దేవుడు ఎలా వస్తాడో తెలుసా!

 

 

దేవుడు ఎలా వస్తాడో తెలుసా!


"ఇందుగలడందులేడని

సందేహము వలదు చక్రి సర్వోపగతుండు

ఎందెందు వెదకి చూచిన

అందందే గలడు దానవాగ్రణి వింటే!"

రాక్షష రాజు అయిన హిరణ్యకశిపుడుతో కొడుకు ప్రహ్లాదుడు ఇలా అంటాడు. సర్వ జగత్తుకు మూలమైన విష్ణువు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహం అక్కరలేదు. ఆయన అన్నిచోట్లా ఉంటాడు. మనసు అర్పించి ఎక్కడ వెతికితే అక్కడే కనిపిస్తాడు. 

అయితే "ఎక్కడండీ దేవుడు? రోజూ పూజలు చేస్తున్నాను. కనిపించకుంటే కనబడకపోయాడు. కనీసం మా కోరికలైనా తీరిస్తే బాగుండు" అనుకుంటారు కొంతమంది అజ్ఞానంగా. మనం ఎలా పిలిస్తే దేవుడు పలుకుతాడు? ఏ స్థితిలో ఉంటే కరుణిస్తాడు? అనే సందేహాలకు పోతన భాగవతంలోని గజేంద్రమోక్షంలో మనకు సమాధానాలు దొరుకుతాయి. పర్వతాలను మృగరాజులను సైతం లెక్క చేయక అడ్డు తొలగక సంచరించే గున్న ఏనుగు, నీటిలో మొసలి కోరలకు చిక్కి విడిపించుకోలేక విలవిలలాడుతుంది. బాధ భరించలేక ఘీంకరిస్తుంది. ఆ ఘీంకారానికి ముల్లోకాలు కదిలిపోతాయి. దేవతలంతా లేచి నిలబడి చూస్తారు.  రక్షించడానికి ఎవర్ని పిలుస్తాడో అని. అప్పుడు గజేంద్రుడు తనను రక్షించడానికి ఎవరు రావాలో చెప్తాడు.

"ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై

యెవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం

బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము దాన యైన 

వాడెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్"

ఎవని కారణంగా ఈ ప్రపంచం పుట్టి పెరిగి లీనమవుతుందో! ఎవడు ఈ మొత్తం లోకానికి మూల పురుషుడై ఆది అంతమూ తెలీకుండా ఉంటాడో! తనకి తాను జనించి సర్వజగత్తుకు మూలమైన వానిని రక్షించాలని శరణు కోరుతున్నాను అంటాడు గజేంద్రుడు.
మహావిష్ణువే కదలి రావాలని గ్రహించిన తకిమా దేవతలు వెనుదిరుగుతారు. ఆయితే ఎంతకీ దేవుడు ప్రత్యక్షం కాలేదని నైరాశ్యంతో గజేంద్రుడు ఇలా అంటాడు.

"కలడందురు దీనులయెడ

కలడందురు పరమయోగి గణములపాలం

కలడందురన్ని దిశలను

కలడు కలండనెడువాడు కలడో లేడో!"

భగవంతుడు కష్టాలలో కాగే దీనులయందు ఉన్నాడంటారు. ఇంకా మహా యోగులు సమూహాలలో ఉన్నాడంటారు. అసలు ఉన్నాడు ఉన్నాడు అని చెప్తున్న  భగవంతుడు అసలు ఉన్నాడా లేడా? అని సందేహిస్తుంది. ఇంకా భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసం నమ్మకం లేవు. ఎదో బాధలో మాట్లాడుతున్నాడు. ఇంకా మొసలితో పోరాడుతున్నాడు. ఇక దేవుడు ఎలా వస్తాడు. ఒకవైపు శక్తి మేర మొసలితో యుద్ధం చేస్తున్నాడు. తిరిగి రక్షించమని దేవున్ని ప్రార్ధిస్తున్నాడు. అంతలోనే ఉన్నాడో లేడో అనే సందేహం. అలాంటప్పుడు దేవుడు వచ్చి రక్షించాల్సిన అవసరం లేదని దైవ సాక్షాత్కారం కాలేదు. 

ఇలా కొంతకాలం గడిచాక బాధను భరించలేక శరీరంలో శక్తి క్షీణించి తనపై తనకు పూర్తి నమ్మకం కోల్పోయి అప్పుడు ఇలా అంటాడు గజేంద్రుడు

"లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్

ఠావుల్ దప్పెన ు మూర్ఛవచ్చె తనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్

నీవే తప్ప నితః పరం బెఱుగ మన్నింపం దగున్ దీనునిన్

రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!"

శరీర బలం మనోబలం రెండూ క్షీణించి పోయాయి. ఇక పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక నువ్వే దిక్కు. వచ్చి రక్షించయ్యా! అని వేడుకుంటుంది. అప్పుడు బయలుదేరాడు మహావిష్ణువు ఎలా అంటే!!

"సిరికిం జెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింప డే

పరివారంబును జీరడభ్రగపతిం మన్నింపడాకర్ణికాం

తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో

పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై"

ఎందుకు వెలుతుంది, ఎక్కడికి వెలుతుంది లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా ఉన్నపలంగా కదులుతాడు విష్ణుమూర్తి. శంఖ చక్రాలను ధరించలేదు. గరుత్మంతుణ్ణి పిలువలేదు. తన చెవుల వరకూ జారిన జుట్టును సరి చేసుకోలేదు. వైకుంఠమంతా కదిలింది విష్ణువు వెంట. మేరు పర్వతంలాంటి మొసలి శిరస్సును తన సుదర్శన చక్రంతో ఖండించి గజేంద్రుణ్ణి కాపాడతాడు మహావిష్ణువు.

ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమంటే! ఏవో చిన్న చిన్న కష్టాలకు దేవుడు గుర్తుకు వచ్చి, అప్పుడు చుట్టుపక్కలున్న దేవాలయం చిరునామా పట్టుకొని వెళ్లి స్వామీ రక్షించు అంటే దేవుడు పట్టించుకోడు. నువ్వు రోజూ పూజ చేసినా చేయకున్నా గానీ నువ్వు నిజంగా నిస్సహాయుడవై నువ్వే దిక్కు ఈశ్వరా రక్షించు అని వేడుకున్నరోజు ఏదొక రూపంలో అప్పుడు కదిలొస్తాడు.

ఎలా వస్తాడంటే "ఇదిగో లక్ష్మీ ! ఎదో పంచాయితీ ఉంటే అలా బయటకెల్తున్నా . కూరగాయలు ఏమైనా తీసుకురమ్మంటావా?" అని అడగడు. అద్దం ముందు నిల్చొని సోకులకుపోడు. సెక్యూరిటీని పిలిచి బండి సిద్ధం చేయండి అని చెప్పడు. ఉన్నపలంగా అక్కడ అదృశ్యమై శరణార్థి దగ్గర రక్షకుడిగా ప్రత్యక్షమవుతాడు అని మనం గ్రహించాలి.

- వెంకటేష్ పువ్వాడ