Read more!

ప్రకృతికి నిజమైన అర్థం!! 

 

ప్రకృతికి నిజమైన అర్థం!! 


శ్లోకం:- ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీ ఉభావసి। వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ II

ప్రకృతి, పురుషుడు అనే ఈ రెండూ ఎప్పటి నుండో ఉన్నాయి. వీటికి అంతము లేదు. అంతే కాదు, ఈ వికారములు, గుణములు, ప్రకృతి నుండి సంభవిస్తున్నాయి.】


ప్రకృతి పురుషుడు ఇప్పటి వాళ్లు కాదు. అనాది నుండి ఉన్నారు. ఈ రెండు పరమాత్మ నుండి ఉద్భవించినవే. పార్వతి ప్రకృతి అయితే శివుడు పురుషుడు. అదే అర్థనారీశ్వర తత్వము. లక్ష్మి ప్రకృతి అయితే విష్ణువు పురుషుడు. అందుకే అమ్మవారు అయ్యవారి వక్షస్థలమును అలంకరించింది. సరస్వతి ప్రకృతి అయితే బ్రహ్మ పురుషుడు అందుకే సరస్వతి బ్రహ్మ నాలుక మీదనే ఉంది. ఈ ప్రకారంగా ప్రకృతి పురుషులు ఒకటే. వేరు కాదు. వారు అనాది నుండి ఉన్నారు. మనస్సు, బుద్ధి, అహంకారము అనే వికారాలు, సత్వ, రజో తమోగుణాలు ప్రకృతిలో సహజంగా ఏర్పడ్డాయి. ప్రకృతిలో నుండి పుట్టాయి. ప్రకృతిలోనే ఉన్నాయి. వీటిలో నుండి వచ్చినవే మాయ, సంసారము, బంధనములు. ఇవి కూడా అనాది నుండి ఉన్నాయి. ఈనాటివి కావు. ఈ వికారముల వలన ప్రకృతి నిరంతరం మార్పుకు లోనవుతూ ఉంటుంది. కాని పురుషునకు ఈ వికారములు, గుణములు లేవు, అంటవు. నిర్గుణుడు, నిరాకారుడు. పురుషుడు చైతన్య శక్తి. ప్రకృతి అచేతనము. అచేతనమైన ప్రకృతిలో ఈ వికారాలు, గుణములు అనాది నుండి ఉన్నాయి.

మనం నిద్రపోయాము. కల వచ్చింది. ఎప్పటి దాకా మెలుకువగా ఉన్నాము, ఎప్పుడు. నిద్రపట్టింది. ఎప్పుడు కల వచ్చింది. అనే విషయాలు మనం ఎలా చెప్పలేమో అలాగే ఈ వికారాలు, గుణాలు క్షేత్రములో ఎప్పుడు, ఎలా పుట్టాయో చెప్పలేము. ఈ వికారాలు, గుణాలు కేవలము ప్రకృతికి సంబంధించినవి. పురుషునికి కాదు. పురుషుడు అంటే ఆత్మ, పరిశుద్ధమైనది. ప్రకృతిలో ఉన్న కామము, క్రోధము, మోహము మొదలగు వికారాలకు, రజో తమోగుణాలకు లోనైతే ఆత్మ జీవాత్మ అవుతుంది. జీవాత్మ తన చుట్టు సంసారము అనే సాలెగూడు తనకు తానే నిర్మించుకుంటాడు. ఆ వికారాలు, గుణాలు అంతం అయితే కానీ జీవాత్మ, తన నిజస్వరూపమును పొంది పరమాత్మలో లీనం కాలేదు. అదే ముక్తి. దీనికి ఒకటే మార్గము. నేను వేరు ఈ శరీరము వేరు అని అనుకోవడం, ఏ వికారములకు స్పందించకపోవడం. గుణములకు అతీతంగా ఉండటం. స్థిరచిత్తము కలిగి ఉండటం.

ఇక్కడ ప్రకృతి స్త్రీ అంటాడు పరమాత్మ. ఇక్కడ ప్రకృతి అంటే స్త్రీ మాత్రమే కాదు మనిషి అంతర్లీనంగా దాగున్న ప్రవర్తన. అది ప్రకృతి, అది సహజమైనది. ఆ సహజమైన శారీరక కదలికలను ఆత్మ అనే పురుషుడు భరిస్తూ వస్తుంది. ఆత్మ శరీరంలో ఉంటుంది. ఆ శరీరం ఎన్నో మార్పులకు లోనవుతూ వస్తుంది. అయితే ఈ జీవితంలో  శరీరంలో ఉండే ఆ స్పందలకు లొంగిపోయి అవే జీవితం అనుకోకుండా వాటి నుండి మనసును దూరం చేసి నిశ్చలంగా ఉంచుకుని అప్పుడు ముక్తిని పొందాలని చెబుతాడు.

అది నిజమే కదా!! మనిషి అన్నీ నావి, నాది అనుకుంటూ పెరుగుతాడు. చివరికి నాది అనేది ఏమి మిగలదు. ఈ శరీరం కూడా మిగలదు.  శరీరం నుండి వేరు పడే ఆత్మ మాత్రమే నాది అని చెప్పుకోగలేది. దాన్ని వదిలేసి మిగిలినవాటి గురించి ఆలోచిస్తాడు మనిషి. కాబట్టి ముక్తి కావాలి అంటే మనిషి మనసును ఆత్మ వైపుకు మళ్లించుకోవాలి.

◆ వెంకటేష్ పువ్వాడ