Read more!

శుభఫలాలు దక్కాలంటే..

 

శుభఫలాలు దక్కాలంటే?

 

రాత్రంతా ఎడతెరిపి లేకుండా వాన కురిసింది.  అయినా ఉదయాన్నే తూర్పు రోజుకన్న విశేషంగా మిలమిల లాడుతూ సూర్యప్రభలు ఉదయించాయి.

తల్లి మేక పక్కన ఉన్న మేకపిల్ల తల్లిపాలు కడుపునిండా త్రాగింది. చుట్టూ ఉన్న గడ్డి వాసనచూసి ఎగిరిగంతులు వేసింది. తడి నేలమీద గంతులు వేయడమంటే దానికి మహానందం. కుప్పిగంతులు వేయసాగింది. ముందు తల్లిదగ్గర దగ్గరగా గంతులు వేయసాగింది. చెవులకు గాలి తగలడంతో దూరంగా పోవాలనుకుంది.

దూరంగా వెళ్ళకు అని తల్లి చెప్పింది. అడవిలో చిక్కుకు పోతావు. నీకు దారి తెలియక అల్లాడవలసి వస్తుంది అని హెచ్చరించింది. తల్లి మాటలు పెడచెవిన పెట్టి మేకపిల్ల కొంచెందూరం ముందుకు వెళ్ళింది. నేను కొంచెంసేపు ఆడుకుని వస్తాను, నా గురించి నువ్వు చింతించకు, నేను దారిని మరచిపోను, అంటూ వెళ్లిపోయింది మేక పిల్ల.  తల్లి నచ్చచెబుతూనే వుంది అప్పటికే మేకపిల్ల చాలా దూరం వెళ్ళిపోయింది. తన తెలివిమీద దానికి అధికగర్వం, తల్లి అడ్డగించడాన్ని అది లెక్కచెయ్యలేదు.

 



మేకపిల్ల దూకడంలో పూర్తిగా లీనమైపోయింది. సంతోషంతో కుప్పిగంతులు వేస్తూ ముందుకు వెళ్ళిపోవడంతో దానికి దారి గమించాలన్న  విషయమే గుర్తు లేకుండా పోయింది. వర్షంతో తడిసిన అడవి ఇంకా పచ్చగా, అందంగా కనిపించడంతో అది ఇంకా కొంతదూరం ముందుకువెళ్ళి అరణ్యాన్ని చూస్తాను అనుకుంటూ సాగిపోయింది. అలా ముందుకు సాగుతూ నిజంగానే మేకపిల్ల ఆ అడవిలో చిక్కుకుపోయింది. ఆ విషయం దానికి పరుగెత్తి పరుగెత్తి గెంతి గెంతి అలసిపోయిన తరువాత తెలిసింది. మరలి పోదామనుకునే సమయానికి దానికి దారి తెలియలేదు. ముళ్ళలో దట్టమైన పొదల మధ్య చిక్కుకుని అది వచ్చినదారిని మరచిపోయింది. అలా అడవిలో తిరుగుతూనే వుండిపోయింది.

అంతలో  ‘‘అరే. నువ్విక్కడకు వచ్చి మంచిపని చేశావే. నాకు మూన్నాళ్ళనుండి తిండిదొరక లేదు.‘‘ అంటూ  అక్కడ దగ్గరలో ఉన్న పొదలోనుండి ఓ పెద్ద తోడేలు బయటకు వచ్చింది. మేకపిల్లకు సమాధానమిచ్చే అవకాశము దొరకలేదు. ఏడ్వడానికీ సమయంలేదు. దానికి తన యజమానియగు గొల్లవాని పలుకులు మాత్రం స్మరణకు వచ్చాయి.

తల్లి, తండ్రి, గురువు చెప్పిన మాటలు వింటే శుభఫలాలు దక్కుతాయి. వారి మాటలు పెడచెవిన పెడితే వ్యతిరేక ఫలం తప్పక అనుభవిస్తావు.

అలా తల్లి మాట వినకుండా అడవికి వచ్చినందుకు మేకపిల్ల చిక్కుల పాలైంది.