గోరంత ఆరోగ్యాన్ని గమనించుకున్నారా?

 

గోరంత ఆరోగ్యాన్ని గమనించుకున్నారా?

గోరంత దీపం కొండంత వెలుగు అంటారు. చిన్న దీపమైనా సరే గది మొత్తానికి వెలుగు ఇస్తుంది. మన ఆరోగ్యం విషయంలోనూ అంతే... చిలక జోస్యం చెప్పినట్టు  గోరంత ఆరోగ్యం శరీర పరిస్థితి గురించి ఇట్టే చెప్పేస్తుంది. ఒకప్పుడు చాలా మంది ఏదైనా ఆరోగ్య సమస్య గురించి డాక్టర్ల దగ్గరకు వెళ్ళినప్పుడు కళ్ళు, నాలుక, గోళ్ళు పరిశీలించేవారు. దాన్ని బట్టి శరీర పరిస్థితిని వివరిస్తూ సమస్య ఏంటో చెప్పేవారు. అయితే ఇప్పుడు కథ మారింది. మనిషి తన మేధస్సును వాడటం తక్కువ, డిజిటల్ నాలెడ్జ్ ని వాడటం ఎక్కువ.  అయితే గోరు పరిస్థితిని బట్టి శరీరంలో ఉన్న రోగాన్ని కనిపెట్టేయచ్చు. మరీ ముఖ్యంగా మహిళలలో గోళ్ళకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కాబట్టి ప్రతి మహిళ తెలుసుకోవలసిన విషయాలు అందరికోసం...

తెలుపు రంగు గీతలు:

గోళ్ళ మీద తెలుపు రంగు గీతలు ఏర్పడటం కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. ఇది గోళ్ళ మీద తెల్లని పట్టీలలా ఉంటుంది. ఇలాంటి గీతలు క్యాన్సర్ చికిత్సలో ఇచ్చే కీమోథెరపి వల్ల ఏర్పడతాయట. లేదంటే కాలేయ వ్యాధి, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు కూడా తలెత్తుతాయని వీటి సంకేతమట.

గోర్లు వంగిపోజడం: 

కొందరికి గోర్లు వంగిపోయినట్టు ఉంటాయి. దీనిని నెయిల్ క్లబ్బింగ్ అని పిలుస్తారు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సాధారణంగా గోరు చివరి భాగంలో వంపులు తిరిగిపోయి ఉండటం గమనించవచ్చు. ఇలా వంగిన గోర్లు కాలేయ సంబంధ సమస్యలు, గుండె సంబంధ జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, ఇన్ప్లుమెటరీ బవెల్ సిండ్రోమ్, హెచ్ ఐ వి ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఉన్నప్పుడు గోళ్ళు ఇలా వంగిపోయే అవకాశం ఉంటుంది. 

గోర్ల మీద ఎర్రని గీతలు:

గోళ్ళ మీద గీతలు కొన్ని తెలుపు రంగులో ఉంటే మరికొన్ని ఎరుపురంగులో ఉంటాయి. ఇలా ఎరుపురంగులో ఉండే గీతలను బ్యూస్ లైన్స్ అని అంటారు. ఈ గీతలు రావడం వెనుక వివిధ కారణాలు ఉన్నాయి. గోళ్ళకు గాయం కావడం, కీమోథెరపి ట్రీట్మెంట్ తీసుకోవడం, విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు, మధుమేహం ఉన్నవారిలో.. ఫెరిఫెరల్ వ్యాస్కులర్ డిసీజ్ వచ్చినప్పుడు, జింక్ లోపమున్నప్పుడు ఇలాంటి ఎర్రని గీతలు గోళ్ళమీద చోటుచేసుకుంటాయి.

చెంచా గోర్లు:

వినడానికి నవ్వు తెప్పించేలా ఉన్న ఈ గొర్లను స్పూన్ నెయిల్స్ అని అభివర్ణిస్తారు. ఇలాంటి నెయిల్స్ ఉన్నవాళ్ళలో కాయిలో నైఖియా అనే సమస్య ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు గోర్లు చదునుగా ఉంటాయి. కొంతమందిలో అయితే ఈ గోళ్లు మధ్యలోకి అణిగిపోయి ఉంటాయి. ఈ సమస్య రావడానికి కారణం చాలా ఎక్కువ మొత్తంలో ఐరన్ లోపం ఏర్పడటం. అలాగే ట్రామాకు గురి అవ్వడం వల్ల ఈ సమస్య వస్తుంది.

తెలుపు రంగు గోర్లు:

ఇవి తెల్లగా గోరు అంచులో ముదురు రంగు పాచెస్ ఏర్పడతాయి. టెర్రీస్ నెయిల్స్ అని వీటిని పిలుస్తారు. ఈ సమస్య ఉన్నవారిలో హార్ట్ ఫెయిల్యూర్, మధుమేహం, హెచ్ ఐ వి ఇన్ఫెక్షన్ వంటివి చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

ఇలా గోళ్ల పరిస్థితిని బట్టి మనిషిలో ఉన్న అనారోగ్య సమస్యలను చెబుతూ ఉంటారు. మహిళలు ఎక్కువగా బట్టలు ఉతకడం, సామాన్లు కడగడం ఇతర ఇంటి పనులు చేయడంలో గోళ్లు తడుస్తుంటాయి కాబట్టి మెత్తబడతాయి. ఇంకా ముఖ్యంగా వంట గదిలో డబ్బా మూతలు తీయడం ఇలాంటి వాటికి గోళ్లను ఎక్కువగా వాడుతుంటారు. కాబట్టి గోళ్ల గురించి సంరక్షణ ముఖ్యం.  మీ గోళ్ల ఆరోగ్యం పరిశీలించుకుని జాగ్రత్తలు తీసుకోండి.

                                         ◆నిశ్శబ్ద.