Read more!

దారుకావనంలో శివుడి లీల!!

 

దారుకావనంలో శివుడి లీల!!

శివ పురాణంలో ఒక కథ ఉంది. దారుకావనంలో కొంత మంది మునులు వైదిక కర్మకాండలకు సంబంధించిన యజ్ఞయాగాదులు చేస్తూ జీవిస్తూండేవారు. వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కర్మకాండను సాగించేవారు. వారు చేసే ఈ యజ్ఞ యాగాది కర్మల వల్లనే తమ కోరికలు సిద్ధిస్తాయని, తమకు సుఖ సంతోషాలు కలుగుతాయని, తద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మేవారు. వారు ఎన్నో యోగసిద్ధులు కూడా పొందటంతో వారిలో కొంత అహంకారం కలిగింది. తాము నిర్వహిస్తున్న కర్మల వల్లనే తమకు  సిద్ధులు లభించాయని, ఇందులో భగవంతుని ప్రమేయం ఏమీ లేదని నిశ్చయించారు. ఎన్ని సిద్ధులు పొందినా వారు సంపూర్ణమైన ఆనందాన్ని, తృప్తిని, పొందలేక పోతున్నారు. వారందరికి ఆత్మజ్ఞానాన్ని కలిగించి, వారి భ్రమలను పోగొట్టి, వారి దుఃఖాన్ని, అసంతృప్తిని పోగొట్టి వారికి శాశ్వత ఆనందం కలిగించాలనే సంకల్పం కలిగింది పరమశివునికి. 


వెంటనే పరమశివుడు ఒక యువకుడైన సాధువు రూపంలో కర్మకాండలు సాగిస్తున్న మునుల వద్దకు చేరుకున్నాడు. వారుభక్తి శ్రద్ధలతో యజ్ఞ కర్మలను చేశారు. అయితే వాటి కారణంగా కలిగిన సిద్ధులతో అహంకారం పెరిగి భగవంతునికి దూరమయ్యారు. అయినా కర్మలను వదలలేదు. ఎవరైతే సత్కర్మలు ఆచరిస్తారో, వారికి భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఆ అనుగ్రహం ఒక మహాత్ముని రూపంలోనో, ఒక గురువు రూపంలోనో కలిగి వారి ద్వారా ప్రయోజనం సిద్ధిస్తుంది. మహాత్ముల దర్శనం వల్ల, గురువుల సాంగత్యం వల్ల 'జ్ఞానసిద్ధి' కలుగుతుంది. మునుల యొక్క సత్కర్మల కారణంగానే భగవంతుని అనుగ్రహం లభించింది. అయితే తమ ఎదుట ప్రత్యక్షమైన యువకుణ్ణి వారసలు చూడనే లేదు. చూసినా పట్టించుకోనే లేదు, వారు. వారివారి కర్మలలో నిమగ్నమయ్యారు. 


అయితే ఆ మునుల భార్యలు మాత్రం ఆ యువకుణ్ణి చూసి అతడి రూపానికి మోహపరవశులై అతడి వెంటబడి పోయారు. అలా ఎంతదూరం వెళ్ళారో, ఎక్కడకు వెళ్ళారో వారికే తెలియదు. అయితే ఆ యువకుణ్ణి వదలకుండా తిరుగుతున్నారు. ఇక్కడ ఈ మునీశ్వరులు తమ భార్యలు కనిపించక పోవటాన్ని గమనించి, చేస్తున్న కర్మలను ఎక్కడివక్కడే వదిలేసి తమ భార్యలను వెతుక్కుంటూ ఆ వనమంతా తిరుగుతున్నారు. అలా తిరిగి తిరిగి ఒక ప్రదేశంలో తమ భార్యలను కనుగొన్నారు. వారుభర్తల వైపుకు చూడకుండా ఆ యువ సాధువు వెంటపడి వెళ్తున్నారు. ఇది చూసిన మునులకు ఆగ్రహం కలిగింది. దీనికంతటికి కారణం ఆ యువసాధువే సని నిశ్చయించుకొని, అతణ్ణి హతమార్చటానికి వారి యోగ శక్తులను, సిద్ధులను ఉపయోగించి అనేక ఆయుధాలు సృష్టించి అతడి మీదికి వదిలారు. 


అయితే ఎన్ని రకాల ఆయుధాలు తనపై పడుతున్నా ఏమాత్రం చలించకుండా, బెదరకుండా ఆ యువ సాధువు చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండిపోయాడు. మునులు తమకున్న సిద్ధులన్నింటిని ప్రయోగించారు కాని ఆ యువకుణ్ణి ఏమీ చేయలేకపోయారు. భగవంతుడిచ్చిన సిద్ధులు భగవంతుడేమి చేయలేవు. అతడు చిరునవ్వులు చిందిస్తూ విలాసంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన మునులకు కనువిప్పు కలిగింది. తమకు లభించిన సిద్ధులు ఏవీ తమను రక్షించలేక పోయాయని, దీనికి కారణం ఆ వచ్చినవాడు సామాన్య సాధుయువకుడు కాదు, సాక్షాత్తు పరమశివుడేనని గ్రహించారు. తమ తప్పులను క్షమించి తమను అనుగ్రహించమని అతని పాదాలపై పడి వేడుకున్నారు. తమ దుఃఖాలన్నీ తొలగి, ఆనందం కలగటానికి తగిన సిద్ధులు ప్రసాదించమని వారు పరమశివుని వేడుకున్నారు. దుఃఖాలు కలగటానికి, అవి తొలగక పోవటానికి కారణం 'సిద్ధులు' లేకపోవటం కాదని, ఆత్మజ్ఞానం లేకపోవటమేనని, ఆత్మజ్ఞానం వల్లనే సమస్త దుఃఖాలు నివృత్తియై శాశ్వత ఆనందం కలుగుతుందని పరమశివుడు వారికి హిత బోధచేసి, వారి అభ్యర్ధనపై వారికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు.

◆వెంకటేష్ పువ్వాడ