Read more!

నవదుర్గల వైభోగం వచ్చేసింది!

 

నవదుర్గల వైభోగం వచ్చేసింది!

అమ్మవారి పండుగ, లోకాన్ని ఏలే అమ్మల గన్న అమ్మ తొమ్మిది రూపాల్లో అందరినీ అలరించే పండుగ. ప్రజలను తన బిడ్డలుగా  తలచి కాపాడే శక్తి. అందరి ఇళ్లకు వచ్చేస్తోంది. నవరాత్రులతో లోకానికి పండుగ తెచ్చేస్తోంది. దసరా నవరాత్రుల సంబరం అంతా ఇంతా కాదు. రోజుకొక రూపంతో అమ్మ అందరికీ దర్శనం ఇస్తూ తన బిడ్డలను సంతోషపెడుతుంది. దేవీ నవరాత్రులు జరిగినన్ని రోజులు ప్రతి దేవాలయం దేదీప్యమానంగా వెలుగొందుతుంది. 

నవరాత్రుల వేళ అమ్మవారు ఒకో రోజు ఒకో అలంకారంలో ముస్తాబవుతారు. అయితే ఏరోజు ఏ అలంకారంలో దర్శనమిస్తుందో అందరికీ తెలియాలి. 

ఈ నెల 26 వ తేదీ నుండి నవరాత్రులు మొదలవుతాయి.

ఈనెల 26 వ తేదీ మొదటి రోజున సోమవారం అమ్మవారు బాలాత్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తారు. అమ్మవారు ముద్దులొలికే బాలిక రూపంలో అందరినీ అలరిస్తారు. 

27 వ తేదీ రెండవ రోజున మంగళవారం గాయత్రి రూపంలో దర్శనమిస్తారు. వేద మాత గాయత్రి ఈ సృష్టికి జ్ఞానాన్ని అందించిన ఈ అమ్మ ఎంతో శక్తివంతమైనది.

28వ తేదీ మూడవ రోజున బుధవారం అన్నపూర్ణ దేవి అవతారంలో దర్శనమిస్తారు. సకల జీవకోటికీ ఆహారమే ఆధారం. ముఖ్యంగా మానవాళికి అన్నమే శక్తి వనరు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. ఆ అన్నానికి అధిదేవత అన్నపూర్ణమ్మ. 

29 వ తేదీ నాలుగవ రోజున గురువారం కాత్యాయనీ దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. కాత్యాయన మహర్షికి కూతురుగా పుట్టి కాత్యాయనిగా పేరొందింది ఈ అమ్మ.

30 వ తేదీ అయిదవ రోజున శుక్రవారం నాడు లలితా దేవిగా దర్శనమిస్తారు. సాధారణంగా అమ్మవారికి శుక్రవారం కు ఉన్న అనుబంధం గొప్పది. శుక్రవారం లలితా దేవిగా దర్శనమిచ్చే ఈ అమ్మకు ఘనంగా పూజలు జరుగుతాయి.

1వ తేదీ ఆరవ రోజున శనివారం నాడు మహాలక్ష్మీ రూపంలో దర్శనమిస్తారు. ఐశ్వర్యానికి అధిదేవత అయిన అమ్మను పూజిస్తే అన్ని ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని, జీవితం సంతోషంగా ఉంటుందని అందరి నమ్మకం.

● 2 వ తేదీ ఏడవ రోజు ఆదివారం సరస్వతి దేవిగా దర్శనమిస్తారు. విద్యకు మూలమైన సరస్వతి దేవి జ్ఞానప్రదాతగా విలసిల్లుతుంది. ఈరోజు ఎన్నో క్షేత్రాలలో అమ్మవారి దగ్గర పూజలు గొప్పగా జరుగుతాయి. అంతే కాదు పిల్లల చేత సరస్వతి పూజ చేయిస్తారు.

3 వ తేదీ ఎనిమిదవ రోజు సోమవారం మహిషాసుర మర్ధిని అవతారంలో దర్శనమిస్తుంది. మహిషాసురుడిని వధించిన ఈ అమ్మ కోపం స్వరూపంలో ఉంటుంది. ఈ అమ్మను పూజిస్తే భయాలు తొలగి ధైర్యం వస్తుంది.

● 4 వ తేదీ తొమ్మిదవ రోజున రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనమిస్తుంది అమ్మవారు. లోకం మీద తన చల్లని చూపులు ప్రసరింపజేస్తూ ఉంటుంది ఈ అమ్మ. అందరి చేత నీరాజనాలు అందుకుంటుంది. 

ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో నవరాత్రులు ముగిసిన తరువాత పదవరోజు దసరా పండుగ జరుపుకుంటారు. నవరాత్రులలో అమ్మవారిని పూజించి, అమ్మ కృపకు పాత్రులైతే జీవితంలో ఉన్న ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. కష్టమనుకునే వాటికి కూడా  పరిష్కారాలు దొరుకుతాయి.

                                     ◆నిశ్శబ్ద.