Read more!

హనుమంతుడిలో కలిగిన మార్పులు!

 

హనుమంతుడిలో కలిగిన మార్పులు!

జాంబవంతుడు హనుమంతుడి జన్మ నుండి ఆయనకున్న వరాల వరకు అన్ని విషయాలు వివరంగా చెప్పగానే హనుమంతుడు మేరు పర్వతం పెరిగినట్టు తన శరీరాన్ని పెంచేశాడు. గుహలో నుండి సింహం ఆవలిస్తూ బయటకి వస్తుంటే దానిని చూసిన ప్రాణులు భయంతో ఎలా నిలబడిపోతాయో, అలా అప్పటివరకూ తమతో తిరిగిన హనుమంతుడు అటువంటి స్వరూపాన్ని పొంది, ఒక్కసారి ఆవలించి, బాహువులని పైకి ఎత్తి ఒక్కసారి విదిల్చి భూమి మీద కొట్టేసరికి వానరములన్నీ భయపడిపోతూ, శ్రీమహా విష్ణువు దర్శనం అయితే ఎలా నిలబడతారో అలా హనుమంతుడిని చూసి అంజలి ఘటించి నిలబడిపోయారు.

అప్పుడు హనుమంతుడు అక్కడ ఉన్న వృద్ధులైన వానరాలకి నమస్కరించి "నా తండ్రి వాయుదేవుడు, ఆయన అగ్నిదేవుడి యొక్క సఖుడు. వాయుదేవుడు ఎటువంటి గమనంతో వెళతాడో నేను అటువంటి గమనంతో వెళతాను. నేను వెళుతున్నప్పుడు నాకు అడ్డు వచ్చిన ఏ ప్రాణినైనా నా వక్షస్థలంతో గుద్ది చంపేస్తాను. పర్వతాలని చూర్ణం(పిండిగా చేయడం) చేస్తాను, సముద్రాల్ని కలయ తిప్పుతాను. నా బాహువుల శక్తి చేత ఈ సముద్రాన్ని తిరగ తోడుతాను. 100 యోజనములే కాదు 10,000 యోజనములైనా సరే కొన్ని వేల మార్లు అటువైపు నుండి ఇటువైపుకి వెళతాను. సూర్యుడు ఉదయిస్తుండగా భూమి నుండి ఆకాశంలోకి వెళతాను, సూర్యుడి సమీపంలో నిలబడి నమస్కారం చేస్తాను. సూర్యుడు అస్తమించడానికి పశ్చిమ దిక్కుకి వెళుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ నమస్కరించి వస్తాను. 

గరుత్మంతుడు సముద్రం మీద తిరుగుతుండగా ఆయనకి కొన్ని వేలసార్లు ప్రదక్షిణం చేస్తాను. ఇక్కడ నుండి లేచి దక్షిణ దిక్కున ఉన్న సముద్రాన్ని ముట్టుకుంటాను. రావణాసురుడిని కొట్టి చంపేస్తాను, లేదా లంకని ఫెల్లఘించి చేతితో పట్టి సముద్రానికి ఈవలి ఒడ్డుకి తీసుకువచ్చి రాముడి పాదాల దగ్గర పడేస్తాను. ఇక నా పరాక్రమము ముందు నిలబడగలిగినవాడు లేడు. బ్రహ్మగారు, దేవేంద్రుడు చెరొక ఆసనం మీద కుర్చూని మధ్య ఆసనంలో అమృతాన్ని పెడితే, ఇద్దరి మధ్యలోకి వెళ్ళి, చెరొక చేతితో ఇద్దరినీ అడ్డగించి అమృతాన్ని తీసుకురాగలను. ఈ భూమి నన్ను తట్టుకోలేకపోతుంది, అందుకని మహేంద్రగిరి పర్వతం మీద నుండి బయలుదేరతాను" అన్నాడు.

అలా హనుమంతుడు ఆ మహేంద్రగిరి పర్వతాన్ని ఎక్కుతుంటే, అక్కడున్న గంధర్వులు, విద్యాధరులు ఎగిరి పారిపోయారు. అనిల కుమారుడి పద ఘట్టనకి ఆ పర్వతం కంపించిపోయింది, చెట్లు నేలరాలిపోయాయి, మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయాయి. హనుమంతుడిని చూసిన వానరాలు "మహానుభావ! ఋషుల యొక్క ఆశీర్వచనము చేత, గురువుల యొక్క ఆశీర్వచనము చేత, దేవతల యొక్క ప్రభావము చేత ఏ విధమైన ప్రతిబంధకము లేకుండా 100 యోజనముల సముద్రాన్ని దాటి సీతమ్మ జాడ కనిపెట్టి తిరిగి నువ్వు ఎప్పుడు వస్తావా అని ఒంటి పాదం మీద నిలబడి ఉంటాము. ఇన్ని కోట్ల వానరాలకి ప్రాణము పెట్టిన వాడిగా కీర్తి గడించెదవుగాక. నీకోసం పుణ్య కర్మలను చేస్తూ ఇక్కడ నిలబడి ఉంటాము" అన్నారు.

అలా హనుమంతుడు మానసికంగా  ఉత్సాహమును పొంది లంకా పట్టణాన్ని చేరడానికి సిద్ధమైపోయాడు.

◆వెంకటేష్ పువ్వాడ.