అమ్మో అమ్మాయిలు 24
ధర్మరాజుకి పుట్టెడు చెవుడు. ఎదుటి వారు చెప్పింది వినబడటం కలలో మాట. ఆయన చూడబోతే వాగుడు పిట్ట సోదరుడు. అందుకే తనే ప్రశ్నడిగి తనే చెప్పుకుని వినపడ్డట్లు నటిస్తాడు. ఇప్పుడు వున్నట్లుండి అబ్బులు "భోజనం అయిందా!” అంటే ఆయనకి ఆ మాట అర్థం కాలేదు. అర్థం కానప్పుడు ఓ పని చేస్తుంటాడు. అవునూ కాదూ తెలీని విధంగా తల వూపి తప్పించుకుంటాడు. ఆ విధంగానే అబ్బులడిగిందానికి తలాడించి ఊరుకున్నాడు.
“హరీ పిడుగా" అన్నాడు అబ్బులు.
మళ్ళీ తలాడించాడు ధర్మరాజు.
“నా తలనొప్పి పొగొట్టలేరు" అంది జయచిత్ర.
“నాకూ వచ్చిందిరోయ్" అన్నాడు వ్యాకర్ణ.
అబ్బులు తలాడించి చిరునవ్వు నవ్వాడు. "మా గురించి మీ అభిప్రాయం ఏమిటి ధర్మరాజుగారూ!” అన్నాడు. కుర్చీలోంచి కాస్త ముందుకి వంగి ధర్మరాజు వైపు భూతద్దాల్లోంచి తీక్షణంగా చూసి
అబ్బులి ముఖ కవళికలను బట్టి ఏదో పెద్ద ప్రశ్న అడిగాడని దానికి తల ఆడిస్తే చాలదని జవాబు చెప్పాల్సి వుంటుందని ధర్మరాజు గ్రహించాడు. ప్రశ్న తెలిస్తేగా జవాబు చెప్పటానికి! జిడ్డు ధర్మరాజు గారిది బ్రిలియంట్ బుర్ర కాబట్టి "నిజమేనోయ్" అన్నాడు.
“మీ గురించి ఆయన గారి అభిప్రాయం అది విన్నారుగా!” అంది జయచిత్ర.
“దారినపడ్డ సంభాషణ సాగదీస్తా చూడండి" అన్నాడు అబ్బులు.
“అలా అన్నావ్ బాగుంది" అన్నాడు ధర్మరాజు.
“రేప్పొద్దున కూరలు తేవాలండీ!”
“చాలా బాగుంది.”
“కూరలు తేవాలంటే బాగుంటుందంటారేమిటండీ?”
“నా అభిప్రాయం నే చెప్పానబ్బాయ్.”
“ఈయన గారికి మీరెలా యిల్లు ఎలా అద్దెకివ్వగలిగారండి జయచిత్రగారూ ! మొదట ఈయననొచ్చాడా ఈయన భార్య వచ్చిందాండి?” ముఖం ధర్మరాజు వైపు పెట్టి జయచిత్రను అడిగాడు అబ్బులు.
“ఈయన వస్తే యిల్లెలా యిస్తామండి. భాగం ఖాళీ లేదంటే ఉందా అని యక్ష ప్రశ్నలు వేసి చంపుతాడాయె. వుందీ అంటే ఖాళీ భాగాలు లేవు అని వెళ్ళిపోతాడు. ఇలాంటి వన్నీఆవిడ గారే చూసుకుంటుంది....” అంది జయచిత్ర.
అబ్బులడిగిందానికి ధర్మరాజు "నీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానబ్బాయ్!” అన్నాడు.
“నా పిండా కూడు" అన్నాడు అబ్బులు.
“సంతోషం" అన్నాడు ధర్మరాజు.
గతుక్కుమన్నాడు అబ్బులు. వ్యాకర్ణ, జయచిత్ర జాయింట్ గా నవ్వారు. అబ్బులు చిరుకోపం తెచ్చుకుని నవ్వండి నవ్వండి" అన్నాడు. మళ్ళీ అబ్బులి పెదవుల కదిలిక చూసిన ధర్మరాజు "కొన్ని అలాగే వుంటాయి అబ్బాయీ!” అన్నాడు.
అబ్బులికేం చేయాలో తెలియక అర్జంటుగా ఆలోచించి "ఒరేయ్ కర్ణా! ఈ జిడ్డు గారుని మనం జాయింటుగా ప్రశ్నలేద్దాము. ఊ కానియ్!” అన్నాడు. వ్యాకర్ణ తల వూపాడు. తన కుర్చీని ధర్మరాజు కూర్చున్న మోడాకి దగ్గరగా జరుపుకున్నాడు. అబ్బులు కుర్చీని ధర్మరాజు దగ్గరగా జరుపుకున్నాడు అబ్బులు, వ్యాకర్ణ తన దగ్గరగా జరిగి కూర్చోటం ధర్మరాజు చూసి కాస్త కంగారు పడ్డాడు.
“ధర్మరాజు కాలు విరిచేస్తాను" అన్నాడు వ్యాకర్ణ అబ్బులి వైపు తీవ్రంగా చూసి.
“మీరే చెప్పండి. కాలు విరవటం అధర్మం కాదూ? ఏ చెయ్యి అయినా ఫరవాలేదు" అని అబ్బులు ధర్మరాజు వైపు చూశాడు.
“ఊహూ, కాలే నయం కుంటాడిగా బ్రతుకుతాడు".
“ఊహూ, అసలే ఆయనకీ చెవుడు, చెయ్యి లేకపోతే ఫరవాలేదు విరిచెయ్యి.”
“ఏది విరగ్గొటమంటారో చెప్పండి.”
“మర్యాదగా నా వైపు మాట్లాడండి. ఎదిరగొట్టమంటారు?” ధర్మరాజు వైపు చూసి యిరువురు తీవ్రంగా మాట్లాడి మీరు చెప్పండి ఏం చేయాలో అన్నట్లు ధర్మరాజు ముఖంలోకి చూస్తూ ఆగారు యిరువురు.