Read more!

ఆయుధపూజ ఎందుకు చేస్తారు??

 

ఆయుధపూజ ఎందుకు చేస్తారు??

దుర్గ నవరాత్రులలో చివరి రోజు అమ్మవారు మహిషాసురమర్ధినిగా దర్శనం ఇస్తుంది.

 ౹౹అయిగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే 
గిరివర వింధ్య శిరోదినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతిహే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయజయాహే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే౹౹

అనే మహిషాసురమర్ధిని స్తోత్రం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈరోజు అమ్మవారు మహిషాసురుడిని అంతం చేసి మహిషాసురమర్ధినిగా నామాన్ని స్థిరం చేసుకుంది. దుష్ట శిక్షణ శిష్ఠ రక్షణ చేసే శక్తిస్వరూపిణి ఆ అమ్మవారు.  అమ్మవారి నామాన్ని తలచి, మహిషాసురమర్ధిని స్తోత్రాన్ని పఠించినంతనే అరిష్టాలు అన్ని తొలగిపోయి మార్గం సుగమం అవుతుందని పెద్దల మాట మరియు పురాణాల కథనం. 

ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనిషిలో ఉన్న చెడు గుణాలనే అరిషడ్వర్గాలు అంటారు. ఆ అరిషడ్వర్గాలను నాశనం చేసి మనిషిని మనిషిగా నిలబెట్టి లోకాన్ని కాపాడటమే మహిషాసురమర్ధిని తత్వమని కూడా పురాణ పండితులు చెబుతారు.

సమస్యల మవలయంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళను, శారీరక, మానసిక, భౌతిక సమస్యలను దూరం చేసే శక్తిస్వరూపిణి అమ్మవారు. మూడులోకాలను యేలే అమ్మను శరణు కోరితే ముక్తిని ప్రసాదిస్తుంది. మనిషిలో నిద్రాణమై ఉన్న జ్ఞానాన్ని మేల్కొలుపుతుంది.

ఇక ఈ నవమి రోజున ఆయుధపూజ చేయడం ఒక సంప్రదాయం. అసలు ఆయుధ పూజ ఎందుకు చేస్తారు??

ప్రతి మనిషి తను చేసే పనికి ఉపయోగించే వస్తువు ఏదో ఒకటి ఉంటుంది. అది ఆ మనిషి ఆయుధం అని చెప్పవచ్చు. ఆయుధం సమర్థవంతంగా ఉంటే ఆ పనిలో సగం విజయం సాదించినట్టే. తనకు విజయాన్ని చేకూర్చినందుకు  కృతజ్ఞత చెప్పుకుంటూ ఆయుధాలకు జరిపే పూజనే ఆయుధపూజ. ఈ ఆయుధ పూజ వెనుక ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి.

మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి ప్రయత్నం చేసిన త్రిమూర్తులు మహిషాసురుడికి మగవాడి వల్ల మరణం లేదనే వరం గుర్తుచేసుకుని అమ్మవారిని మహిషాసురుడితో యుద్ధం చేయమని పంపుతారు. అమ్మవారి శక్తి పెంపొందడనికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ తమ శక్తిని ధారపోస్తారు. ఆ శక్తిని నింపుకున్న అమ్మవారు మరింత శక్తివంతురాలవుతుంది. అలాగే మిగిలిన దేవతలు తమతమ ఆయుధాలను అమ్మవారికి ఇచ్చి మరింత పటిష్టం చేస్తారు. 

ఎనిమిది చేతులతోనూ, ఆ ఎనిమిది చేతులలో ఆయుధాలు ధరించి, సింహవాహనం మీద యుద్దానికి వెళ్తుంది అమ్మవారు. లోకాన్ని తన రాక్షసత్వంతో ముప్పుతిప్పలు పెడుతున్న ఆ మహిషాసురుడితో భీకర యుద్ధం చేసి అన్ని ఆయుధాలు ఉపయోగించి చివరకు వాడిని  అంతం చేస్తుంది. ఇలా యుద్ధం పూర్తయ్యాక ఉగ్రరూపంలో ఉన్న అన్నవారిని మహిషాసురమర్ధిని స్తోత్రాన్ని సకల దేవలు అలపించి శాంతిపచేసి అమ్మవారి దగ్గర ఉన్న ఆయుధాలను తిరిగి తీసుకుని వాటిని శుద్ధి చేసి, యుద్ధంలో విజయం చేకూర్చినందుకు కృతజ్ఞతగా ఆయుధాలకు పూజ చేస్తారు. ఇదే ఆయుధపూజ వెనుక ఉన్న కథనం.

అప్పటి నుండి పురాణాలలో కూడా వివిధ సందర్భాలలో ప్రతి యుద్దానికి ముందు దుర్గాదేవి పూజ, ఆయుధపూజ జరపడం సంప్రదాయంగా వస్తోంది. 

నవమి రోజు అమ్మవారిని ఎరుపురంగు పూలతో పూజించి, గారెలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. 

◆ వెంకటేష్ పువ్వాడ