దేహమే దేవాలయం- ఆత్మయే దైవ స్వరూపం
దేహమే దేవాలయం- ఆత్మయే దైవ స్వరూపం
సృష్టి ఆవిర్భవించి, జీవం మనుష్య రూపం గా అవతరించినప్పటినుండి ఇప్పటిదాకా మనుషుల్ని తొలిచేస్తున్న ప్రశ్న దేవుడు ఉన్నాడా? లేడా? అని. ఉంటే ఎక్కడ ఉన్నాడు. లేకుంటే లేడని నిర్ధారణ ఏమిటి? ఇవే చర్చలు. ఏ ఒక్కదానికీ సమాధానం దొరకదు. ఈ చర్చ కారణం చేత తరతరాలుగా మునుషులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరు దేవుడు లేడు అని వాదించేవాళ్లు. వీళ్లే నాస్తికులు. ఇంకొకళ్ళు దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్లు. వీళ్లు ఆస్తికులు.
ఒక నాస్తికుడు "దేవుడు ఉన్నాడు అని నేను విశ్వసించడానికి ఇప్పటిదాకా సరి అయిన సాక్ష్యాధారాలు చూపించలేక పోయారు. 'నేను ఉన్నాను' అని నిరూపించుకునేందుకు ఇంతవరకూ ఆయాన కుడా నా
ముందు ప్రత్యక్షం కాలేదు. అలాంటప్పుడు ఉన్నాడని నేను ఎలా నమ్మాలి" అని ప్రశ్నిస్తాడు. వితండవాదంగానే ఉన్నా చూసేదానికి సహేతుకంగా, సర్వం తెలిసిన జ్ఞానిలా తెలివితో ఆడిగినట్లే ఉంటుంది. అయితే విషయం లోతుగా విశ్లేషించుకుంటే చాలా అమాయకంగా ఉంటుంది వీరి వాదన.
పూర్వం ఈ ఆస్తికులకు నాస్తికులకు జరిగిన చర్చలో ఆస్తికత్వం గురించి తెలివిగా చమత్కారంగా చెప్తాడు.
"సందిగ్దే పరే లోకే, హితం-ఏవ-ఆచరేత్-నరః
నాస్తి చేత్-నాస్తి నః-హానిః, ఆస్తి చేత్ నాస్తికః హతః"
పరలోకం ఒకటి ఉందనీ! అక్కడ దేవుడు ఉన్నాడనీ! అనుమానంగా ఉన్నప్పుడు. ఉన్నాడు అని నమ్మి మంచి కర్మాచరణలు చేయడం మంచిది. సరే నీ నాస్తిక వాదనే నిజమయితే! అయ్యో దేవుడు లేడు నేను అనవసరంగా మంచి పనులు చేసేసాను అని బాధపడం కదా! దీని వలన వచ్చే నష్టం లేదు. ఒకవేళ ఉన్నాడు అనేదే నిజమయితే దేవుడు లేడు అనే నీ పరిస్థితి ఏమవుతుంది. శరీరం పడిపోయిన నాడు ఈశ్వరుడి ముందు నిలబడి ఏమి సమాధానం చెప్పగలవు. జీవిత అర్ధం మారిపోతుంది కదా! కనుక ఉన్నాడు అని నమ్మడమే ఉత్తమం అంటాడు ఆస్తికుడు. ఇది అర్ధమయితే నాస్తికతకు ఈ లోకంలో స్థానమే ఉండదు.
అయితే ప్రస్తుతం కొంతమంది ప్రవచన కర్తలు, పీఠాధిపతులు, యోగులు దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి వేదం ప్రమాణం చేసుకొని చెప్తున్నారు. వాస్తవమే గానీ వారి విశ్లేషణలు, వివరణలు ఎంతమందికి అర్ధమవుతున్నాయి. అసలు అర్ధం చేసుకునే శక్తి ఈ కొత్త తరానికి సాధ్యమవుతుందా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. లేడు అనే బలమైన వాదాన్ని ఢీకొట్టాలంటే! ఉన్నాడు అనే మన నమ్మకాన్ని కూడా చాలా సూటిగా స్పష్టంగా చెప్పాలి. ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి వారు పామరులకు కూడా భోదపడేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.
దేవుడు లేడు లేడు అంటున్నావు. అయితే ఆ లేడు అంటున్న స్వరం ఎక్కడినుంచి వస్తుంది తెలుసా? అలా పలికేందుకు సహకరిస్తున్న ఆ నాలుకను ఎవడు ఆడిస్తున్నాడు.
మెదడు చెప్పింది అంటావా!
అయితే ఆ మెదడు ఎక్కడినుంచి వచ్చింది? అలా అనమని ప్రొగ్రామింగ్ చేసినవాడు ఎవడు?
గుండెను డెబ్భై రెండుసార్లే కొట్టుకోవాలని నియమం పెట్టిన వాడెవడు?
సృష్టిలో అంతుచిక్కని నిర్మాణాన్ని ఎక్కడో వేతకాల్సిన అవసరం లేదు. మన దేహమే ఒక బ్రహ్మాండం. మన దేహంలో ఠంచనుగా ఈ జీవక్రియలు జరిగేలా చేస్తున్నది ఎవరు?
అసలు నీ దేహం ఎక్కడినుంచి వచ్చింది అంటావు?
అమ్మ గర్భం నుంచి వచ్చానంటావా?
అయితే ఆ గర్భంలో పిండాన్ని మనిషిగా చెక్కిన శిల్పి ఎవడు?
ఆ విధంగా శరీరం తయారుకావడానికి ప్రాణ నాడులను స్పృశించిన తేజం ఎవరు?
ఒకరి వేలిముద్రలు ఒకరివి సరిపోకుండా గీతలు గీసినవాడు ఎవడు? అమ్మ గర్భంలో ఎవడున్నాడు?
దీనికి సమాధానాలు చెప్పగలిగే వారెవరైనా ఉన్నారా?
కోపం, ద్వేషం, ప్రేమ, మోహం, కామం ఇలా అన్నిటిని మన శరీరంలోనే కోడింగ్ చేసుకొని మనలోనే కూర్చున్నాడు. మన ప్రాణమే దైవ స్వరూపం. అది ఆత్మ అనుకో ఇంకేదైనా అనుకో! అందుకే మన దేహమే ఒక దేవాలయం అంటారు.
చివరిగా చిన్నమాట అంటారు. ఒక వస్తువు మనకు దొరుకుతుంది. అది ఎవరో పోగొట్టుకుంటేనే కదా నీకు దొరుకుతుంది. అంటే దానికి ఎవరో యజమాని ఉన్నాడనే కదా అర్ధం. మరి ఈ అనంత విశ్వం మన కళ్లముందు కదిలాడుతుంది. దీనికి ఎవడు యజమాని. కనిపించని నిరాకార శక్తి రూపంలో ఎవడో బ్రహ్మాండ మూర్తి ఉన్నాడనే కదా అర్ధం అంటారు.
"ఈశావ్యాసం ఇదం సర్వం,
యత్ కించ జగత్యాం జగత్!"
ఈ జగత్తులో లక్షల కోట్ల జీవరాసులు చైతన్యవంతమై చలించేది సర్వమూ ఆ పరమేశ్వర పరివ్యాపితమే! అంటుంది ఉపనిషత్తు. ఇక ఈశ్వరుడు పరత్యక్షరూపంలో కనిపించనిదెక్కడ?
- వెంకటేష్ పువ్వాడ