Read more!

భోగి పండుగకు ఇంద్రుడికి ఉన్న అనుబంధం ఏమిటి?

 

భోగి పండుగకు ఇంద్రుడికి ఉన్న అనుబంధం ఏమిటి?

తెలుగు వారి పండుగలు ఎప్పుడూ చాలా ప్రత్యేకం. మరీ ముఖ్యంగా మకర సంక్రాంతి అంటే ముగ్గులతో, గొబ్బెమ్మలతో.. రైతుల ఇంటికి చేరిన పంటలతో, కొత్త అల్లుళ్ళతో, కోటి సౌభాగ్యాల పండుగ సంక్రాంతి అని వర్ణిస్తారు. అయితే ఇది భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజులు జరుపుకునే పండుగ.  మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగను  భోగిపండుగ అని అంటారు. ప్రతి పండుగ వెనుక, ప్రతి ప్రత్యేక దినం వెనుక ఓ కథ ఉన్నట్టే భోగి పండుగ గురించి కూడా ఓ కథ ప్రచారంలో ఉంది. ఆ కథ ఇంద్రుడి సంబంధించినది. ఈ కథలోకి వెళితే.

 పూర్వం ప్రజలు వర్షాలు బాగా పడి, పంటలు పండాలని కోరుకుంటూ ఇంద్రుడిని ఎంతో భక్తిస్ శ్రద్ధలతో పూజించేవారు. అందరూ ఇంద్రుడిని అంతగా పూజిస్తూ ఉండటం వల్ల ఇంద్రుడికి చాలా గర్వం వచ్చేసింది. అతడి గర్వాన్ని చూసిన శ్రీకృష్ణుడు.. "ప్రజలు తనను పూజిస్తున్నారని ఇంద్రుడికి ఇంత గర్వం దేనికి?? ప్రజలకు తమకు అవసరమైన వాటిని ప్రసాదించే దేవతలను పూజించడం సహజమే కదా!! ఇంద్రుడు ఇంత విర్రవీగడం తగదు. ఇంద్రుడి గర్వం అణచాలి. లేకపోతే అది ప్రజల విషయంలో మిగిలిన దేవతల విషయంలో ఇంద్రుడి ప్రవర్తన ఊహించని విధంగా మారే అవకాశం ఉంటుంది" అనుకున్నాడు. 

ఇంద్రుడిని పూజించడానికి సిద్దమవుతున్న యాదవులతో "మీకు నేను ఒక మాట చెబుతాను. ఇక్కడ మన ఆవులు ఉన్నాయి కదా!! ఆ ఆవులు ఎంతో తృప్తిగా మేత మేయడం వల్ల అవి మనకు చక్కగా పాలు ఇస్తున్నాయి, పంటలు పండించడానికి ఉపయోగపడుతున్నాయి. వాటికి కావలసిన గడ్డి మనకు గోవర్ధన్ పర్వతం నుండే లభిస్తోంది. అలాంటప్పుడు మనం ఇంద్రుడిని పూజిస్తూ మనకు ఉపకారం చేస్తున్న గోవర్ధన పర్వతాన్ని పూజించడం ఎంతవరకు న్యాయం. అందుకే గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం" అని అన్నాడు.

వారు అందరూ అలాగే చేయడంతో ఇంద్రుడి కోపము పెరిగిపోయింది. అందరికీ తగిన బుద్ధి చెబుతాను అనుకుని భీకరమైన వర్షాలు కురిపించాడు. యాదవులు అందరూ శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి తమ బాధ మొత్తం చెప్పుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని, యాదవులకూ, గోవులకూ దాని క్రింద ఆశ్రయాన్ని కల్పించాడు. ఇంద్రుడు తన వద్ద ఉన్న ఏడు రకాల మేఘాలను వర్షింపజేసినప్పటికీ యాదవుల్ని ఏమీ చేయలేకపోయాడు. దానితో ఇంద్రుడి గర్వం అణిగిపోయింది.  శ్రీకృష్ణుడి గొప్పదనం తెలుసుకున్న ఇంద్రుడు కృష్ణుడిని క్షమించమని అడిగాడు. 

శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి మన్నించి భోగిపండుగ రోజు ఎప్పటిలాగే మళ్ళీ ఇంద్రపూజ జరిగేందుకు అనుమతి ఇచ్చాడు. 

ఇదీ భోగి పండుగ వెనుక ఉన్న ఓ కథ.

                                  ◆నిశ్శబ్ద.