అరుణగిరి ప్రాశస్త్యం!!

 

అరుణగిరి ప్రాశస్త్యం!!

 

"అరుణాచలంలో ఈశ్వరుడు నాలుగు రూపాలలో విరాజిల్లుతున్నాడు" అని పురాణం.


 బ్రహ్మ, విష్ణువులకు ఆశ్చర్యం గొలిపి ఆది, అంతములను కనుగొనడానికి ప్రయత్నించిన తేజోమయ రూపం మొదటిది, అరుణాచలేశ్వర లింగరూపం రెండవది, అరుణగిరి మూడవది, "అరుణగిరి యోగి" అనే పేరుతో కొండమీద అదృశ్యరూపంగా వున్న సిద్ధరూపం నాల్గవది.


స్వయంగా జ్యోతి రూపమే అయినా, చూసేవారికి 'అరుణాచలం' ఎక్కువ వృక్షాలు లేకుండా, ఇటుక రంగుతో ఒక రాయిగానే స్థూలదృష్టికి కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఆ భగవంతుని కరుణ ఆ పరమేశ్వరుడి కరుణ ఉన్నవాళ్లకు తప్పకుండా అదొక జ్యోతిగా సాక్షాత్కరిస్తుంది. లేకపోతే అది సాధారణ కొండలాగే, అన్ని కొండలూ కనిపించినట్టు ఓ బండ శిలల సమ్మేళనంలానే కనబడుతుంది. 


ఈ పర్వతం అతి పురాతనమైనది అని అంటారు. "హిమాలయ పర్వతాలకన్నా పురాతనమైనదనీ, ఇది భూమిని అగ్నిమయంగా వున్న స్థితి నుండి క్రమంగా చల్లబడినపుడు మొదట ఏర్పడిన (కొండ) రాళ్ళ ప్రదేశమనీ, హిందూ మహాసముద్రంలో మునిగిపోయిన లెమూరియా ఖండంలో ఒక భాగమని భూగర్భ శాస్త్రవేత్తలు చెపుతారు. కాబట్టి పురాణాలు చెప్పినట్లుగా. ఇది భూమికి కేంద్రమని చెప్పడం ఉచితంగానే వుంటుంది.

తపస్సు చేసుకొనేవారికి ఈ గిరిపైన ఎన్నో అనుకూల ప్రదేశాలు వున్నాయి. దేవాలయ పడమటి గోపురం వెనుక వైపునుండి కొండకు మెట్లు వున్నాయి. మార్గం గుండా వెళితే, ఇరువైపులా తపస్సుకు అనుకూలంగా వున్న గుహలు, సమాధులు కనిపిస్తాయి. అక్కడక్కడ కొండనుండి పారే స్వచ్ఛమైన సెలయేర్లు కనిపిస్తాయి. గిరిమీద వృక్షాలు బాగా పెరిగి వుండడంతో నీడ సమృద్ధిగానే ఉంటుంది. ఫలపుష్పాలతో గల ఆ వాతావరణం ధ్యానానికి అనుకూలంగా వుంటుంది. గిరిని ఎక్కి తూర్పువైపుకు చూస్తే అరుణాచలేశ్వర దేవాలయం, దానికి తూర్పువైపు ఊరు, ఊరికి తూర్పున 'అయ్యంకులం చెరువు' కనిపిస్తాయి. దానికి 'ఇంద్రతీర్థమ'ని కూడా పేరు. దాని చుట్టూ పొలాలు, తోటలు, ఇంకా దూరంగా చూస్తే భూమి, ఆకాశాలను కలుపుతూ పర్వత పంక్తులు కన్నులకు ఇంపుగా ఉంటాయి.


 కాబట్టి ప్రకృతి సౌందర్యంతో ముగ్ధులైన ప్రజలు, పగలు పడే శ్రమను మరచిపోయేందుకు అపుడపుడు గిరినెక్కి వనవిహారం చేస్తూ, శాంతిసౌఖ్యాలను పొందుతారు. ఆ ప్రకృతిలో తన్మయులైన కొందరు పరమేశ్వరుని విభూతిని చూసి, అతనిని కీర్తిస్తూ కొన్ని సమయాలలో అయితే, అది కూడా వదలి ధ్యానంలో మునిగి ఆత్మారాములై పరమశాంతిని అనుభవిస్తారు.


"నా తండ్రికి వేలకొద్దీ సౌధాలు వున్నాయి. నేను దేనిలోనైన నివసించవచ్చు కదా!" అని ఒక భక్తుడు అన్నాడట. ఆ మాట ఈ గిరి విషయంలో యధార్థం.


తండ్రి అంటే ఎవరు?? 


ఆ పరమేశ్వరుడు. ఈ సకల చరాచర జగత్తు అంతటికీ ఆయనే తండ్రి, ఆ పార్వతీ దేవి తల్లి. అందరూ పరమేశ్వరుని బిడ్డలే. ఆయన్ను తండ్రిగా భావించే వారికి ఈ ప్రపంచంలో ఎక్కడైనా జీవించే హక్కు ఉంటుంది. ఆ జీవించడానికి యోగ్యులమని ఆయనకు అనిపిస్తే ఆయనే దారి చూపిస్తాడు కూడా. ఆయన దగ్గరకు వెళ్లి యోగ్యత ఉన్నవాళ్లకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటన్నిటి నుండి బయటకు తీసుకొచ్చి మరీ తన దగ్గరకు రప్పించుకుంటాడు ఆయన. 


చాలామంది వినే ఉంటారు అరుణగిరిపై  అడుగు పెట్టాలంటే ఆ శివుడి ఆజ్ఞ తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే అని. జ్యోతి స్వరూపం ఈ అరుణగిరి. ఆ జ్యోతే పరమేశ్వరుడు.

◆వెంకటేష్ పువ్వాడ.