డయాబెటిస్ - ఆడవారిలో తక్కువట..
డయాబెటిస్-ఆడవారిలో తక్కువట!
ఈ రోజుల్లో షుగర్ వ్యాధి గురించి తెలియనివారు ఎవరూ ఉండరు. అటు తినే ఆహారంలోనూ, ఇటు పనిచేసే విధానంలోనూ విపరీతమైన మార్పులు రావడంలో ఇప్పుడు షుగర్ ఇంటింటి పేరుగా మారిపోయింది. దీనికి తోడు వైద్య పరిజ్ఞానం కూడా పెరిగిపోవడంతో... షుగర్ గురించి ముందుగానే జాగ్రత్తపడేవారి సంఖ్యా పెరిగిపోయింది. ఇలాంటి వారందరికీ షుగర్ గురించి ఓ కొత్త విషయాన్ని చెప్పే పరిశోధన ఒకటి వెలుగులోకి వచ్చింది.
మగవారిలోనే ఎక్కువ:
ఆడవారితో పోలిస్తే 61 శాతం ఎక్కువగా మగవారే డయాబెటిస్ పాల్పడుతున్నారట. ఆడవారికంటే మగవారిలో డయాబెటిస్ ఏర్పడేందుకు 46 శాతం ఎక్కువ అవకాశం ఉండటమే దీనికి కారణం అని తేలింది. వారి శరీరాలలో ఉండే ఐరన్ నిల్వలే ఈ తేడాలకు కారణం అని గమనించారు. మగవారి శరిరంలో ఐరన్ నిల్వలు అధికంగా పేరుకునే అవకాశం ఉంది. ఇదే రానురానూ డయాబెటిస్-2 కి కారణం అవుతోంది. అలాగని ఒంట్లో ఐరన్ మరీ తక్కువగా ఉన్నా కూడా డయాబెటిస్ దాడి చేసే ప్రమాదం కనిపించింది. అంటే ఒంట్లో ఐరన్ తగిన మోతాదులో ఉన్నప్పుడే డయాబెటిస్ ప్రమాదం కూడా అదుపులో ఉందన్నమాట. ఇలాంటి అదుపు ఆడవారిలోనే ఎక్కువగా కనిపించింది. తూర్పు ఫిన్లండ్‌లో అనేకమంది ప్రజల ఆరోగ్య రికార్డులను గమనించిన తరువాత తేల్చిన విషయమిది.
ఇనుముతో ఏంటి సంబంధం?
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తగిన మోతాదులో ఇనుము అందుతూ ఉండాలి. కొన్ని రకాల ప్రొటీన్ల ఉత్పత్తి జరగాలన్నా, రక్తంలో హెమోగ్లోబిన్ తగ్గకుండా ఉండాలన్నా ఇనుము తప్పనిసరి. కానీ ఇదే ఇనుము, స్థాయిని దాటిటే అది ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తుందట. ఈ ఫ్రీ రాడికల్స్ మన శరీరంలోని పాంక్రియాస్‌ను దెబ్బతీస్తాయి. దీని వలన ఇన్సులిన్ సరఫరాలో లోటు ఏర్పడుతుంది. ఫలితం! టైప్ 2 డయాబెటిస్ ఒంట్లోకి ప్రవేశిస్తుంది.
ఇవీ హెచ్చరికలు:
ఆడవాళ్లం కదా మనకి డయాబెటిస్ ముప్పు తక్కువని మురిసిపోయేందుకు లేదు. ఐరన్ నిల్వలలో ఎక్కువ తక్కువలు ఏర్పడితే ఈ ప్రమాదం ఎవరి జీవితాలలోకైనా ప్రవేశించవచ్చు. కొందరు స్త్రీలు రుతుసమయంలో ఎక్కువ రక్తాన్ని కోల్పోతుంటారు. వీరిలో ఐరన్ నిల్వలు తగ్గిపోతుంటాయి. మరికొందరు స్త్రీలేమో కాస్త నీరసంగా అనిపించగానే ఫోలిక్ యాసిడ్‌తో కూడిన ఐరన్ మాత్రలను తీసుకుంటూ ఉంటారు. ఈ స్థితి వారి శరీరంలో అధిక మొత్తంలో ఐరన్ పేరుకుపోయేందుకు దోహదపడుతుంది. అందుకని ఏదో బలాన్నిస్తుందని ఎడాపెడా ఐరన్ మాత్రలను వాడేయకుండా... మనం తీసుకునే ప్రతి మాత్రకీ ఏదో ఒక ఫలితం ఉందని గ్రహించాలి. వైద్యుల సలహా మేరకే ఏ మాత్రనైనా తీసుకోవాలి. వీటికి తోడుగా ఊబకాయం బారిన పడకుండా ఉండటం, తగినంత శారీరిక శ్రమ చేయడం, పోషకాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే... అడామగా అన్న తేడా లేకుండా ఎవ్వరైనా ఆరోగ్యంగా ఉంటారని హామీ ఇస్తున్నారు పరిశోధకులు.
- నిర్జర.