శని దోషాన్ని తగ్గించే ప్రసిద్ధ శని దేవాలయాలు!

 

శని దోషాన్ని తగ్గించే ప్రసిద్ధ శని దేవాలయాలు!


శని దేవుడు న్యాయ ప్రధాతగా పరిగణింపబడతాడు.  మనిషి జీవితంలో చేసే కర్మలకు తగిన ఫలితాలు ఇస్తాడు.  శని దోషం ఉందంటే జీవితంలో ఎన్నో చెడు దినాలు గడుస్తూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు,  ఆర్థిక సమస్యలు,  కుటుంబ కలహాలు.. ఇలా ఒకటేమిటి.. శని దోషం ఉన్నప్పుడు జీవితం మొత్తం భారంగా అనిపిస్తుంది. శని దోషం తగ్గించుకోవడానికి చాలామంది ఎన్నెన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు.  అయితే శని దేవ దర్శనం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది.  శని దోషాన్ని తగ్గించడానికి భారతదేశంలో కొన్ని ప్రసిద్ధి శని దేవాలయాలను దర్శనం చేసుకుంటే మంచిది. ఆ దేవాలయాలు ఏంటో తెలుసుకుంటే..

తమిళనాడులోని శనీశ్వర ఆలయం..

 భారతదేశంలోని ప్రధాన నవగ్రహ ఆలయాలలో ఒకటి తమిళనాడులో ఉంది. పురాణాల ప్రకారం ఇక్కడ ప్రార్థన చేయడం వల్ల శని దోషం  ప్రతికూల ప్రభావాలలో ఒకటి తొలగిపోతుందట.  దురదృష్టం,  కష్టాలు తొలగిపోతాయట. నాల్ తీర్థం చెరువులో స్నానం చేయడం వల్ల గత జన్మల చెడు కర్మల నుండి శుద్ధి జరుగుతుందని భక్తులు నమ్ముతారు.

మధ్యప్రదేశ్ లోని శనీశ్వర ఆలయం..

మధ్యప్రదేశ్‌లోని శనిచార ఆలయం దేశంలోని పురాతన శని ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన శనిదేవుని విగ్రహం చాలా కాలం క్రితం ఆలయం ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో పడిపోయిన ఉల్క నుండి ఏర్పడిందని నమ్ముతారు. శని విగ్రహం ఒక కొండపై ఉంటుంది.

కర్ణాటక లోని శనీశ్వర ఆలయం..

కర్ణాటకలోని బన్నంజే శ్రీ శని క్షేత్రంలో ఉన్న శనిదేవుని భారీ ఏకశిలా విగ్రహాన్ని ప్రజల సందర్శనార్థం రెండు మెట్ల వేదికపై ఉంచారు. ఈ ఆలయం ఉడిపి జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ కృష్ణ దేవాలయం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ స్వామికి నూనెతో అభిషేకం చేస్తారు. ఇదే స్వామికి నైవేద్యంగా పరిగణించబడుతుంది.

తెలంగాణలోని శనీశ్వర ఆలయం..

తెలంగాణలోని యెర్దనూర్ శని ఆలయంలో 2 అడుగుల ఎత్తైన పునాదిపై నల్లని ఏకశిలా రాయితో చెక్కబడిన 20 అడుగుల ఎత్తైన శని విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఒక్కటే దాదాపు 9 టన్నుల బరువు ఉంటుంది. శనిగ్రహ ప్రతికూల ప్రభావాలను నివారించడానికి భక్తులు ఇక్కడికి వస్తారు.


మహారాష్ట్రలోని శనీశ్వర ఆలయం..

మహారాష్ట్రలోని శని శింగణాపూర్ ఆలయం  శనిదేవుడి  అతిపెద్ద పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయానికి ఉన్న అత్యంత ప్రత్యేకత   ఏమిటంటే దీనికి పైకప్పు లేదా గోడలు ఉండవు. శని దేవుడిని 5 అడుగుల పొడవైన నల్ల రాయి రూపంలో సోనై అనే వేదికపై ఉంచారు. పురాణాల ప్రకారం, గ్రామస్తులు నదిలో తేలియాడుతున్న నల్ల రాయిని కనుగొన్నారు, దాని నుండి రక్తస్రావం అవుతోందట.  ఒక రోజు శని దేవుడు గ్రామ పెద్దకు కలలో కనిపించి, ఆ రాయి తన సొంత ప్రతిరూపమని వెల్లడించాడట.

న్యూఢిల్లీ లోని శనీశ్వర ఆలయం..

న్యూఢిల్లీలోని శని ధామ్ ఆలయంలో 21 అడుగుల ఎత్తైన శని దేవుడి విగ్రహం ఉంది.  ఇది సహజ శిల నుండి చెక్కబడింది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం. ఈ ఆలయంలో శని దేవుడిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకుల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

                                *రూపశ్రీ.