Read more!

గోవర్ధన పూజ ఎందుకు చెయ్యాలి.. కలిగే ఫలితాలేంటి!

 

గోవర్ధన పూజ ఎందుకు చెయ్యాలి.. కలిగే ఫలితాలేంటి!

పురాణాలలో ఎన్నో పండుగలున్నాయి. ముఖ్యంగా హిందువులకు ఉన్నన్ని పండుగలు, హిందువులకు ఉన్నంత మంది దేవతలు వేరే ఏ మతానికి లేవు. వీటి అర్థం మనుషులు తమకు నచ్చిన ఎంపిక చేసుకుని భక్తి ద్వారా, ఆధ్యాత్మిక చింతన ద్వారా మోక్షాన్ని సాధించడం.  ఆశ్వయుజ మాసంలో వచ్చే దీపావళి తరువాత రోజు గోవర్ధన పూజ జరుగుతుంది. ఈ గోవర్ధన పూజను ఇతర రాష్ట్రాలలో అన్నకూట్ అని కూడా పిలుస్తారు. గోవర్ధన పూజ రోజున శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో  ప్రీతికరమైన ఆవులను, శ్రీకృష్ణుడిని పూజిస్తారు. తద్వారా శ్రీకృష్ణుని కరుణకు పాత్రులు కావచ్చని అంటారు. అయితే ఈ ఏడాది అమావాస్య  12, 13 తేదీలలో రెండురోజులలో వచ్చింది కాబట్టి గోవర్ధన పూజ ఎప్పుడనే సందేహం ఉంది.  గోవర్ధన పూజ  ఎలా జరుపుకోవాలో, దీని వల్ల కలిగే ఫలితాలు ఏంటో వివరంగా తెలుసుకుంటే..

ఈ ఏడాది దీపావళి పండుగ నవంబర్ 12, 13 తేదీలలో వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయంలో తిథి ఉన్నప్పుడు పండుగ జరుపుకుంటారు. కాబట్టి చాలామంది 13వ తేదీన దీపావళి జరుపుకున్నారు. కొన్ని ప్రాంతాలలో 12వ తేదీనే జరుపుకున్నారు. 13వ తేదీ మధ్యాహ్నం వరకు అమావాస్య ఉంది. మధ్యాహ్నం 2 గంటలా 56నిమిషాల నుండి గోవర్ధన పూజా తిథి ప్రారంభమవుతుంది.  మరుససటి రోజు అంటే నవంబర్ 14 వ తేదీ మధ్యాహ్నం 02.35 గంటల వరకు ఉంటుంది. ఏ పండుగ అయనా సూర్యోదయంలో తిథి ఉన్నప్పుడు జరుపుకుంటారు కాబట్టి గోవర్ధన పూజను నవంబర్ 14న మంగళవారం జరుపుకుంటారు.

గోవర్ధన పూజకు అనుకూలమైన సమయం..

గోవర్ధన పూజను నవంబర్ 14, మంగళవారం రోజు ఉదయం 06.43  నుండి 08.52 గంటలలోపు  పూర్తీ చేయాలి. ఇదే సరైన సమయం.
 
గోవర్ధన  పూజ చేస్తే కలిగేదేంటి?

గోవర్ధన  పూజ చేయడం వల్ల ఆ శ్రీకృష్ణ భగవానుని కరుణకు పాత్రులవుతారు. మంగళవారం ఉదయం అనురాధా నక్షత్రం ఉంటుంది. ఈ నక్షత్రంలో గోవర్ధన పూజ చేయడం శుభాన్ని చేకూర్చుతుంది.

గోవర్ధన పూజ ఎందుకు చేస్తారు?

శ్రీకృష్ణుని బాల్య క్రీడల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ గోవర్ధన గిరి ఉదంతం కూడా తెలిసే ఉంటుంది. శ్రీకృష్ణుడు ఇంద్రుడి అహంకారాన్ని అణిచివేయడానికి ఇంద్రయాగాన్నికాదని గోవర్ధన గిరిని పూజంచమని చెప్పడంతో  ఇంద్రుడి కోపం శ్రీకృష్ణునితో యుద్దానికి దారితీస్తుంది. ఆ సమయంలో కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలితో ఎత్తి  గోవులను, ప్రజలను అందరినీ రక్షిస్తాడు. చివరికి కృష్ణుడే గెలుస్తాడు. గోవులకు, ప్రజలకు గోవర్దన గిరి చేస్తున్న సహాయాన్ని గుర్తించి ఆ రోజు నుండి గోవర్ధన పూజ నిర్వహిస్తున్నారు.  ఈ రోజు గోవర్ధన గిరితో పాటు గోవులను, కృష్ణుడిని కూడా పూజిస్తారు. ఈరోజున పూజలో పిండి వంటలు, అన్నం రాశులు, ఇతర ఆహార పదార్థాలు  రాశులుగా పోసి పూజిస్తారు. అందుకే దీన్ని అన్నకూటం అని కూడా అంటారని పురాణ కథనం.

గోవర్దన గిరి పూజ ఎలా చేయాలి?

గోవర్ధన గిరి పూజ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి, శుభప్రదమైన దుస్తులు ధరించాలి. ఆ తరువాత పూజా సమయం మొదలయ్యాక  ఆవు పేడతో గోవర్ధన పర్వత ఆకారాన్ని తయారు చేయాలి. దీన్ని అగర వత్తులు, పసుపు కుంకుమలు, ధూపం-దీపం తో పూజించాలి. అనంతరం  శ్రీకృష్ణుని ప్రతిమ ఉంచి శ్రీకృష్ణునికి ఆవు పాలతో అభిషేకం చేయాలి. ఆ తరువాత అన్నపు రాశులు సమర్పించాలి. ఈ రోజున ఆవులను పూజించడం కూడా శుభప్రదం. ఆవులను పూజిస్తే కృష్ణుడు సంతోషిస్తాడు.

                             *నిశ్శబ్ద.