మట్టి-చెట్టు-మనిషి... దైవత్వానికి దారి

 

మట్టి-చెట్టు-మనిషి... దైవత్వానికి దారి

మనం ఎవరం? ఈ మట్టి, చెట్టు, పుట్టా, నేలా,నిప్పు,ఆకాశం, సూర్య చంద్రులు, వాటితో ఉదయాలు, చీకట్లు సంభవించడం ఏమిటీ? మనం ఇలా ఎందుకున్నాం? అసలు ఈ జీవజాలానికి ప్రాణం పోసి నడిపిస్తుంది ఎవరు? ఈ విశ్వం ఎలా ఏర్పడింది అని ప్రతి మనిషీ ఏదొక సందర్భంలో ప్రశ్నించుకుంటాడు. తల పగిలిపోయేలా ఆలోచిస్తాడు కానీ సమాధానం దొరకదు. అంతా మాయగా అనిపిస్తుంది. అయితే తెలీని ఎదో శక్తి ఈ జగత్తులో ఉంది అనేది మనిషి నమ్మకం. ఈ అభిప్రాయం తో ఏకీభవించే కొన్ని దేశాల్లో కళ్లముందు కనిపించే ప్రకృతినే దైవంగా ఆరాధిస్తారు. అందుకే రాయిలో కూడా దేవుడిని చూస్తాడు మనిషి. ఇలా ప్రకృతిని ఆరాధించడం మన భారతీయతలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ వృత్తాంతాన్ని అంతా పరీక్షగా గమనిస్తే ప్రతి దశలో మనిషి మట్టిని, చెట్టుని సమన్వయం చేసుకొని తను ఎదిగిన క్రమం కనిపిస్తుంది. ఒకదానితో ఒకటి ముడేసినట్లు అనిపిస్తుంది. 
మట్టి, చెట్టు లో మనకి కనిపించే సహజగుణం తిరిగి ఇవ్వడం. కానీ మనిషిలో అది కొరవడిపోతుంది. ప్రకృతితో మిళితమై చెట్టులా మట్టిలా మన నడవడిక మారాలి. నీ చేతులు నీడనిచ్చే కొమ్మలు కావాలి. నువ్వు పాదాలు మోపిన మట్టిని మట్టిలాగే బ్రతకనివ్వు చాలు. అప్పుడే నువ్వు నమ్మే అతీతశక్తి ని ఎక్కడో వేతకాల్సిన పని లేదు మనలోనే ఉదయిస్తుంది. పచ్చగా చిగురిస్తుంది. 

మట్టి... మనిషి జీవన విధానంలో ప్రతి వస్తువు పుట్టుకకి మూలం మట్టి లోనుంచే ఉంటుంది. విత్తనానికి జీవం పంచి ప్రాణం పొసే  మట్టి ఈరోజు తరిగిపోతుంది. సిమెంట్ పొరలు కింద ఊపిరాడక వేడి పొగలు వస్తుంది. కొన్ని ఆధారాల ద్వారా భూమి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని ఒక అంచనా. 70 శాతం నీరు మిగతా 30 శాతం నేల, అందులోనూ నదులు సరస్సులతో నీరు ప్రవహిస్తుంది. కొన్ని కోట్ల జీవరాసులు మిగతా భూమి పై నివసిస్తున్నాయి. అలాంటి నేలను ఎన్ని సార్లు ఎంతమంది కొలిచుంటారో చెప్పగలమా? చెప్పలేం! పోనీ కొలిచి ఇది నాది అది నీది అన్న జీవుడు శాశ్వతంగా బ్రతికున్నాడా అంటే చూపించలేం. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు మనం నమ్మే అతీత శక్తి మాత్రమే ఇక్కడ శాశ్వతం. 

చెట్టు... మట్టి లో లీనమైన విత్తనం నుంచి వచ్చిన మొక్క  చెట్టు గా ఎదిగి తిరిగి ఆకులుగా రాలిపోయి ఎరువుగా మారి నేల సత్తువు కోసం తనని తాను సమర్పించుకుంటుంది. మట్టి రుణం తీర్చుకుంటుంది. విత్తు జల్లి నీరు పోసి పెంచకున్నా గానీ మనిషికి , కలపని, ఫలాలను, ప్రాణవాయువుని అందిస్తుంది. ఋతువుల సమతౌల్యానికి వారధిగా నిలుస్తుంది. మనిషి జీవన విధానంలో గీసే అగ్గిపెట్టె దగ్గరనుంచి రాసే పేపర్ వరకూ చెట్టు నుంచే తయారవుతాయి. చెట్టుకి ప్రాణం ఉంది. అది నేల తల్లి గర్భంలో పురుడు పోసుకుంది. అనంత విశ్వాన్ని దత్తతు తీసుకొని కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. ఇప్పుడు తక్షణమే మానవజాతి ని కాపాడే ప్రత్యక్ష దైవాలు చెట్టు, మట్టి మాత్రమే!

మనిషి... మనం ఏం చేస్తున్నాము? మట్టినుంచి చెట్టునుంచి కావాల్సిన అవసరాలను తీర్చుకొని భవిష్యత్ తరాలకు ఆ ప్రయోజనాలను అందకుండా మట్టిని మాయం చేస్తున్నాము. దానితో అరణ్యాలు తరిగిపోతున్నాయి చెట్ల సంఖ్య కరిగిపోతుంది. దాని ఫలితంగానే ఈ ఉపద్రవాలు మాయదారి మహమ్మారులు హఠాత్తుగా ఊడిపడి మనిషి ఉనికినే ప్రశ్నిస్తున్నాయి. 

మనిషిగా మనం ఇక్కడికొచ్చాం, మన జీవితం ఒక అద్దె కాలం మాత్రమే! కర్మానుసారం మన పని మాత్రమే మనం చేసుకుపోవాలి. మధ్యలో మట్టిని, ప్రకృతిని ధ్వంసం చేసే అధికారం మనకి లేదు. అలా చేస్తే దైవ దోషంగానే మనం భావించాలి. ఇకనుంచి అయినా మన మట్టిని, చెట్టునీ సమన్వయం చేసుకొని రెంటినీ కాపాడుకుందాం. మనల్ని మనం కాపాడుకుందాము.

- వెంకటేష్ పువ్వాడ