అమ్మో అమ్మాయిలు 25

 

ధర్మరాజుకి పచ్చి వెలక్కాయ గొంతు కడ్డంగా పడినట్లయింది. “ఎందుకబ్బాయిలూ! యింత చిన్న విషయానికి పోట్లాడుకుంటారు! “నువ్వు చెప్పిందీ బాగానే వుంది. అతను చెప్పిందీ బాగానే వుంది. ఇద్దరూ ఓ మాటకొచ్చి కానీండి పని" అన్నాడు చిరునవ్వుతో.

జయచిత్ర పగలపడి నవ్వింది.

“సలహా చెప్పినా యింకా కోపంగా చూస్తారేమిటర్రా అబ్బాయిలూ! నా మాట నచ్చలేదా? పోనీ ఓ పని చేయండి. మీ యిద్దరిలో పెద్ద ఎవరో వాళ్ళ మాట రెండో వాళ్ళు వినండి. నాకు అభ్యంతరం లేదు.” అన్నాడు ధర్మరాజు.

“పెద్దాడిని నేను కాబట్టి మీ కాలు నేనే యిరుస్తాను" అన్నాడు వ్యాకర్ణ సీరియస్ గా ధర్మరాజు కళ్ళలోకి చూసి.

“అలా అన్నావు బాగుంది" అన్నాడు ధర్మరాజు.

ఈ దఫా జయచిత్రతో పాటు అబ్బులు, వ్యాకర్ణ కూడా నవ్వారు.

తనేదో పొరపాటు మాట్లాడానని ధర్మరాజు గ్రహించాడు. ఇంకా అక్కడే కూర్చుంటే మరింత నవ్వుల పాలు కాక తప్పదని మొహం మించి లేచి "వస్తానురా అబ్బాయిలూ! నిద్రొస్తుంది. అన్నదమ్ముల్లా కలిసున్నా స్నేహితులు అనవసరంగా తగులాడుకొకండి. నువ్వన్నా చెప్పు జయచిత్రమ్మా! ఎవరో ఒకరుడు రెండో వారి మాట విని అలా చేయమని.......” అని సలహా యిచ్చి ధర్మరాజు వెళ్ళిపోయాడు.

ధర్మరాజు వెళ్ళిన తరువాత ముగ్గురు అలా ఓ పది నిమిషాలు నవ్వుకుని తర్వాత నవ్వాపేసి "పాపం" అనుకున్నారు ధర్మరాజుని తలుచుకుని.

“నిజమే పాపం అనిపిస్తుంది. ఎగతాళి చేయకూడదు. నవ్వకూడదు అనిపిస్తుంది. ఏ కుంటివాడినో గుడ్డివాడినో చూసి నవ్వామనుకోండి. అది మానవులు చెయ్యాల్సిన పని కాదు, రాక్షసుడు చేసే పని. చెవిటి వాళ్ళని, మూగవాళ్ళని తలుచుకుంటే పాపం అనిపిస్తుంది కాని వారి చేష్టలు వద్దన్నా నవ్వు తెప్పిస్తాయి" అంది జయచిత్ర.

నిజం కాబట్టి "నిజమే" నని వప్పుకుని తలాడించాడు అబ్బులు, వ్యాకర్ణ.

“తలనొప్పి తగ్గిందాండి" వ్యాకర్ణ అడిగాడు.

“మీరు ధర్మరాజుగారి కాలు విరగొట్టినప్పుడే నా తలనొప్పి తగ్గిపోయింది.” అంది జయచిత్ర.

కాసేపు ముగ్గురూ కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత జయచిత్ర వద్ద శలవు తీసుకుని వచ్చేశారు అబ్బులు, వ్యాకర్ణ.

ఆ రాత్రి జయచిత్ర కలలోకి వ్యాకర్ణ, వ్యాకర్ణ కలలోకి జయచిత్రా వచ్చారు. అబ్బులు కలలోకి ధర్మరాజు "నాథా" అనుకుంటూ వృద్ద సుకన్య వచ్చారు,

ఆ రాత్రి అలా జరిగిపోయి తెల్లారింది.

“రాత్రి బాగా నిద్రపట్టిందా? అని అడిగాడు వ్యాకర్ణ.

“ఎలా పడుతుంది! మా నాన్నమ్మా వూరి కెళ్ళిందాయె" అని పైకని "మీరు రాత్రంతా నా పక్కనే వుండి అదేం ప్రశ్న!” అని లోపల అనుకుంది జయచిత్ర. తర్వాత...... 'మీకు రాత్రి బాగా నిద్ర పట్టిందా?” అని వ్యాకర్ణని అడిగింది.

వ్యాకర్ణ రాత్రి కలలోంచి యింకా తేరుకోలేదు. 'ఎలా పడుతుందండీ! మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు. రాత్రంతా నా పక్క నుండి నన్నల్లరి చేశారు. ఏడిపించారు" అని జయచిత్రముఖ కవళికలు మారటం చూసి తన పొరపాటు గ్రహించి. “సారీ జోక్ చేశాను ఏమనుకొకండి" అని చెప్పి అక్కడుంటే ఏం జరుగుతుందో ఏం ఎదుర్కోవాల్సి వస్తుందో అని పరుగున తన గదిలోకి వచ్చేశాడు.