రామ నామం-శివకేశవుల సంఘటిత శక్తి
రామ నామం-శివకేశవుల సంఘటిత శక్తి
కలియుగంలో భగవన్నామ స్మరణ మించిన ఉత్తమ సాధన మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి భగవన్నామంలో తెలీని నిగూడ అంతరశక్తి, మహిమ ఉంటాయి. అయితే " రామ" నామం కి ఉన్నవిశిష్టత మరే నామానికి లేదని చెప్తారు.మనకున్న ఏడుకోట్ల మహామంత్రాలలో రెండక్షరాలా "రామ" మంత్రం శ్రేష్టమైనదని మనుస్మృతి తెలుపుతుంది. ఇది హరిహరతత్వంబు కలిసిన మహామంత్రం.
◆రామ నామం పుట్టుక: 'ఓం నమోనారాయణాయ' అనెడి ఆష్టాక్షరి మంత్రములో "రా" అను అక్షరం జీవాక్షరం. ఎందుకంటే ఈ మంత్రంలో 'రా' తొలగించినచో ఓం నమో నాయణాయ అన్నది అర్ధం లేనిదవుతుంది
'ఓం నమశ్శివాయ' అనెడి పంచాక్షరి మంత్రంబులో "మ" అనునది జీవాక్షరం. ఎందుకంటే ఈ మంత్రంలో 'మ' తొలగించినచో ఓం నశ్శివాయ అంటే శివుడే లేడని అర్ధం.ఈ రెండు జీవాక్షరముల సమాహారమే "రామ". శివకేశవుల సంఘటిత శక్తియే 'రామ'మంత్రం. అందుచే రామమంత్రం సర్వశక్తివంతమైన, శ్రేష్టమైన ముక్తిప్రసాద మంత్రముగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
"రా శబ్దోశ్చారణాదేవ ముఖాన్నిర్యాంతి పాతకాః / పునః ప్రవేశ భీత్యాచ మకారస్తూ కవాటవత్ //"
నోరు తెరిచి "రా" అని చెప్పునప్పుడే పాపములన్నియు నోటినుండి బయటికి వెళ్లిపోవుచున్నవి. మరల అవి లోపలకు ప్రవేశించకుండా "మ"కారం తో నోటిని మూసి బంధించుచున్నది
"రా" అక్షరం ఉచ్చరించుటవలన నోరు తెరవబడి పాపములు పోయి ముఖం మధురముగా ఉండును. "మ" అక్షరం ఉచ్చరించుటవలన నోరు మూతపడి సంతోషం కలుగును. ఇంతకంటే కర్మజీవి మనిషికి ఏమి కావాలి. రామ అని పిలిస్తే సర్వ పాపాలు బయటకు వెళ్లి శరీరం అంతః శుద్ధి కలిగి పవిత్రుడు అవుతాడు.
"శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే / సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే //"
నేను సదా రామనామమును ధ్యానించెదను, అది విష్ణు సహస్రనామములకు సమానమైనది. నీవును ఆ నామమును జపించుమని శివుడు పార్వతీదేవికి ఉపదేశించెను.
జీవుడు ముక్తి పొందవలెనని తలచి కాశీలోని మరణకాలమున ఈశ్వరుడే తారకమంత్రం స్వయముగా జీవుల దక్షిణ చెవియందు ఉపదేశించును. రామ అను శబ్దమును మరా అని జపించి దోపిడిదొంగ రత్నాకరుడు వాల్మికి మహాముని అయ్యెను. సహస్రనామములతో సమానమని శివుని వచనమును విని, పార్వతీ రామనామమును పఠించి శివుని సాంగత్యం నొందెను. తన వచనములయందామెకు గల విశ్వాసం జూచి, సంతచించి ప్రసన్నుడై పార్వతికి శివుడు తన శరీరములో ఎడమభాగమును ఇచ్చెను. రామనామ స్మరణతో రాయిరూపంలోఉన్న అహల్య రామస్పర్శకు నోచుకొని పునీతురాలైనది.
రామ అను తారకమంత్రము చేత సకల పాతకములు నశించును. పార్వతీదేవికి పరమేశ్వరుడు, వాల్మికికీ నారదుడు, భరద్వాజునకు వాల్మికి, వ్యాసులకు పరాశరులు, శుకులకు వ్యాసుడు ఉపదేశించినది తారక మంత్రమే. తారకమంత్రము కంటే ఉత్తమమంత్రం లేదు. జై శ్రీరామ్!
- వెంకటేష్ పువ్వాడ