Read more!

రామలక్ష్మణులపై ఇంద్రజిత్ గెలిచాడా?

 

రామలక్ష్మణులపై ఇంద్రజిత్ గెలిచాడా?

రామలక్ష్మణులు చనిపోయారని వానరులు అందరూ దిక్కులుపట్టి పారిపోసాగారు. మరొకవైపు రామలక్ష్మణులు ప్రాణములు విడిచిపెట్టారని సుగ్రీవుడు బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు విభీషణుడు అక్కడికి వచ్చి "నాయనా సుగ్రీవ అన్ని వేళలా అందరికీ యుద్ధంలో విజయం కలుగుతుందని అనుకోడానికి వీలులేదు. ఎంతటివారికైనా ప్రమాదం వస్తుంది. నువ్వు ఈ పరిస్థితులలో దుఃఖాన్ని పొందకూడదు. ఈ సమయంలో నువ్వు శోకాన్ని పొందితే చెయ్యవలసిన పని స్ఫురణలోకి రాదు. అవతల వాళ్ళిద్దరూ ప్రమాదకరమైన స్థితిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరికి కాని తెలివి వచ్చిందా మనం రక్షింపబడినట్టే, వాళ్ళిద్దరికీ తెలివి రాకపోతే మనిద్దరమూ నాశనం అయినట్టే. రామలక్ష్మణుల శరీరాలలో కాంతి తగ్గలేదు, అంగుళం మేర కూడా విడిచిపెట్టకుండా బాణములతో కొట్టేసినా తట్టుకోగలిగిన బలము, వీర్యము, ప్రకాశము, శక్తి, మనోధైర్యము వాళ్ళకి ఉన్నాయి" అని చెప్పి, పారిపోతున్న వానర సైన్యాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళాడు.

కొంతసేపటికి విభీషణుడు ఆ సైన్యంతో తిరిగి వచ్చాడు. అప్పటికీ రామలక్ష్మణులు కిందపడిపోయే ఉన్నారు. పర్వతాల నుండి సెలయేళ్ళు ప్రవహించినట్టు ఇంద్రజిత్ యొక్క బాణములు పెట్టిన ప్రతి రంధ్రం నుండి రక్తం ఏరులై ప్రవహించింది. అలా రక్తం వెళ్ళిపోతుండడం వలన వాళ్ళ శరీరాలు నీరసపడిపోతున్నాయి. అప్పటిదాకా సుగ్రీవుడికి ధైర్యం చెప్పిన విభీషణుడు ఈ పరిస్థితిని చూసి ఏడ్చి నేను ఈ రాముడి మీద, లక్ష్మణుడి మీద ఆశ పెట్టుకున్నాను. రామలక్ష్మణులని ఆశ్రయిస్తే నాకు రాజ్యం లభిస్తుందని అనుకున్నాను. కాని ఈ రామలక్ష్మణులే యుద్ధంలో నిహతులయిపోయారు. ఇంక నాకు ఎవరు దిక్కు, మా అన్నయ్య నన్ను విడిచిపెట్టడు, నాకు లోకములో ఎక్కడా రక్షణ దొరకదు. నేను దురదృష్టవంతుడిని" అని బాధపడ్డాడు.

విభీషణుడు అలా మాట్లాడేసరికి అప్పటివరకూ అక్కడ నిలబడ్డ వానర సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది. అప్పుడు అంగదుడు అక్కడికి వచ్చి "ఇంత అసహ్యంగా, ఇంత సిగ్గులేకుండ వాసర సైన్యం ఎందుకు పారిపోతుంది" అని అడిగాడు. 

అప్పుడు వాళ్ళన్నారు "మేము రామలక్ష్మణులు పడిపోయారని పారిపోవట్లేదు, ఎక్కడైనా ఇంద్రజిత్ వస్తాడేమో అని పారిపోతున్నాము" అన్నారు. 

ఇలా పారిపోవడమనేది చాలా భయంకరమైన విషయం, దయచేసి మీరందరూ వెనక్కి రండి అని ఆ వానర సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చారు. ఆ సమయంలోనే ఇంద్రజిత్ లంకా నగరానికి చేరుకొని రావణుడితో "తండ్రి గారు మీరింక బెంగపడవలసిన అవసరం లేదు. నరులైన రామలక్ష్మణులని నేను సంహరించాను. నేను నిర్మించిన నాగాస్త్ర బంధనం చేత ఆ ఇద్దరూ యుద్ధ భూమిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళ శరీరంలో నుండి నెత్తురు ఏరులై పారుతోంది. వాళ్ళిద్దరూ మరణించారు. ఇక మీరు ప్రశాంతంగా ఉండండి" అన్నాడు.

ఆ మాట వినగానే రావణుడు చెప్పలేనంత సంతోషపడ్డాడు. అక్కడున్న భటులని పిలిచి "యుద్ధానికి వచ్చిన రామలక్ష్మణులు ఇద్దరూ నా కుమారుడైన ఇంద్రజిత్ చేత సంహరింపబడ్డారు, అని లంకలో చాటింపు వేయించండి. లంకంతా తోరణాలు కట్టండి, భేరీలు మ్రోగించండి. అందరూ సంతోషించేటట్టుగా పెద్ద ఉత్సవం చెయ్యండి" అని ఆజ్ఞాపించాడు.

తరువాత అక్కడ ఉన్న రాక్షస స్త్రీలని పిలిచి "మీరు ఒకసారి అశోకవనంలో ఉన్న సీత దగ్గరికి వెళ్ళండి. సీతని పుష్పక విమానం ఎక్కించి యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళండి. ఆ యుద్ధ భూమిలో మరణించిన రామలక్ష్మణులని సీత చూస్తుంది. "ఇంక ఎలాగూ నా భర్త మరణించాడు కదా. ఇంక రాముడి మీద ఎందుకు ఆశ" అని లంకకి వచ్చి అలంకారం చేసుకుంటుంది, మంచి చీర కట్టుకుని సర్వాలంకారభూషితై నా పాన్పు చేరుతుంది. తొందరగా వెళ్ళి చూపించండి" అన్నాడు రావణుడు.

                                      ◆నిశ్శబ్ద.