యోగాలో మహిళలకు అద్భుతమైన సాధన మార్గం!

 

యోగాలో మహిళలకు అద్భుతమైన సాధన మార్గం!

రాత్రి అంతా హాయిగా నిద్రపోయి  ఉదయాన్నే లేచిన తరువాత మనిషికి ఎంతగానో రిలాక్స్ గా ఉంటుంది. ఉదయాన్నే ఉన్న తాజాదనం రోజు మొత్తంలో ఎప్పుడూ ఉండదు. కానీ దీన్ని అసలు గుర్తించనే గుర్తించరు మహిళలు. ఉదయం లేచిన నుండి పనుల వెంట, ఉద్యోగాల వెంట, అన్ని చక్కదిద్దుతూ తమని తాము సరిగ్గా పట్టించుకోరు కూడా. అలాంటి మహిళలు ప్రతి రోజూ ఉదయాన్ని ప్లాన్ చేసుకోవడం వల్ల రోజు మొత్తం అద్భుతమైన అనుభూతిని పొందుతారు.

యోగాలో ఒక భాగమైన ఆధ్యాత్మికత అనేది గొప్ప పాత్ర పోషిస్తుంది. మహిళలను మానసికంగా ఎంతో దృఢంగా ఉండేలా చేస్తుంది.  పైగా దీనికి ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. అధ్యాత్మికతలో ధ్యానం దే అగ్రస్థానం. ఈ ధ్యానం వల్ల శారీరకంగా  అంతర్గతంగా గొప్ప సామర్థ్యము ప్రోగవుతుంది. ఇది ఎంతో మంది అనుభవం ద్వారా సాధించేది. అందుకే మాటల్లో చెప్పడం తక్కువ అవుతుంది యోగా ద్వారా పొందే మేలు గురించి.

ప్రతి రోజూ ఉదయాన్నే కొద్దిసేపు ధ్యానం చేయడం వల్ల ఒకటి కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అందరూ ధ్యానం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని అనుకుంటారు. అది నిజమే అయినప్పటికీ దానికి మించిన లాభాలు ధ్యానం వల్ల కలుగుతాయి. ఎన్నో ఏళ్ల నుండి శరీరాన్ని అంటిపెట్టుకున్న దీర్ఘకాల వ్యాధులు ధ్యానం ద్వారా తగ్గుతాయంటే ఆశ్చర్యమేస్తుంది కానీ అది ముమ్మాటికీ నిజం. దీన్ని సైన్స్ కూడా ఆమోదించింది. ధ్యానం వల్ల ఒత్తిడి, నిరాశ, ఆందోళన తగ్గడంతో పాటు, జ్ఞాపకశక్తి పెరగడం, శరీరంలో ఉన్న రోగాల తాలూకూ కణాలు నశించడం జరుగుతుంది. ప్రతిరోజూ కనీసం 2 నుండి 5 నిమిషాలు ధ్యానంతో మొదలుపెట్టి మెల్లగా సమయాన్ని పెంచుకుంటూ ధ్యానంలో నిమగ్నమవచ్చు. 

ప్రతిరోజూ ఉదయాన్నే చేసే 5 నిమిషాల ధ్యానం రోజు మొత్తాన్ని సమర్థవంతంగా నిర్వహించే శక్తిని ఇస్తుంది. 

రాత్రంతా మెదడు తరంగాలు ఆల్ఫా ఫ్రీక్వెన్సీలో ఉన్నందు వల్ల  ఉదయాన్నే మేల్కొన్న తరువాత ధ్యానం చేయడానికి సరైన సమయం అవుతుంది. అది  ఉపచేతన మనస్సును రీప్రోగ్రామింగ్ చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.  రోజు మొత్తంమీద నియంత్రణను కలిగి ఉండటంలో ధ్యానం సహకరిస్తుంది. అంతే కాదు ప్రతిరోజు ఉదయమే ధ్యానం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఇదిగో ఇవే….

మానసిక స్థితిని పెంచుతుంది:

 ధ్యానం ఆనందం, ఆశావాదం, సంతృప్తి మొదలైన భావోద్వేగాలను మెరుగుపరిచే హార్మోన్లను విడుదల చేస్తుంది. అందుకే ధ్యానం మహిళలకు ఎంతో ముఖ్యం. 

అవగాహనను మెరుగుపరుస్తుంది: 

భావోద్వేగాల గురించి తెలుసుకోవడంలో ధ్యానం గొప్పగా సహాయపడుతుంది.  మీరు ఎలా అనుభూతి చెందాలనుకుంటున్నారో మీకు మీరే నిర్ణయించుకోవచ్చు. ఎప్పుడైతే ఎంపిక మీది అవుతుందో అప్పుడు మానసికంగా శక్తివంతులు అవుతారు. ఇలా పెరిగే స్వీయ-అవగాహన జీవితం మీద నిర్ధిష్టమైన స్పష్టత ఏర్పరిచి దాన్ని వృద్ధి చేస్తుంది. ఇలాంటి స్పష్టత ఉంటే రోజును ఎవరికి వారు సులభంగా తీర్చిదిద్దుకోగలుగుతారు.  

ఆందోళనను తగ్గించి మనస్సును ప్రశాంతపరుస్తుంది: 

ధ్యానం లోతైన ప్రశాంతతను కలిగిస్తుంది. మనిషి అలవాటైపోయిన కొన్ని చెడు మార్గాలను మెల్లగా తగ్గించడంలో సహాయపడుతుంది. మనిషి మనసు చాలా అల్లరిది. దాన్ని కోతితో పోల్చడం అందరికీ తెలిసినదే. అలాంటి అల్లరి మనసును నియంత్రణలో ఉంచే గొప్ప మార్గం ద్యానమే. రోజువారీ అసంబద్ధమైన అలవాట్లు మెల్లిగా తగ్గిపోయి, ఒక మంచి మార్గం ఏర్పాటవుతుంది ధ్యానం వల్ల.

ఒత్తిడి, ఆందోళనను నివారిస్తుంది: 

ధ్యానం అనేక రకాల వైద్యం ప్రయోజనాలను కలిగి ఉన్న పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది.  ఇది గుండె మరియు శ్వాస వేగాన్ని తగ్గిస్తుంది.  ఇది కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది, అంతేకాదు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.

పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా ఏకాగ్రతను పెంచుతుంది. శరీరంలో ఉత్సాహం స్థాయిలు పెంచుతుంది. సంతృప్తిగా ఉండేందుకు సహాయపడుతుంది. ఆరోగ్యాన్ని గొప్పగా మారుస్తుంది. మైగ్రేన్, రక్తపోటు వంటి సమస్యలను తగ్గిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల నియంత్రణను క్రమపద్ధతిలో ఉంచుతుంది. అందుకే మహిళలు సమయం లేదనే సాకు చెప్పకుండా ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు అయినా ధ్యానం చేసుకోవడం ఉత్తమం.

                                       ◆నిశ్శబ్ద.