Read more!

విశ్వామిత్రుడితో రాముడి ప్రయాణం!!

 

విశ్వామిత్రుడితో రాముడి ప్రయాణం!!

కౌసల్య యొక్క కుమారుడైన రామా, తూర్పు దిక్కువ సూర్యుడు ఉదయిస్తున్నాడు. కనుక సువ్వు నిద్రలేచి ప్రొద్దున్న చేసే పూర్వ సంధ్యా వందనం చెయ్యాలి. రాక్షసులను సంహరించే నువ్వు మనుషులలో సింహం వంటివాడివి, దేవుడి ఆజ్ఞ ప్రకారం చేయవలసిన పనులను  నెరవేర్చడానికి శుభపరమైన సమయం మించదాకూడదు. అందుకని రామా నిద్రలే…. ,


రామలక్ష్మణులిద్దరూ నిద్ర లేచి చెయ్యవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు. మళ్ళీ బయలుదేరి గంగ సరయు సంగమ స్థానం దాక వెళ్లారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి అది ఎవరిదని రాముడు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు.


ఒకానొకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు బాణ ప్రయోగం చెయ్యబోతే, శివుడు తన మూడవ కంటితో మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశం ఇదే. మన్మధుడి అంగములన్ని కాలి బూడిదైన ఈ ప్రాంతాన్ని అంగదేశం అని పిలుస్తారు. ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకి కొంతమంది శిష్యులున్నారు. శంకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసినవాళ్ళ దగ్గరనుండి ఈనాటి వరకు ఉన్న వీళ్ళందరూ పాపము లేనివారు కాబట్టి రామా ఈ రాత్రికి వీళ్ళందరితో కలిసి పడుకొ" అని చెప్పాడు.


మరుసటి రోజున ఆ ఆశ్రమములో ఉన్న మహర్షులు గంగా నదిని దాటడానికి విశ్వామిత్ర రామలక్ష్మనులకి పడవ ఏర్పాటు చేశారు. ముగ్గురూ ఆ పడవలో ప్రయాణమయ్యారు. ఆ పడవ గంగా నదిలో వెళుతుండగా ఒక చోట గట్టిగా ధ్వని వినిపించింది. అప్పుడు రాముడు అంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుంది అని విశ్వామిత్రుడిని అడిగాడు. ఇప్పుడు ఆయన ఇలా చెప్పారు ఒకనాడు బ్రహ్మ గారు తన మనస్సుతో కైలాస పర్వత శిఖరాల మీద ఒక సరోవరాన్ని నిర్మించారు. ఆ సరస్సుకి మానస సరోవరం అని పేరు. ఆ సరోవరం నుండి ప్రవహించినదే సరయు నది. పవిత్రమైన సరయు నది ఈ ప్రాంతములో గంగా నదితో సంగమిస్తుంది. కాబట్టి ఒకసారి ఆ నదీ సంగమానికి సమస్కరించమన్నాడు. అవతలి ఒడ్డుకు చేరాక అందరూ పడవ దిగి అరణ్యంగుండా తమ ప్రయాణం కొనసాగించారు.


అలా వాళ్ళు వెలుతుంటే అక్కడున్న అరణ్యములో ఈల పక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి. పులులు, సింహాలు, ఏనుగులు తిరుగుతున్నాయి. ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడగగా, ఆయన ఇలా చెప్పారు 


"పూర్వము ఇక్కడ మలదము, కరూపము అని రెండు జనపదాలు(ప్రజల నివాసాలు. వాటినే పట్టణాలు అంటారు) ఉండేవి. ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ రెండు పట్టణాలు ఇవాళ అలా లేవు. దీనికంతటికి కారణం తాటక అనే ఒక స్త్రీ. ఆమె ఒక యక్ష కాంత, రాక్షసిగా మారి ఇక్కడున్న జానపదులందరిని(ప్రజలను) హింసించేది. అందుకనే ఇక్కడ ఎవరూ లేరు" అన్నాడు. అప్పుడు రాముడు, అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి. అని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పారు. ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావడం వలన ఆయనని చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. బ్రహ్మహత్యా పాతకం వలన ఇంద్రుడికి రెండు లక్షణాలు వచ్చాయి. ఆయనికి శరీరంలో మలం పుట్టడం ప్రారంభమయ్యింది. అలాగే ఆకలి కూడా కలిగింది. అప్పుడు ఆయన ఋషులని ఆశ్రయిస్తే వారు ఆ రెండు లక్షణాలని తొలగించారు. కాని ఆ రెండు భూమి మీద పడ్డాయి. అవి పడ్డ ప్రదేశాలని మలచము, కరూపము అనే రెండు జానపదములుగా వర్ధిల్లుతాయని. ఇక్కడున్న ప్రజలు సుఖసంతోషములతో ఆనందంగా ఉంటారని. ఇంద్రుడు వరం ఇచ్చాడు.


అలాగే పూర్వ కాలములో సుకేతు అనే యక్షుడికి పిల్లలు లేకపోతే బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నేను నీకు కొడుకులని ఇవ్వను, ఒక కూతురుని ఇస్తాను. ఆమె కామరూపి, మహా అందగత్తె, ఆమెకి 1000 ఏనుగుల బలముంటుంది అని వరం ఇచ్చాడు. ఆమె పేరు తాటక. ఆమెకి యవ్వనం వచ్చాక సుందుడుకి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళకి మారీచుడు జన్మించాడు. 1000 ఏనుగుల బలం ఉండడం వలన, గర్వముతో, అరణ్యములో ఇష్టమొచ్చినట్టు తిరిగేవారు. ఒకనాడు సుందుడు అగస్త్య మహర్షి మీద దాడికి దిగాడు. ఆయనకి ఆగ్రహం వచ్చి సుందుడిని సంహరించారు. ఇది గమనించిన తాటక తన కుమారుడితో కలిసి అగస్త్య మహర్షి మీదకి వచ్చింది. అప్పుడాయన తాటకని, 'నీకు వికృతరూపంవచ్చుగాక' అని, మారీచుడిని ఇవ్వాల్టినుండి రాక్షసుడివి అవుతావని శపించారు. ఆ తాటక ఈ రెండు నగరాల్లో సంచరిస్తూ, నరమాంస భక్షనకి అలవాటుపడింది. అందుకే ఈ నగరాలలోని జనాలు ఊరు వదిలి వెళ్ళిపోయారు" అని చెబుతాడు విశ్వామిత్రుడు.

  ◆వెంకటేష్ పువ్వాడ.