సంథింగ్ చేంజ్ కావాలి!
సంథింగ్ చేంజ్ కావాలి!
ఆరోగ్యం అందరికీ కావాలి. ఆరోగ్యం కావాలి అంటే మంచి ఆహారం, మంచి అలవాట్లు, క్రమశిక్షణ కలిగిన జీవితం ఉండటంతో పాటు శరీరానికి తగినంత వ్యాయామం కూడా అవసరం. మహిళల జీవితంలో లోపించే అంశం ఏదైనా ఉందంటే అది వ్యాయామమే…
పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి నిద్ర పోయే వరకు ఉరుకుల పరుగుల జీవితం గడిపే మహిళలకు వ్యాయామం చేయడానికి తీరిక లేదు అని మాట వాస్తవమే కానీ, వీలు చేసుకోవాలని చెబుతారు మహిళా ఆరోగ్య నిపుణులు. సరే అని అటువైపు దృష్టి పెడదామని అనుకున్నా చిక్కంతా అక్కడే వస్తుంది. వ్యాయామం వైపు మనసు లేకపోవడమే మొదటి కారణం అనే విషయం కాస్త ఆశ్చర్యపరుస్తోంది. మహిళలు ఆరోగ్య పరంగా దృఢంగా మారాలి అంటే వ్యాయామమే మొదటి మెట్టు. మనిషిని చలాకీగా ఉంచే అద్భుత మార్గమది. వ్యాయామం, యోగా సాధన అనేవి శరీరాన్ని సౌకర్యవంతంగా మారుస్తాయి. అయితే వ్యాయామం వైపు మహిళలకు ఆసక్తి కుదరాలి అంటే సంథింగ్ చేంజ్ కావాలని సూచన ఇస్తున్నారు ఫిట్నెస్ నిపుణులు.
వ్యాయామం మరోలా….
వ్యాయామం అంటే కేవలం బరువులు ఎత్తుతూ చెమటలు కారుస్తూ శరీరాన్ని కష్టపెడుతూ చేసేది మాత్రమే కాదు. వ్యాయామంలో బోలెడు రకాలు వచ్చిపడ్డాయి ఈ కాలంలో. వాటిలో ఏరోబిక్స్ లాంటివి ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. మంచి మ్యూజిక్ తో శరీరాన్ని డాన్స్ తరహతో మేళవించడం ఇందులో ఇందులో ఉన్న థ్రిల్.
సాకులు చెప్పొద్దు!!
వ్యాయామం చేయడానికి మనసు పుట్టక, దాని వైపు ఆసక్తి లేక శరీరాన్ని బద్దకం ఆవరించుకుని ఉన్నప్పుడు ఒంట్లో నలతగా ఉందనో, సమయం ఉండటం లేదనో, వేరే ఇతర ముఖ్యమైన పనులు ఉన్నాయనో, ప్రాధాన్యతల గురించి వంక పెట్టుకుని వ్యాయామాన్ని దూరం జరిపేవాళ్ళు ఉన్నారు. దాని వల్ల ఇతరులకు వచ్చే నష్టం ఏమి ఉండదు అనే విషయం తెలుసుకోవాలి. వ్యాయామానికి కావాల్సిందల్లా మనసు పెట్టి అందులో సాధన చేయడమే. ఎదుటి వారు ఎవరైనా తమ తమ అభిప్రాయాలు మాత్రమే వెలిబుచ్చగలుగుతారు కానీ వారి శరీర ఆరోగ్యం ఏమి నష్టం ఉండదు కదా. కాబట్టి వ్యాయామం విషయంలో ఎవరూ ఎలాంటి సాకులూ చెప్పొద్దు.
లక్ష్యానికి దగ్గరగా…
చాలామంది వ్యాయామం చేయడానికి అయినా… బరువు తగ్గే విషయం అయినా శరీరాన్ని దృఢంగా మార్చుకోవడానికి అయినా కారణాలు ఏమైనా సరే… ఒక ప్లానింగ్ వేసుకుంటారు. రోజుకు ఇన్ని నిమిషాలు ఈ వ్యాయామం చెయ్యాలి. రోజుకు ఇన్ని సెట్లు చేయాలి, ఇంత దూరం వాకింగ్ చెయ్యాలి అని అనుకుంటారు. అయితే అవన్నీ కూడా సాధించగలరా లేదా అనే ఆలోచనను బట్టి ప్లాన్ చేసుకోవాలి. నోటి లెక్కల్లోనూ, కాగితాలు లెక్కల్లోనూ ఎన్నైనా రాయచ్చు. కానీ వాస్తవానికి వచ్చేసరికి శరీరాన్ని కష్టపెట్టడంలో వస్తుంది అసలు సమస్య అంతా…. కాబట్టి మనం వేసుకునే లెక్కలు అన్నీ సాధించెట్టుగా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అది మాత్రమే కాకుండా మనం చేరుకునే లక్ష్యానికి అనుకూలంగా కూడా ఉండాలి.
కమాన్… కమాన్…బేబీ…
ప్రతి ఒక్కరూ తమని తాము ప్రోత్సహించుకోవడం చాలా ముఖ్యం. వయసు ఎంత అనేది ఎవరికీ అవసరం లేదు. అందరూ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎలా చలాకీగా ఉంటారో అలా ఉంచుకోవాలి మనసును. ప్రతి అమ్మాయిలో చిన్న పిల్ల మనస్తత్వం ఏదో మూలన దాగుంటుంది. దాన్ని బయటకు తీసి వ్యాయామాల విషయంలో ఆచరణలో పెట్టాలి. ఏదైనా అనుకోగానే ఊ… చేసేద్దాం... అనేలా చురుగ్గా అవ్వాలి.
ఇలా ఆలోచనల్లో సంథింగ్ చేంజ్ చేసుకుంటే లైఫ్ కూడా కాస్త చేంజ్ అయ్యి ఫిట్నెస్ ఓ గాడిన పడుతుంది. మరికెందుకు ఆలస్యం.
◆నిశ్శబ్ద.