Read more!

ఆదిశంకరుల తొలిభాష్యం వెనుక ఆసక్తికర కథనం!!

 

ఆదిశంకరుల తొలిభాష్యం వెనుక ఆసక్తికర కథనం!!

 

ఒకసారి వ్యాసులవారు తమ బ్రహ్మసూత్రాలకు, నర్మదానది వరదలను ఆపగలవాడే భాష్యం వ్రాయగలడని అన్నారట ! దాన్ని పురస్కరించుకొని గోవిందపాదులు శంకరులను కాశీక్షేత్రం వెళ్ళి అక్కడ బ్రహ్మసూత్ర భాష్యాన్ని వ్రాయమన్నారు. శంకరులు కాశీక్షేత్రంలో కొంతకాలం ఉన్నారు. ఆ రోజులలో కాశీక్షేత్రానికి భారతదేశం నాలుగు దిక్కుల నుండి ఎంతో మంది  పండితులు వచ్చి అనేక శాస్త్ర విషయాల మీద చర్చ చేసేవారు. అలా వచ్చిన పండితులలో విష్ణుశర్మ అనే ఒక బ్రాహ్మణుడు కూడా ఉన్నాడు. అతడు చోళదేశానికి చెందినవాడు. 

ఆ చోళదేశానికి చెందిన బ్రాహ్మణుడు శంకరుల వారి అద్వైత వాదాన్ని, ఆయన ప్రవచనాలను విని శంకరుల వారికి శిష్యుడుగా మారిపోయాడు. ఆ తరువాత కాల క్రమంలో అతనే పద్మపాదునిగా పేరు తెచ్చుకుంది ప్రసిద్ధులయ్యారు. కాశీకి వచ్చిన విష్ణుశర్మ మాత్రమే కాకుండా శంకరులలో స్పష్టంగా బయటకు కనిపించే తేజస్సును, శంకరులలో ఉన్న అపారమైన పాండిత్య సంపదకు, ఆయన అద్వైత వాదాన్ని   చూసి కాశీక్షేత్రంలో నివసించే వాళ్ళందరూ  ఆకర్షితులయ్యారు.

ఇదిలా ఉండగా, ఒకరోజు శంకరులు గంగలో స్నానం చేసి వస్తుండగా ఒక పంచముడు(అంటే తక్కువ కులానికి చెందిన వ్యక్తి అని అర్థం) నాలుగు కుక్కలను పట్టుకుని దారికి అడ్డంగా వస్తున్నాడు.  అతడు సరాసరి శంకరులు ఎదురుపడ్డాడు. శంకరులు అతన్ని 'ప్రక్కకు తప్పుకో' అన్నాడు, అప్పుడు అతడు 'అయ్యా! మీరు నన్ను తప్పుకోమంటున్నారు. అంటే నా దేహాన్ని(శరీరాన్ని) తప్పుకోమంటున్నారా లేక నా ఆత్మనా' అని అడిగాడు. అప్పుడు శంకరులవారికి నేను బోధించే అద్వైతం మాటల్లో మాత్రమే కాదు దానిని ఆచరణలో కూడా పెట్టాలి. అప్పుడే అద్వైత వాదానికి న్యాయం చేసినట్టు అవుతుంది అని సత్యాన్ని గ్రహించి శంకరులు 'మనీషాపంచక'మనే ఐదు శ్లోకాలను చెప్పారు. అందులో అద్వైత తత్త్వం నిబిడీకృతమయి ఉంది. ఆ మనీషాపంచకం విన్న తరువాత పంచముడు మాయమై అతని స్థానంలో విశ్వేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అది చూడగానే శంకరుడు చేతులెత్తి ఆ కాశీవిశ్వేశ్వరుడిని తనకు వచ్చిన పాండిత్యంతో స్తుతించాడు. కాశీవిశ్వేశ్వరుడు శంకరులను  ఆశీర్వదించి అంతర్థానం అయ్యాడు. ఆ రోజులలోనే శంకరులు భజగోవింద శ్లోకాలను కూడా ఆశువుగా చెప్పారు. శంకరులు కాశీ క్షేత్రానికి వచ్చిన అన్ని రోజుల తరువాత కానీ ఆయన గురువు గోవిందపాదులు పంపిన పనికి సమయం రాలేదు. 

ఒకరోజు శంకరులు సూత్రభాష్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు వ్యాసులవారు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి  వాదంలోకి దిగారు. మొదట ఆ వృద్ద బ్రాహ్మణుడు ఎవరో అనుకుని సాక్షాత్తు వ్యాసుడితో వాదనకు దిగింది శంకరుల శిష్య బృందం. అయితే తరువాత శంకరులు పద్మపాదుని జోక్యంతో ఆ వృద్ధ బ్రాహ్మణుడు వేదవ్యాసుడని గ్రహించి, ఆయన ముందు మోకరిల్లి ఆశీర్వదించమని వేడుకున్నారు. అప్పుడు వ్యాసుల వారు 'నీ భాష్యం సమగ్రంగా ఉంది ఇక నువ్వు ఏ ఆలోచనా చెయ్యక్కర్లేదు, నీకు ఏ ఆటంకాలు రావు, నువ్వు నీ భాష్యాన్ని గ్రంథస్థం చెయ్యి' అన్నారు. అలా మనకు శంకరులు గ్రంథస్థం చేసి సూత్రభాష్యం అనుగ్రహించారు. ఇదే మొదటి సూత్రభాష్యం. 

ఈవిధంగా  వ్యాసులవారితోనే వాదం జరిగి తుదకు శంకరులు తొలిభాష్యాన్ని మనకు అందివ్వగలిగారు.

◆ వెంకటేష్ పువ్వాడ