Read more!

ఆత్మజ్ఞానం కలగడానికి అయిదు మార్గాలు!!

 

ఆత్మజ్ఞానం కలగడానికి అయిదు మార్గాలు!! 

శ్లోకం:- ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా! 

అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరేల్||


తనలోనే ఉన్న ఆత్మస్వరూపమును కొంత మంది పరిశుద్ధమైన మనసుతో ధ్యానముచేసి చూడగలుగుతున్నారు. మరి కొందరు సాంఖ్యయోగమును, ఇంకా మరి కొందరు కర్మయోగము చేత చూడగలుగుతున్నారు.】

పరమాత్మను దర్శించడానికి ఉన్న మార్గముల గురించి పై శ్లోకంలో చెబుతున్నాడు కృష్ణుడు. కొందరు ధ్యానమార్గమును అవలంబిస్తారు. మరి కొందరు జ్ఞాన మార్గమును అవలంబిస్తారు. మరి కొందరు నిష్కామ కర్మతో కూడిన కర్మయోగమును అవలంబిస్తారు. మరి కొందరు భక్తియోగమును అవలంబిస్తారు. మానవులు వారి వారి గుణములను బట్టి, ప్రవృత్తులను బట్టి, సంస్కారములను బట్టి ఒక్కోమార్గమును అవలంబిస్తారు. ఏ మార్గము అవలంబించినా భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత చిత్తశుద్ధి ముఖ్యము. అవి ఉంటే ఏ మార్గము అవలంబించినా ఒకటే. అవి లేనిదే ఏ మార్గము అవలంబించినా ఏమీ ప్రయోజనము లేదు.

ఈ శ్లోకంలో ఆత్మని, ఆత్మానమ్, ఆత్మనా అని ఆత్మను మూడు విధాలుగా మూడు అర్థాలతో వాడారు.  మొదటి ఆత్మనా అంటే తనలో తాను అని అర్థం. అంటే పరిశుద్ధమైన మనస్సుతో అని కూడా అర్థము. ఆత్మకు మనసు అని కూడా అర్థం చెబుతారు. 

రెండవది... ఆత్మానమ్ అంటే ఆత్మను అంటే ఆత్మస్వరూపుడైన పరమాత్మను అని అర్ధం. ఆ ఆత్మ ఎక్కడ ఉంది అంటే ఆత్మనా.... అంటే తనలోనే, తన శరీరంలోనే పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్న ఆత్మను పరిశుద్ధమైన మనసుతోనే చూడగలడు. ఇలా చూడటానికి శాస్త్రజ్ఞానం కావాలి. గురువుల అనుగ్రహంతో పరమాత్మ స్వరూపం ఏమిటో ముందు తెలుసుకోవాలి. ఈ ఆత్మజ్ఞానం రావడానికి ఐదు మార్గాలు ఉన్నాయి.

1. కర్మలు చేయడం. నిష్కా కర్మలు, కర్తృత్వభావన లేకుండా కర్మలు చేయడం. దీనితో మనలో ఉన్న చెడ్డ వాసనలు తొలగి పోతాయి. కాని కర్మలు చేస్తుంటే మనసు అలజడి చెందుతుంది. 

దానికి రెండవ సాధన.....

2. ఎదురుగా తన ఇష్టదైవము యొక్క మూర్తిని(విగ్రహాన్ని) పెట్టుకొని ఉపాసించడం. పూజలు, వ్రతాలు చేయడం. దీని వలన మనసు పరమాత్మను పూజిస్తూ, చింతిస్తూ, ప్రశాంతత పొందుతుంది. 

మూడవది…..

3. తరువాత జ్ఞానం సంపాదించాలి. దానికి శాస్త్రములు చదవాలి. వినాలి, అర్థం చేసుకోవాలి. దీని వలన పరమాత్మను గురించిన జ్ఞానం కలుగుతుంది. 

నాలుగవది….

4. మననం. విన్న తరువాత, విన్న దాన్ని గురించి మననం చేయాలి. ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి. దాని గురించి విచారించాలి. విన్న దాన్ని ఒంటపట్టించుకోవాలి.  దాని వలన పరమాత్మ గురించి మనలో ఉన్న అజ్ఞానము, సంశయము తొలగి పోతుంది. పరమాత్మ గురించి మనలో ఉన్న అన్ని సందేహాలు పటాపంచలు అవుతాయి. ఆత్మ జ్ఞానం కలుగుతుంది.

అయిదవది…...

 5. ఇప్పుడు పరమాత్మను గురించి ధ్యానం చేయాలి. దానినే నిధిధ్యాసన అని అంటారు. ఆ ధ్యానంలో తనలో ఉన్న పరమాత్మను తాను దర్శిస్తాడు. అప్పుడు అతనిలో ఉన్న అన్నివిధములైన అడ్డంకులు, విపరీత భావనలు తొలగిపోతాయి. దేని గురించీ ఆలోచించడు. తనలో తాను పరమానందాన్ని పరమ శాంతిని పొందుతాడు.

మరి ఈ మెట్లు అన్నీ ఒకటొకటిగా ఎక్కాలా అన్నీ ఒకే సారి ఎక్కవచ్చా, లేక ఒకటిదాటి మరొకటి ఎక్కవచ్చా అంటే అది వారి వారి పూర్వజన్మలలో వారు ఆర్జించిన పుణ్యఫలములను బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే రెండవ పాదంలో కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పారు. కొంత మంది కర్మయోగంతో మొదలు పెడతారు. మరి కొందరు కిందటి జన్మలో కర్మయోగంలో పరిణతి చెంది ఉండటం వలన జ్ఞానయోగంతో అంటే సాంఖ్యముతో మొదలు పెడతారు. మరి కొందరు వీటి గురించి అందకు ముందు జన్మలలో పరిణతి చెంది ఉండటం వలన నేరుగా ధ్యానయోగాన్ని అవలంబిస్తారు. 

ఇట్లా మనిషి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు.

◆ వెంకటేష్ పువ్వాడ