sangamam)

వేణి అంటే నది. కృష్ణవేణి అంటే కృష్ణానది. ఇక్కడ త్రివేణి సంగమం అంటే మూడు నదుల సంగమం అన్నమాట. మూడు నదులు కలిసే ప్రదేశం.

 

ప్రకాశం జిల్లాలోని సురభేశ్వర కొనలో మూడు నదులు కలుస్తాయి. గుండ్లకమ్మ నది, ఎర్రవాగు, లోతువాగు అనే మూడు నదులు సురభేశ్వర కోన వద్ద కలుస్తాయి. కనుక ఈ ప్రదేశాన్ని త్రివేణి సంగమం అని పిలుస్తారు.

 

నల్లమల కొండల మధ్యనుండి ప్రవహిస్తూ వచ్చిన గుండ్లకమ్మ నది ఇక్కడికొచ్చేసరికి ఎర్రవాగు, లోతువాగులతో కలుస్తుంది.

 

నదిని పవిత్రంగా భావించే ప్రజలు రెండు లేదా మూడు నదులు కలిసే సంగమప్రాంతాన్ని మరింత పవిత్రమైందిగా తలుస్తారు. ఇంట్లో స్నానం చేయడం కంటే నదీ స్నానాన్ని పుణ్య కార్యంగా వర్ణించాయి ధార్మిక గ్రంధాలు. అందుకే కొందరు ఇప్పటికీ నదీ స్నానాన్ని ఇష్టపడతారు. ఇతర రోజుల్లో వీలు కాకున్నా కనీసం పర్వదినాల్లో నదీస్నానం చేస్తారు.

 

మామూలు నది కంటే కూడా నదీ సంగమ పుణ్యస్థలంలో స్నానం చేయడం మరీ శ్రేయస్కరం. ఈ పరిసర ప్రాంతాలవాళ్ళే కాకుండా ఇతర జిల్లాల వాళ్ళు కూడా త్రివేణి సంగమంలో స్నానం చేసి తరిస్తుంటారు. సాధారణ రోజుల కంటే శివరాత్రి పర్వదినం సందర్భంలో త్రివేణి సంగమాన్ని ఎక్కువమంది దర్శించుకుంటారు.