అనూరుడు
అనూరుడు
కశ్యప ప్రజాపతి బ్రహ్మమానస పుత్రులలో ఒకడు. అతనికి దితి, అదితి, వినత, కదృవ.. మొదలగు అరవై మంది భార్యలు కలరు. దితి ద్వారా దైత్యులు (రాక్షసులు), అదితి ద్వారా దేవతలు జన్మించారు. ఒకసారి వినత, కదృవ కశ్యపున్ని సేవించారు. అందుకు సంతోషించిన కశ్యపుడు వరం కోరుకొమ్మనగా కదృవ తనకి అత్యంత బలమైన వారు, పొడవాటి వారు, అతి ఉత్సాహవంతులైన వేయి మంది సంతానము కావాలని కోరుకున్నది. వినత మాత్రం అతి బలవంతులు, బుద్ధిమంతులు యశస్సు కలిగిన ఇద్దరు కుమారులను కోరుకొన్నది. కొంత కాలానికి కదృవకి ఆమె కోరుకొన్నట్టే వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడుతో పాటు ధనుంజయుడు, ఖాళీయుడు, మణి నాగుడు, అపురణుడు, సురాముఖుడు, పింజరుడు, ఏలాపుత్రుడు, వామనుడు, నీలుడు, అనీలుడు, కల్మాషుడు, శబలుడు, ఆర్యకుడు, ఉగకుడు, కలశపోతకుడు, ధదిముఖుడు, విమలపిండకుడు, ఆప్తుడు, శంఖుడు, వాలిశికుడు, నిష్టానఖుడు, హేమసహుడు, నహుషుడు, పింగళుడు, బహ్యకర్ణుడు, హస్తిపాదుడు, ముద్గురుడు, పిండకుడు, కంబలుడు, అశ్వతరుడు, కళీయుడు, వృత్తుడు, సంవర్తకుడు మొదలైన వేయి మంది సర్పాలు పుట్టాయి.
కదృవ అండాలు మొదటగా పిల్లలు అవ్వడం చూసిన వినత తన అండాలలో ఒక అండాన్ని కాస్త చిదపగా అందులో నుండి శరీరము పూర్తిగా ఏర్పడని ఒక శిశువు బయటకు వచ్చి, ఎవరిని చూసి తన శరీరము ఇలా పూర్తిగా నిర్మాణం చెందకుండా అండాన్ని బలవంతంగా పగులకొట్టిందో ఆ సవతికే దాసీ అవ్వమని శపిస్తాడు. అందుకు వినత చాలా బాధపడి ఆ శాపవిముక్తి అడగ్గా, అందుకు ఆ శిశువు వేరే అండాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకొమ్మని, ఆ పుట్టే పిల్లవాడే తల్లికి దాస్యవిముక్తి కలిగిస్తాడని తెలిపాడు. ఊరువులు పూర్తిగా ఏర్పడకుండా పుట్టినవాడు కాబట్టి అనూరుడు అన్న పేరుతో ఖ్యాతిగాంచాడు. అతనినే అరుణదేవుడు అని కూడా అంటారు. అతను సూర్యుని రధసారథై సూర్యునితో సమానంగా ఒకటే రధముపై కూర్చునేటంత యశస్సు పొందాడు.