అరుణాచల ఆలయంలో అన్నదమ్ములు!!

 

అరుణాచల ఆలయంలో అన్నదమ్ములు!!

 

అరుణాచలేశ్వర దేవాలయం 1480 అడుగుల పొడవు, 680 అడుగుల వెడల్పు కలదు. ప్రాకారములను భళ్ళాల రాజు కట్టించాడని అంటారు. తూర్పు గోపురం 216 అడుగుల ఎత్తు, 11 అంతస్థులతో వుంది. పూర్వం వాటిలోకి ఎక్కి కూర్చొనేవారు. దీనిని ప్రౌఢ దేవరాయలు కట్టించారు. అందులో కొన్ని శిధిలం కాగా, రమణమహర్షి అరుణాచలం వచ్చినపుడు నాటుకోటి చెట్టియార్లు  లక్షలు పెట్టి బాగుచేస్తునారట!

తూర్పు దిశనుండి బయలుదేరితే, కోవెల ప్రథమ ప్రాకారంలో ఈశాన్యంలో మూలమండపం వుంది.  ఆగ్నేయంలో ఒక పూలతోట ఉంది. ఈ ప్రాకారంలోనే ఉత్తరంవైపు వేయికాళ్ళ మండపం కొంత శిధిలావస్థలో వుంది. క్రింద నాపరాతి బండలు పరిచారు. దీని మధ్యభాగంలో ఒక రాతి అరుగు వుంది. దానికి నైరుతి దిశలో గల నేలమాళిగలో ఈశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు. కానీ, ఈ దేవునికి నిత్య పూజావిధులు లేవు. చీకటి వలన నేల ఎల్లపుడూ తడిగానే వుంటుంది. వేయికాళ్ళ మండపమే నిత్యం నీరు చిమ్మి శుభ్రం చేయకుండా వుండేది. దానికితోడు అక్కడే ఏనుగులను స్తంభాలకు కట్టేవారు. ఆ ప్రదేశం రమణుల తపస్సు చేసిన ప్రదేశం అగుటచే, రమణులు వున్నపుడే, రమణ మహర్షి శిష్యురాలు శ్రీమతి తల్యార్ ఖాన్, శిధిలమైన పాతాళలింగ స్థానమును మరమ్మత్తు చేయించారు. అందులో రమణుల చిత్రపటమును పెట్టి నిత్యపూజావిధులు నిర్వర్తించునట్లు ఏర్పాటు చేసారు. ఈ క్రొత్త పాతాళలింగ ప్రదేశాన్ని అప్పటి గవర్నరు జనరల్  గా వున్న శ్రీసి. రాజగోపాలాచారిగారిచే ఆవిష్కరించబడింది. 

వేయికాళ్ళ మండపానికి పడమర వున్నది వాహన మండపం. దాని వెనుక ఒక తోట కలదు. దానికి "వాళై తోటమ్" (అరటి తోట) అని పేరు. కానీ, యధార్థంగా అక్కడ వున్నది పూలతోట. ముఖ్యంగా అందులో కస్తూరి పట్టె పొదలున్నాయి.

ప్రథమ ప్రాకారంలో దక్షిణంవైపు పెద్ద కోనేరు వుంది. దీనిని కృష్ణదేవరాయలు కట్టించారని చెపుతారు. దానికి ఉత్తరంవైపు రెండు దేవాలయాలు వున్నాయి. తూర్పున వున్నదానిని “కంబత్తిలయనార్ దేవాలయమని", పడమర వున్నదానికి “శివగంగై పిళ్ళైయార్ కోవెల" అని పేర్లు. "ఇలమనార్" అనగా చిన్నవాడు. సుబ్రహ్మణ్యస్వామికి ఈ పేరు. "పిళ్ళైయార్" అనగా విఘ్నేశ్వరుడు.

"కంబత్తిలయనార్” గురించిన చరిత్ర ఇది. "ప్రౌఢ దేవరాయలు క్రీ.శ.1450 ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యానికి రాజు. అరుణాచలవాసి అయిన ‘అరుణగిరినాథర్ కవి' అంటే విపరీతమైన అభిమానం ఆయనకు. ఇది “సంబంధ అండాన్" అనే జైన కవికి ఓర్వరానిదయ్యింది. రాజు అరుణగిరినాథుని పొగుడుతుండగా, దానిని ఓర్వలేని అండాన్ ప్రౌఢ దేవరాయలుతో "మీరు అతన్ని అంతగా పొగుడుతారే, అతడు అంతటి మహనీయుడైతే తన ఇష్టదైవమైన సుబ్రహ్మణ్యస్వామిని మీకు చూపించలేడా?" అన్నాడు. రాయలుకు కూడా స్వామిని చూడాలని కోరిక వుండటంతో అరుణగిరినాథుడిని ప్రార్థించాడు.

“ఈ ఐహిక ప్రపంచాన్ని చూసిన కన్నులు ఆయనను చూసి భరించగలవా? అయినా ఆయనను ప్రార్థించి చెపుతాను" అని ఆయన కుమారస్వామిని వేడుకోగా, "నన్ను చూసిన రాయలుకు గ్రుడ్డితనం వస్తుంది, ఆ తర్వాత ఆయన ఇష్టం” అని కుమారస్వామి అరుణగిరినాథుడితో చెప్పాడు. ఆయన అదే విషయాన్ని రాయలుకు చెప్పగానే "కన్నులు పోతే పోతాయి! నాకేమి బాధలేదు. ఆయనను నేను చూడవలసిందే" అని రాజు పట్టుపట్టాడు. అరుణగిరినాథుడు స్వామిని ఆవాహన చేసి ప్రార్థించగా, కుమారస్వామి స్తంభంలో (కంబంలో) కనిపించాడట. రాయలు ఆయనను దర్శించుకోగానే కంబంలో అదృశ్యమయ్యాడు. కాబట్టి ఈ కుమారస్వామికి "కంబత్తిలయనార్” అని పేరు.

ఇలా అరుణాచాలంలో వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ కొలువై ఉన్నారు. 

◆ వెంకటేష్ పువ్వాడ